ఇండియా కూటమి వైపు వైసీపీ అడుగులు వేస్తోందనే ప్రచారం వేళ, ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. వైసీపీతో కలసి నడుస్తామని CPI ప్రతినిధులు ప్రకటించారు. CPI నేతలు కె. రామకృష్ణ, జి. ఈశ్వరయ్యల నేతృత్వంలోని ప్రతినిధి బృందం తాడేపల్లిలో వై.ఎస్. జగన్‌తో సమావేశమై, ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించింది. ఇన్నాళ్లూ వైసీపీకి దూరంగా ఉన్న CPI నేతలు హఠాత్తుగా జగన్‌ను కలవడం, కలసి నడుస్తామని చెప్పడంతో ఈ సమావేశంతోనే వైసీపీ ఇండి కూటమి వైపు అడుగులు వేస్తోందనే ప్రచారం మరింత బలపడింది.
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిలోకి జగన్ మోహన్ రెడ్డి చేరేందుకు అవసరమైన ప్రాథమిక చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు జాతీయ రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ అందించిన వ్యూహాత్మక రోడ్‌మ్యాప్‌లో భాగంగానే ముందుగా రాష్ట్రంలో కమ్యూనిస్టులతో జగన్ భేటీ అయ్యారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. జాతీయ కూటమిలోకి వెళ్లే ముందస్తు ప్రణాళికలో భాగంగానే ప్రాంతీయంగా ఉన్న భావసారూప్య శక్తులను ఏకతాటిపైకి తెస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే ఈ సమీకరణాల్లో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సంబంధించిన కొన్ని రాజకీయ, ఇతర అంశాలు ఇంకా కొలిక్కి రావాల్సి ఉంది. ప్రస్తుతం ఆయా అంశాలపై కాంగ్రెస్ అంతర్గత వర్గాల్లో చర్చలు జరుగుతుండగా, ఇవన్నీ పూర్తిస్థాయిలో కొలిక్కి వచ్చిన తర్వాతే ఇండియా కూటమిలో వైసీపీ చేరికపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరోవైపు జగన్ ఈ పరిణామాలను తన రాజకీయ రక్షణ కోసం వ్యూహాత్మకంగా ఉపయోగించుకుంటున్నారనే విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. తనపై తీవ్రమవుతున్న కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడిని తగ్గించుకునేందుకే ఈ కొత్త పొత్తు ఎత్తుగడలు వేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒత్తిడి తగ్గించకపోతే కాంగ్రెస్ వైపు వెళ్లిపోతాననే బ్లాక్మెయిల్ సంకేతాలను ఢిల్లీకి పంపుతున్నారని, ఒకవేళ కేంద్రం నుండి ఒత్తిడి తగ్గితే ఏ క్షణంలోనైనా కాంగ్రెస్, కమ్యూనిస్టులను ఆయన నిస్సంకోచంగా పక్కనపెట్టే అవకాశం ఉందనే చర్చ నడుస్తోంది..











