ఏపీ అసెంబ్లీలో కొవిడ్ కలకలం మొదలైంది. అధికార వైసీపీకి చెందిన తణుకు ఎమ్మెల్య కారుమూరి నాగేశ్వరరావుకి కోవిడ్ పాజిటీవ్ వచ్చినట్టు తేలింది. ఆయన త్వరగా కోలుకోవాలని సర్వత్రా ఆకాంక్ష వ్యక్తమవుతోంది. కరోనాని వ్యాప్తి చేయాలని, పలానా వ్యక్తికి కరోనా రావాలని ఏ ఒక్కరూ కోరుకోకూడదు.. కాని ముందు జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం విమర్శలు తప్పవు.
90శాతం మంది మాస్క్‌లు లేకుండానే..
ఏపీ అసెంబ్లీలో రెండు రోజులుగా కనిపిస్తున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తూనే ఉన్నాయి. ఓ పక్క ప్రతిపక్ష టీడీపీ సభ్యులు మాస్క్‌లతోనే అసెంబ్లీకి హాజరయ్యారు. సభాపతి తమ్మినేని సీతారాం కూడా మాస్క్‌తోనే ఉన్నాయి. అయితే వైసీపీలో 90శాతం మంది మాస్క్‌లు లేకుండానే హాజరయ్యారు. సీఎ జగన్ కూడా చాలాసార్లు మాస్క్ లేకుండానే కనిపించారు. ఇదే ఇప్పుడు అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఓవైపు పంచాయతీ ఎన్నికల విషయం వచ్చేటప్పటికి కొవిడ్ ఇంకా అదుపులోకి రాలేదని, ఇప్పుడు ఎన్నికలు పెడితే కొవిడ్ మళ్లీ ఎక్కువ అవుతుందని వైసీపీ చెబుతూ వస్తోంది. కొవిడ్ తీవ్రతకు రోజూవారి వస్తున్న గణాంకాలే కారణమని అధికార వైసీపీ నేతలు పంచాయతీ ఎన్నికల టాపిక్ విషయానికి వచ్చేటప్పటికి చాలా సార్లు ప్రస్తావిస్తున్నారు. అలాంటిది.. అసెంబ్లీ సమావేశాలకు వచ్చేటప్పటికి మాత్రం మాస్క్‌ల విషయం విస్మరించారా అనే విషయంపై చర్చ నడుస్తోంది.
Must Read ;- అసెంబ్లీ లాబీల్లో కొడాలి మార్కు మాటల తూటాలు
బడ్జెట్ సమావేశాల్లోనూ..
గత జూన్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ ఇదే పరిస్థితి కనిపించింది. అప్పట్లోనే ఏపీ అసెంబ్లీ, సెక్రటేరియట్‌లో కలిపి 30 వరకు కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఆ సమయంలో కరోనా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఆయా ప్రభుత్వాలు కొన్ని ఉత్తర్వులూ జారీ చేశాయి. ఏపీలో అప్పట్లో మాస్క్ లేండా బయటికి వస్తే.. గ్రామాల్లో అయితే రూ.500, పట్టణాల్లో అయితే రూ. వెయ్యి జరిమానా విధించాలని ప్రభుత్వ ఆదేశాలు వచ్చాయి. తరువాత జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ఎమ్మెల్యేలు మాస్క్‌లు పెట్టుకోకపోవడంతో సోషల్ మీడియాలోనూ విమర్శలు వచ్చాయి. ఇప్పటికే కొవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ అధికార వైసీపీ ఎమ్మెల్యేలు పలుచోట్ల ర్యాలీలు తీసి విమర్శలకు గురయ్యారు. దీనిపై అప్పట్లో కోర్టుల్లోనూ కొందరు పిటిషన్లు దాఖలు చేశారు. తరువాతి కాలంలోనూ ఈ పరిస్థితి మారలేదనే విమర్శలు వస్తున్నాయి.
చట్టాలు చేసేవారే ఉల్లంఘిస్తే..
తాజాగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవమెంత అనే విషయం పక్కన బెడితే.. ప్రజలకు ఆదర్శవంతంగా ఉంటూ.. సమాజ పరిరక్షణకు చట్టాలు చేసే పవిత్ర బాధ్యత ఉన్న ఎమ్మెల్యేల్లో, ముఖ్య నేతల్లో కొందరు నిర్లక్ష్యంగా ఉండడంపైనే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ అసెంబ్లీకి హాజరైనంత మాత్రన కొవిడ్ వస్తుందా అంటే.. రాకపోవచ్చు. కాని ప్రజాప్రతినిధులు నిత్యం చాలామందిని కలవాల్సి ఉంటుంది. పర్యటనలూ చేయాల్సి ఉంటుంది. వారిలో ఏ ఒక్కరికైనా దురదృష్టవశాత్తు కొవిడ్ ఉంటే.. ప్రమాదకరమే. వారు అసెంబ్లీలో మాస్క్‌లు లేకుండా ఉంటే మరింత ప్రమాదకరం. శాసనసభకు హాజరు కావాలంటే కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అసెంబ్లీకి హాజరు కావాలంటే..కొవిడ్ పరీక్షలు తప్పనిసరి అని కూడా ఆదేశాలు జారీ అయ్యాయి. కొవిడ్ నిబంధనల ప్రకారమే అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయని కూడా గతంలో ప్రకటనలు వచ్చాయి. ఆ నిబంధనల ప్రకారం చూసినా.. మాస్క్‌లు తప్పనిసరి కదా..అనే అంశం తెరపైకి వస్తోంది. ఏది ఏమైనా.. కోవిడ్ విషయంలో ఇప్పటికే విమర్శలను ఎదుర్కొంటున్న వైసీపీ.. మాస్క్‌ల విషయంలో పట్టనట్లు ఉండడంపై మరిన్ని విమర్శలు వస్తున్నాయని చెప్పవచ్చు.
Also Read ;- ఏం పీకుతారు: బాబు :: పీకించుకోడానికి వచ్చారా : జగన్