అమరావతి రైతులు ముమ్మాటికీ పెయిడ్ ఆర్టిస్టులేనని పశుసంవర్ధక శాఖ మంత్రి అప్పలరాజు చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. విమానంలో ఢిల్లీ వెళ్లిన రైతులు ముమ్మాటికీ పెయిడ్ అర్టిస్టులేనని ఆయన విమర్శించారు. అమరావతి రైతులపై రాయడానికి వీలుకాని భాషలో తిట్టిన మరో మంత్రి ధర్మాన కృష్ణదాస్ వ్యాఖ్యలను కూడా తాను సమర్థిస్తున్నానని అప్పలరాజు స్పష్టం చేశారు. ఢిల్లీ వెళ్లిన వారిలో అసలు ఎవరైనా రైతుల్లాగా ఉన్నారా? అంటూ మంత్రి అప్పలరాజు ప్రశ్నించారు. అప్పలరాజు తాజా వ్యాఖ్యలపై అమరావతి రైతులు నిప్పులు చెరుగుతున్నారు.
అమరావతి రైతులే టార్గెట్…
అమరావతి రాజధాని రైతులు తమ ఉద్యమాన్ని ఉధృతం చేసిన ప్రతిసారీ ఎవరో ఒక మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మూడు రాజధానుల ప్రకటన చేసిన కొత్తలో మంత్రి బొత్స అమరావతా? భ్రమరావతా? హైమావతా? అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. అమరావతి అంతా గ్రాఫిక్స్ అంటూ విమర్శలు చేశారు. ఇక స్పీకర్ తమ్మినేని అయితే అమరావతి రాజధాని శ్మశానాన్ని తలపిస్తోందని చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి. ఇక పౌరసంబంధాల శాఖా మంత్రి కొడాలి నాని మరో అడుగు ముందుకు వేసి, పేదలకు సెంటు భూమి ఇవ్వడానికి అంగీకరించని ప్రాంతంలో లెజిస్లేటివ్ రాజధాని పెట్టాల్సిన అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. తాజాగా ధర్మాన కృష్ణదాస్, అప్పలరాజు అమరావతి రైతులనే టార్గెట్ చేశారు.
మీడియాను పక్కదారి పట్టించేందుకేనా?
ఏపీలో వైసీపీ పాలనపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. కరోనాను ఎదుర్కోవడంలో విఫలమయ్యారని ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరో వైపు ఏపీని అప్పుల ఆంధ్రప్రదేశ్ గా మార్చారని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ఇక సోషల్ మీడియాలో ఏపీలో రహదారులపై ప్రభుత్వం పశువులకు కూడా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసిందని ఫొటోలతో సహా కామెంట్లు పెడుతున్నారు. ప్రజల వద్ద ముక్కుపిండి పన్నులు వసూలు చేసి సెంటు భూమి పేరుతో వేల కోట్లు దోచుకున్నారంటున్న ప్రతిపక్షాల విమర్శలను మీడియా నుంచి దారి మళ్లించేందుకే అమరావతి రాజధాని రైతులను ప్రతి పక్షం రోజులకు ఒక మంత్రి తెరమీదకు వచ్చి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హైకోర్టులో కేసుండగా… మంత్రి వ్యాఖ్యలా…
అమరావతి రాజధానిపై హైకోర్టులో రోజు వారీ విచారణ కూడా ప్రారంభమైంది. కోర్టులో కేసులు నడుస్తుండగా అమరావతి రాజధాని, భూములిచ్చిన రైతులపై మంత్రులే అనుచిత వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో అనేక సమస్యలను గాలికి వదిలేసి అవకాశం దొరికినప్పుడల్లా మంత్రులు అమరావతి రైతులను టార్గెట్ చేసుకుంటున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు.
అధికారమిచ్చాం…అనుభవిస్తున్నాం…
వైసీపీకి ఓట్లు వేసి అధికారం అప్పగించినందుకు మా చెప్పుతో మేమే కొట్టుకోవాల్సి వచ్చిందని రాజధాని రైతులు వాపోతున్నారు. రాజధానికి భూములిచ్చి ఒకవైపు, సాగు లేక మరోవైపులా తయారైందని, పూటగడవడం కూడా కష్టంగా ఉందని రైతులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇలాంటి సమయంలో రాజధాని రైతులపై మంత్రులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి వారి నోరు ఎలా వస్తోందని మందడానికి చెందిన రైతు పరమేశ్వర్ రాజు ప్రశ్నిస్తున్నారు.