వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి జాతీయ రాజకీయాల విషయంలో యూటర్న్ తీసుకుంటున్నారనే చర్చ మొదలైంది. గత పదేళ్లుగా కేంద్రంలోని BJP ప్రభుత్వానికి పార్లమెంట్‌లోనూ, బయటా అన్ని కీలక విషయాల్లోనూ మద్దతు ఇస్తూ వచ్చిన ఆయన..ఇప్పుడు అనూహ్యంగా విపక్ష ఇండి కూటమి వైపు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం జోరందుకుంది. ముఖ్యంగా ఎన్నికల సంఘం పనితీరు, CEC జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ వస్తున్న CJP, యువత నిరసనలకు జగన్ సపోర్ట్ చేయడం ఈ పొలిటికల్ టర్న్‌కు సంకేతం.
ఢిల్లీ వర్గాల సమాచారం ప్రకారం..జగన్ ఇటీవల కాంగ్రెస్ అగ్రనాయకత్వాన్ని రహస్యంగా కలిశారనే ప్రచారం రాజకీయాల్లో కలకలం రేపుతోంది. తమిళనాడు సీఎం జయలలిత మాజీ సలహాదారు విష్ణు రెడ్డి మధ్యవర్తిత్వంతో ఈ సమావేశం జరిగినట్లు, అలాగే బెంగళూరులో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ KC వేణుగోపాల్‌తోనూ ఆయన భేటీ అయ్యారనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అధికారికంగా ఈ భేటీలను వైసీపీ ధృవీకరించనప్పటికీ, ఇవి కేవలం టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆ పార్టీ కొట్టిపారేస్తోంది. అయినప్పటికీ, ఈ పరిణామాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జగన్ తన రాజకీయ వైఖరిని మార్చుకోవడానికి ప్రధాన కారణం ఏపీలోని ప్రస్తుత రాజకీయ సమీకరణాలే అని విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ప్రస్తుతం కేంద్రంలోని NDA కూటమిలో అత్యంత కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. టీడీపీ బలమైన కూటమిలో ఉండటంతో, గతంలో మాదిరిగా బీజేపీతో సఖ్యత కొనసాగించడం జగన్‌కు కష్టతరంగా మారింది. దీనికి తోడు ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల విచారణలు వేగవంతం కావడం కూడా ప్రత్యామ్నాయ రాజకీయ మార్గాలను అన్వేషించేలా ఆయనను ప్రేరేపిస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో ఎలక్షన్ కమిషన్ నియామకాల చట్టం-2023కి మద్దతు తెలిపిన వైసీపీ, ఇప్పుడు పూర్తిగా మాట మార్చి CEC నియామకపు పాత పద్ధతినే పునరుద్ధరించాలని డిమాండ్ చేయడం గమనార్హం. 2024 ఎన్నికల్లో ఓటింగ్ శాతంలో తేడాలు, EVM రీడింగ్స్ వంటి 9 కీలక అంశాలపై ECని నిలదీయడమే కాకుండా, విజయవాడలో CPI ప్రతినిధి బృందంతో సమావేశమై ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై కలిసి పోరాడతామని ప్రకటించారు. వామపక్షాలతో చేతులు కలపడం, జాతీయ స్థాయిలో విపక్షాల వైపు చూడటం జగన్ పొలిటికల్ టర్న్‌కు నిదర్శనం
మొత్తానికి, ప్రస్తుతానికి ఇండియా కూటమిలో చేరికపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడకపోయినా.. 2029 ఎన్నికల నాటికి జాతీయ స్థాయిలో తన ప్రత్యామ్నాయ ఆప్షన్లను ఓపెన్‌గా ఉంచుకోవాలని జగన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.











