YSRCP Complaint Against Social Media Post :
ఏపీలో అధికార పార్టీగా కొనసాగుతున్న వైఎస్సార్సీపీ నిజంగానే సోషల్ మీడియా దెబ్బకు తల్లడిల్లిపోయిందనే చెప్పాలి. సోషల్ మీడియాలో తమను మించిన వారు లేరన్న కోణంలో మొన్నటిదాకా భుజాలు ఎగరేసిన వైసీపీ.. ఇప్పుడు అదే సోషల్ మీడియా దెబ్బకు బెంబేలెత్తిపోయింది. అసలు ఆ పార్టీ నేతలను ఇంతలా భయపెట్టిన సోషల్ మీడియా ఏ వర్గానికి చెందినతో తెలియదు గానీ.. ఆ సోషల్ మీడియా పోస్టుల దెబ్బకు వైసీపీ నేతలు నేరుగా పోలీసులను ఆశ్రయించక తప్పలేదు. మొత్తంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒకరకమైన కథనాలు వస్తూనే ఉన్నాయి. అవి ఆయా వర్గాలను టార్గెట్ చేస్తూనే ఉన్నాయి. అయితే సదరు కథనాలతో ఇప్పుడు భయపడినంతగా ఏ ఒక్క వర్గం భయపడలేదనే చెప్పాలి. అయినా వైసీపీ ఇంతలా భయపడిపోవడానికి గల కారణాలే ఏమిటన్న విషయంలోకి వెళ్లదాం పదండి.
భయపెట్టిన కథనమేంటంటే..
ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న కేసులో వైసీపీ అధినేత. ఏపీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిలు ఈ నెల 14న రద్దవుతుందంటూ సోషల్ మీడియాలో ఓ కథనం వైరల్ అయ్యింది. ఈ కథనంలో ఆ రోజున టీడీపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. కడప, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోని ఓ వర్గం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరించారట. దీనిని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ కేంద్ర కార్యాలయ సమన్వయకర్త లేళ్ల అప్పిరెడ్డి, ఆ పార్టీ న్యాయ విభాగం అధ్యక్షుడు మనోహర్ సీఐడీ అదనపు డీజీ సునీల్ కుమార్‌కు మంగళవారం ఫిర్యాదు చేశారు. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా, ఓ వర్గం ప్రజలను రెచ్చగొట్టేలా ఈ కథనం ఉందని, ఈ కథనం ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో పోలీసులను కూడా నమ్మవద్దని, 1988 డిసెంబరు, 1991 మేలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలే జరిగాయని, పోరాటం అంతిమ దశకు చేరుకుంటుండడంతో అప్రమత్తంగా ఉండాలని ఆ కథనంలో పేర్కొన్నారని వైసీపీ నేతలు పేర్కొన్నారు.
వైసీపీ సోషల్ మీడియాదీ అదే దారి
వాస్తవంగా సోషల్ మీడియా అంటేనే.. ఏ వర్గానికి అనుకూలంగా ఆ వర్గానికి చెందిన సోషల్ మీడియా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీకి చెందిన సోషల్ మీడియా కూడా ఆ పార్టీకి అనుకూలంగా.. వైరి వర్గాలపై విషం చిమ్మేలా కథనాలు ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ లపై వైసీపీ సోషల్ మీడియాలో ఏ మేర అనుచిత వ్యాఖ్యలు వినిపిస్తుంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని కూడా లేదు. వీటిపై టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదులను పోలీసులు పట్టించుకున్న దాఖలా కూడా లేదనే చెప్పాలి. అదే సమయంలో వైసీపీ నేతలు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందిస్తున్న తీరు కూడా విమర్శలకు తావిస్తోంది. మొత్తంగా సోషల్ మీడియా అంటేనే.. కల్పిత కథనాలే ఎక్కువగా, ప్రత్యర్థి వర్గమే టార్గెట్ గా దూసుకుపోతోంది కదా. మరి ఇలాంటి కథనాలపై వైసీపీ నేతలు పెద్ద ఎత్తున ఆందోళనకు గురి కావడం, దానిపై ఏకంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం నిజంగానే ఆసక్తి రేకెత్తించేదే.
Must Read ;- అనర్హత ఎవరిపై?.. వైసీపీపైనా? రఘురామపైనా?