మద్దాలి శివారెడ్డి గుర్తున్నాడా? రేసుగుర్రం సినిమాలో తన విలక్షణమైన నటనతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఆయన పేరు రవికిషన్. ప్రస్తుతం పార్లమెంటులో భాజపా తరఫున ఎంపీ కూడా. డ్రగ్స్ కేసుతో బాలీవుడ్‌కు ఉన్న సంబంధాలపై బీజేపీ ఎంపీ,నటుడు రవికిషన్ లోక్ సభలో సోమవారం ఒక రేంజిలో గళమెత్తారు.
బాలీవుడ్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా, వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దేశ యువతను నాశనం చేయటానికి కుట్ర జరుగుతోందని , పొరుగుదేశాలు ఇందుకు సహకారం అందిస్తున్నాయని ఆరోపించారు. పాకిస్తాన్, చైనాలనుంచి ప్రతి ఏటా మత్తు పదార్థాలు దేశంలోకి అక్రమంగా రవాణా అవుతున్నాయని, నేపాల్, పంజాబ్ ద్వారా దేశంలోకి వస్తున్నాయని ఎంపి రవికిషన్ ఆరోపణలు గుప్పించారు.
డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న కొంతమందిని అరెస్ట్ చేసి, ఎన్సీబీ మంచి పనిచేసిందని, కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, కేసుతో సంబంధం ఉన్న మిగిలిన దోషులను వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.
మళ్లీ రాజకీయ కోణమేనా?
రవివిషన్ (అలియాస్ మద్దాలి శివారెడ్డి) భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ. ఆయన ఇవాళ డ్రగ్స్ దందాల గురించి భారీ స్థాయిలో గళమెత్తడం.. ఇటీవలి అరెస్టుల గురించి ప్రస్తావించడం, హర్షం వ్యక్తం చేయడం అనేది.. పరోక్షంగా.. రియాచక్రవర్తి అరెస్టు చుట్టూ జరుగుతున్న రాజకీయ అల్లిక గానే పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
సుశాంత్ హత్య కేసు, తదనంతర పరిణామాల చుట్టూ రాజకీయ పోరాటాలు నడుస్తున్నాయి. భాజపా- శివసేన గ్రూపులు అనుకూల-ప్రతికూల భావజాలాలతో చెలరేగుతున్నాయి. రియా చక్రవర్తికి శివసేన అండగా నిలుస్తోందనే ప్రచారం ఉంది. రియా చక్రవర్తి మీద కంగనా రనౌత్ విరుచుకుపడుతోంది. అదే సమయంలో.. కంగనకు భాజపా దన్ను ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. కంగన మీద శివసేన కక్ష కట్టినట్టుగా వ్యవహరిస్తోొంది.
ఇవాళ భాజపా ఎంపీ.. డ్రగ్స్ మీద విరుచుకుపడడమూ.. డ్రగ్స్ అరెస్టుల మీద హర్షం వ్యక్తం చేయడమూ కూడా.. ఈ తరహా రాజకీయ లంకెలతో కూడిన వ్యవహారమే అనే ప్రచారం కూడా బాలీవుడ్ లో జరుగుతోంది.











