ఆంధ్రప్రదేశ్‌లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు.. ప్రతి నెలా ఠంచనుగా ఒకటో తారీఖునే అందిస్తున్న పెన్షన్లను అడ్డుకోవడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ కుట్రకు తెరలేపింది. స్థానిక సంస్థల ఎన్నికల నియమావళి పేరుతో పెన్షన్ల పంపిణీ మీద ఆంక్షలు విధించాలని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలకు లేఖలు రాయడం ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోంది. ఒరిజినల్ షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28నే మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. వైసీపీ నాయకులు సుప్రీం కోర్టుకు వెళ్లడంతో.. ఎస్ఈసీ ఎలక్షన్స్‌ని నవంబర్ ఒకటికి వాయిదా వేసింది.
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నా.. ఎప్పటి నుంచో అందిస్తున్న సంక్షేమ పథకాల పంపిణీకి ఎలాంటి ఆంక్షలు ఉండవు. సరిగ్గా ఎన్నికల ముందు కొత్తగా ప్రకటించిన పథకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తే.. ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకొనే అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో 2024 జూన్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జూలై ఒకటి నుంచే పెన్షన్లను నాలుగు వేల రూపాయలకు పెంచి.. ప్రతి నెలా క్రమం తప్పకుండా అందిస్తున్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో చేసినట్లు.. పార్టీ కార్యకర్తల్లా పని చేసే వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసినా అభ్యంతరాలు వ్యక్తం చేయొచ్చు. కానీ కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రభుత్వ ఉద్యోగులతోనే పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు ఎన్ని లేఖలు రాసినా.. ఎలాంటి అడ్డంకులు సృష్టించినా.. షెడ్యూల్ ప్రకారం ఒకటో తేదీనో అర్హులందరికీ పెన్షన్లు అందిస్తామని అధికార యంత్రాంగం తేల్చి చెప్పి.
ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల ప్రకారం.. ఎక్కడా రాజకీయ ప్రచారాలు లేకుండా పూర్తి పారదర్శకంగా పింఛన్లు అందించే ఏర్పాటు చేస్తామని అధికారులు స్పష్టం చేశారు. హైకోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కేసుల మీద కేసులు వేసి స్థానిక సంస్థల ఎన్నికలను అడ్డుకోవడానికి ప్రయత్నించి విఫలమైన వైసీపీ నాయకులు.. ఇప్పుడు పెన్షన్లు అడ్డుకోవాలని చూడటం ఆ పార్టీ రాజకీయ దివాళకోరుతనానికి అద్దం పడుతోందనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేయడంతో.. నవంబర్ ఒకటిన ఎలాంటి అడ్డంకులు లేకుండా పెన్షన్ల పంపిణీ జరగబోతోంది.











