వైఎస్ వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా? సిబిఐ విచారణ చివరి దశకి చేరుకోవడంతో అసలు దోషులను తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారా ? ఎప్పుడూ బయటకు రాని వైఎస్ కుటుంబ సభ్యులు ఇప్పుడు ప్రకటనలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి ?
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన మాజీమంత్రి వివేకా హత్య కేసులో కొత్త కోణాలు బయటకు వస్తున్నాయి. ఇప్పటికే సిబిఐ విచారణ చివరి అంకానికి చేరుకోవడంతో సూత్రదారులు, పాత్రదారుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.ఈ నేపధ్యంలో కేసును పక్కదోవ పట్టించేందుకు వివిధ రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయనే వాదన బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగానే ఎప్పుడూ బయటకు రాని వైఎస్ కుటుంబ సభ్యులను తెరపైకి తెచ్చి వారితో ప్రకటనలు చేయించడం కొత్త డ్రామాకు తెర లేపడమే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఓ వైపు విచారణ వేగవంతం చేసిన సిబిఐ కేసును ఓ కొలీక్కి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగా అనుమానితులుగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి, మనోహర్ రెడ్డి లను విచారించాలని నిర్ణయించారు సిబిఐ అధికారులు. అయితే అవినాష్ రెడ్డి సిబిఐ నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. ఇక కడప కోర్టు ద్వారా రెండోసారి అవినాష్ రెడ్డికి సిబిఐ నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయగా కుదరలేదు.
ఇదిలా ఉంటే కేసు విషయంలో వైఎస్ కుటుంబ సభ్యులతో కొత్త డ్రామాకు తెర తీశారు అనే చర్చ జోరందుకుంది.ఎప్పుడూ మీడియా ముందుకు రాని వైఎస్ రాజశేఖర్ రెడ్డి, వివేకానంద రెడ్డి చెల్లెలు వీ విమలా రెడ్డి ఇటీవల ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హత్య కేసులో అవినాష్ రెడ్డికి ప్రమేయం లేదంటూ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే సిబిఐ విచారణ తుది దశకు చేరుకుంది. అందరి వెళ్ళు అవినాష్ రెడ్డి వైపే చూపెడుతుంటే వైఎస్ విమలా రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం అవినాష్ రెడ్డిని కేసు నుంచి తప్పించేందుకు చేస్తున్న ప్రయత్నం లాగానే కనిపిస్తోంది.అయితే ఇదంతా వివేకా చెల్లెలు అయిన విమలా రెడ్డి వంటి వారి చేత ఇటువంటి ప్రకటనలు చేయిస్తే ఎంతో కొంత ప్రభావం ఉంటుందని, కేసు పక్కదారి పట్టి కేసును జాప్యం చేసేందుకు ఉపయోగపడుతుందనే ఆలోచనతో చేస్తున్న కుట్ర అనే చర్చ రాజకీయ వర్గాలలో జోరుగా సాగుతోంది.
Must Read :-కీలక దశకు చేరుకున్న వివేకా హత్య కేసు విచారణ!