వల్లభనేని వంశీ, కొడాలి నాని..ఈ ఇద్దరికి రాజకీయ జన్మనిచ్చింది తెలుగుదేశం పార్టీనే. కానీ అలాంటి పార్టీకి ఈ ఇద్దరూ కష్ట సమయాల్లో వెన్నుపోటు పొడిచారు. 2012లో కొడాలి నాని టీడీపీని వీడారు. 2019 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై గెలిచిన వంశీ..తర్వాత వైసీపీ పార్టీలో అనధికారిక సభ్యుడిగా చేరిపోయారు. 2019లో వైసీపీ అధికారంలో రావడంతో ఈ ఇద్దరి ఆగడాలు పెచ్చుమీరాయి. టీడీపీ నేతలను, కార్యకర్తలను వంశీ,నాని టార్గెట్ చేశారు. అంతటితో ఆగకుండా టీడీపీ అధినేత చంద్రబాబు ఫ్యామిలీని టార్గెట్ చేశారు. అనకూడని మాటలు అన్నారు. రాజకీయంగా కాకుండా వ్యక్తిగతంగానూ టీడీపీకి శత్రువులుగా మారారు ఈ ఇద్దరూ. అధికారం అండ చూసుకుని టీడీపీ నేతలను మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. తెలుగుదేశం పార్టీ బంపర్ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తమను ఇబ్బంది పెట్టిన ఏ ఒక్కరిని వదిలిపెట్టబోమని ఆనాడే లోకేష్ చెప్పారు. రెడ్ బుక్‌లో నాని, వంశీ సహా పలువురు పేర్లు రాసిపెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతీకార చర్యలు ఉంటాయని తెలుగుదేశం కార్యకర్తలు ఆశించారు. కానీ అందుకు విరుద్ధంగా చంద్రబాబు ప్రతీకార దాడులు ఉండవని, పాలనపై దృష్టి పెడతామని చెప్పారు. చంద్రబాబు చెప్పినట్లుగానే గడిచిన 6-7 నెలల్లో ఎలాంటి రాజకీయ దాడులు జరగలేదు.
కానీ టైం వస్తే వదిలిపెట్టకూడదనేది టీడీపీ నేతల ప్లాన్. ఇప్పుడు వంశీ టైం వచ్చింది. వంశీని విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. వంశీ అరెస్టు తర్వాత నెక్ట్స్ ఎవరన్న చర్చ మొదలైంది. ఈ లిస్టులో ప్రధానంగా వినిపిస్తున్న పేర్లు కొడాలి నాని, జోగి రమేష్, పేర్ని నాని ఉన్నారు. ఇప్పటికే కొంతమంది కోర్టుల్లో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్లు పెట్టుకోగా..మరికొంత మంది విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారు.
ఐతే ప్రధానంగా ఇప్పుడు అందరి దృష్టి కొడాలి నానిపై పడింది. నెక్ట్స్ అరెస్టు చేసేది నానినే అన్న ప్రచారం జోరందుకుంది. ఐతే వైసీపీ ఘోర పరాజయం తర్వాత నాని అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అడపాదడపా కనిపించడం తప్ప పెద్దగా యాక్టివ్‌గా లేరు. ఐతే ఇప్పుడు వంశీ అరెస్టు తర్వాత నాని మరింత సేఫ్ జోన్‌లోకి వెళ్లారని తెలుస్తోంది. కొడాలి నానిపై ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. కొడాలి నాని అరెస్టు కూడా పెద్ద ఆలస్యమేం కాదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కానీ టైమింగ్ కోసమే ఎదురుచూస్తున్నారన్న మాట వినిపిస్తుంది. ఇక వైసీపీ ఘోర పరాజయానికి వంశీ, నాని దుందుడుకు చర్యలు కూడా కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నాని, వంశీలను అరెస్టు చేసిన వైసీపీ క్యాడర్ పెద్దగా లెక్కలోకి తీసుకోదని చెప్తున్నారు.