వై.ఎస్.ఫ్యామిలీ కంచుకోట బద్దలు కొట్టేందుకు తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా మాజీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీపై తెలుగుదేశం పార్టీ కన్నేసింది. జగన్‌కు చెక్ పెట్టేలా పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ఏపీలో ఇప్పటికే పలు మున్సిపాలిటీలు టీడీపీ వశమయ్యాయి. ఈ నేపథ్యంలోనే పులివెందులలోనూ జగన్‌ను ఢీ కొట్టేలా టీడీపీ మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.
పులివెందులలో ఫ్యాన్ పార్టీని దెబ్బ కొట్టే ప్లాన్‌లో భాగంగా ప్రజల్లో బలం ఉన్న నేతలను టీడీపీలో చేర్చుకోవడానికి స్థానిక కేడర్ సిద్ధమవుతోంది. పులివెందులలో పరిస్థితులను స్థానిక నేతలు ఎప్పటికప్పుడూ అధిష్టానానికి వివరిస్తున్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 30వ వార్డు వైసీపీ కౌన్సిలర్ షాహిదాతో పాటు 20 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వీరితో పాటు పులివెందుల నుంచి భారీ సంఖ్యలో నేతలు, కార్యకర్తలు టీడీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారు.
గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,తెలుగుదేశం, జనసేన కూటమికి ఏపీ ఓటర్లు బంపర్ మెజార్టీ ఇచ్చారు. దీంతో చంద్రబాబు నాలుగోసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. ఇక కూటమి దెబ్బకు ఫ్యాన్ విలవిలలాడింది. కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. గత ఐదేళ్లలో జగన్ వ్యవహార శైలి, వైసీపీ ప్రభుత్వంలో చోటు చేసుకున్న పరిణామాలతో ప్రజలు వైసీపీపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దీంతో ఆ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా మెజార్టీ నేతలు పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నారు.
ఇక వై నాట్ 175 నినాదంతో ఎన్నికల ముందు రాష్ట్రమంతా తిరిగిన జగన్..ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని రీతిలో ప్రజలు ఛీ కొట్టారు. ప్రతిపక్ష హోదా కేటాయించాలని స్పీకర్ అయ్యన్నకు జగన్ లేఖ రాశారు. కానీ నిర్దేశించిన సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష హోదా ఇవ్వలేమంటూ స్పీకర్ స్పష్టం చేశారు. దీంతో జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఐతే జగన్ తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నారు. అసెంబ్లీకి వెళ్లకుంటే గుర్తింపు ఉండదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలో కింది స్థాయి నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.