కేరళలోని కొచ్చి వేదికగా నిర్వహించిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ సదస్సులో దక్షిణాదికి చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు, వివిధ రంగాల నిపుణులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. తెలుగుదేశం నుంచి నారా లోకేష్, కాంగ్రెస్ నుంచి భట్టి విక్రమార్క, BRS నుంచి కేటీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ముఖ్య నేతలు పాల్గొని జాతీయ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు. ఆయా రాష్ట్రాల ఆర్థిక విధానాలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు. అయితే అన్ని ప్రధాన పార్టీల నుంచి ప్రాతినిధ్యం లభించినప్పటికీ, వైఎస్సార్సీపీ నుంచి మాత్రం ఒక్క నాయకుడు కూడా హాజరుకాకపోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జాతీయ స్థాయి కాంక్లేవ్స్కు దూరంగా ఉండడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా జగన్ తన రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ నేషనల్ లెవల్ కాంక్లేవ్స్లో లేదా ప్రత్యక్ష వేదికలపై పాల్గొన్న సందర్భాలు చాలా అరుదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించే ఇటువంటి సదస్సుల్లో రాజకీయ, ఆర్థిక, సాంకేతిక అంశాలపై విశ్లేషణాత్మక ప్రశ్నలు ఎదురవుతాయి. ప్రత్యక్ష చర్చల్లో ముందస్తు స్క్రిప్ట్ లేకుండా మాట్లాడాల్సి రావడం, క్లిష్టమైన ప్రశ్నలకు తక్షణమే జవాబు చెప్పాల్సి రావడం వల్లే జగన్ ఇటువంటి వేదికలను నివారిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
కేవలం ముందుగా రాసిచ్చిన ప్రసంగాలను చదవడానికి మాత్రమే జగన్ పరిమితమవుతారని, సబ్జెక్ట్‌పై లోతైన అవగాహన లేకపోవడమే ఆయన కాంక్లేవ్స్కు దూరంగా ఉండడానికి కారణమని విమర్శకులు ఆరోపిస్తున్నారు. జాతీయ మీడియాతో నేరుగా ముఖాముఖి మాట్లాడటంలో ఉన్న అభద్రతా భావం, క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనేమోనన్న భయమే ఆయనను ఇటువంటి వేదికలకు దూరం చేస్తోందనే విశ్లేషణలు సాగుతున్నాయి. గతంలోనూ పలు జాతీయ సదస్సులకు ఆహ్వానాలు వచ్చినా ఆయన దూరంగానే ఉండడం ఈ వ్యాఖ్యలకు బలం చేకూరుస్తోంది.
జాతీయ స్థాయిలో సొంత దృక్పథాన్ని, పార్టీ సిద్ధాంతాలను వివరించే ఛాన్స్ లభించినా వైసీపీ వినియోగించుకోకపోవడంపై రాజకీయ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు ఇతర ప్రాంతీయ పార్టీల నేతలు నేషనల్ మీడియా వేదికలపై తమ బలాన్ని ప్రదర్శిస్తుంటే, జగన్ మాత్రం తన సొంత ప్రెస్ మీట్లు, స్క్రిప్టెడ్ సమావేశాలకే పరిమితం కావడం ఆయన నాయకత్వ శైలిలోని ప్రధాన లోపంగా మారుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇక, ఇండియా టుడే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అక్షిత నందగోపాల్ సైతం X వేదికగా ఈ అంశంపై స్పందించారు. వైసీపీకి స్పష్టమైన ఆహ్వానం పంపామని, వారితో నిరంతరం సంప్రదింపులు జరిపినప్పటికీ ఆ పార్టీ నుంచి హాజరుకావడానికి ఎవరూ ముందుకు రాలేదని పోస్ట్ చేశారు. ఇండియా టుడే కాంక్లేవ్ దక్షిణాదిలోని ప్రతి పార్టీ భావాలకు, గొంతుకకు వేదికను ఇస్తుందని స్పష్టం చేశారు.











