దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఆస్తుల వివాదం తీవ్రస్థాయికి చేరడంతో.. ఆయన అకాల మరణం చుట్టూ ఉన్న అనుమానాలు మళ్లీ బలపడుతున్నాయి. సరిగ్గా 2009 జూన్ నెలలో జెరూసలెం పర్యటనలో ఉన్నప్పుడు YSR ఆస్తుల పంపకాలపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉమ్మడిగా ఉన్న కుటుంబ ఆస్తులన్నింటినీ తన ఇద్దరు పిల్లలైన జగన్, షర్మిలకు, అలాగే నలుగురు మనవలు, మనవరాళ్లకు సమానంగా పంచాలని స్పష్టంగా చెప్పారు. YSR ప్రాణంతో ఉన్నంత వరకు ఆస్తుల పంపిణీ జరగలేదని, అవన్నీ ఉమ్మడి కుటుంబ ఆస్తులేనని విజయమ్మ స్పష్టం చేశారు. అయితే, ఆస్తుల సమాన పంపిణీపై చర్చ జరిగిన కేవలం రెండు మూడు నెలలకే…అంటే 2009 సెప్టెంబర్ 2న—YSR హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోవడం అనుమానాలు కలిగిస్తోంది.
ఆస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తి కాకుండానే YSR అకస్మాత్తుగా మరణించడం, ఆ తర్వాత ఆస్తులన్నీ ఏకపక్షంగా జగన్ మోహన్ రెడ్డి చేతుల్లోకి వెళ్లడంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. వైఎస్సార్ ఇచ్చిన మాటను, చివరి కోరికను జగన్ పక్కన పెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా YSR సతీమణి విజయమ్మ రాసిన బహిరంగ లేఖలు, బయటకు వచ్చిన ఒప్పంద పత్రాలు ఈ విషయాలను స్పష్టం చేస్తున్నాయి. బెంగళూరులోని యలహంక ప్యాలెస్ యాజమాన్య హక్కులతో పాటు ఆస్తుల సమాన పంపిణీ విషయంలో YSR ఆఖరి కోరికను జగన్ తొక్కిపెట్టారని, ప్రస్తుతం YSR సతీమణి, కుమార్తె రోడ్డున పడే పరిస్థితులు రావడంతో నాడు YSR మరణం వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా అనే పాత అనుమానాలు మళ్లీ బలపడుతున్నాయి.
బెంగళూరులోని యలహంకలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భారీ ప్యాలెస్‌ను వైఎస్సార్ స్వయంగా నిర్మించారు. టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఓ కథనం ప్రకారం వైఎస్సార్ బ్రతికి ఉన్న సమయంలో ఆయన కుమార్తె వైఎస్ షర్మిల, అల్లుడు అనిల్ కుమార్ దంపతులు ఈ ప్యాలెస్‌లోనే నివసించేవారు, YSR కూడా తరచూ అక్కడికి వెళ్లేవారు. అంతేకాకుండా, 2019 ఆగస్టు 31న జరిగిన ఒప్పంద పత్రాలలో సైతం షర్మిల గారి నివాస చిరునామాగా 177/1, బాగలూరు రోడ్డు, యలహంక, బెంగళూరు అని అధికారికంగా పేర్కొన్నారు. కానీ, వైఎస్సార్ మరణానంతరం ఈ ప్యాలెస్, పరిసర భూములకు వెళ్లే హక్కుల విషయంలో వివాదాలు ముదిరి, సొంత కుటుంబ సభ్యులకే ప్రవేశం నిరాకరించారనే ఆరోపణలు వస్తున్నాయి.
2019లో జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత ఆస్తులు పంచే ప్రక్రియలో భాగంగా MOU రాసుకున్నప్పటికీ, ఒప్పందం ప్రకారం దక్కాల్సిన సరస్వతి సిమెంట్స్ వంటి ఆస్తులను షర్మిలకు బదిలీ చేయకుండా జగన్ నిలిపివేశారు. అంతటితో ఆగకుండా NCLT కోర్టును ఆశ్రయించడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసింది. MOUలో లేని యలహంక భూమి కూడా షర్మిలకే చెందుతుందని, జగన్ తన మేనల్లుడు, మేనకోడళ్లకు తీవ్ర అన్యాయం చేశారని విజయమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ ఇచ్చిన మాటను, చెల్లికి చేయాల్సిన బాధ్యతను జగన్ పూర్తిగా విస్మరించారని ఆమె స్పష్టం చేశారు.











