బిహార్ లో మరి కొద్ది రోజుల్లో తొలి విడత ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమ శాయశక్తుల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్జేడీ చీఫ్ తేజస్వి యాదవ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ను పూర్తి స్థాయిలో టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
పలు కుంభకోణాల్లో దోషిగా శిక్షను అనుభవిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ కు నవంబర్ 9న బెయిల్ రానున్నట్లు తేజస్వి తెలిపారు. ఆ మరుసటి రోజే ప్రజలు నితీశ్ కుమార్ కు ఫెర్ వెల్ పార్టీ ఇచ్చి వీడ్కొలు చెప్పనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు నితీశ్ పాలనతో విసిగిపోయారని అన్నారు. అందుకే ఆయనను ఎంత త్వరగా ఇంటికి పంపితే అంత మంచిదని భావిస్తున్నట్లు తెలిపారు.
ఈ సందర్భంగా తేజస్వి నితీశ్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నితీశ్ ప్రభుత్వం నెరవేర్చలేదని తెలిపారు. వాటిని అమలు చేయడంలో విఫలం అయ్యారని విమర్శించారు.
‘నితీశ్ జీ మీరు ఇక విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైంది. మీరు 70 కి చేరువ అవుతున్నారు. ఇక మీరు రాష్ట్రాన్ని చూసుకోలేరు. కాబట్టి మీరు పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకుంటే మంచిదంటూ’ ఎద్దేవా చేశారు.
బిహార్ లో మూడు విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి. మొదటి దశ ఎన్నికలు ఈ నెల 28న జరుగుతుండగా, నవంబర్ 3న రెండో విడత పోలింగ్, నవంబర్ 7న మూడో దశ పోలింగ్ జరుగుతుంది. నవంబర్ 10 న ఫలితాలు విడుదల చేస్తామని ఎన్నికల కమిషన్ తెలిపింది.
ఈ నేపథ్యంలోనే తేజస్వి ‘నాన్న నవంబర్ 9న జైలు నుంచి వస్తున్నారు. ఆ మరుసటి రోజే ఎన్నికల ఫలితాలు తెలుస్తాయి. ప్రజలు మీకు ఘనంగా వీడ్కొలు చెబుతారు’ అంటూ పేర్కొన్నారు. మేము ఎన్నికల్లో గెలిస్తే 10 లక్షల ఉద్యోగాలు ఇస్తామని తేజస్వీ తెలిపారు.