ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ బుధవారం కేబినెట్ భేటీని ముగించుకుని నేరుగా ఢిల్లీకి పయనమైన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ల్యాండైన పవన్… ఎయిర్ పోర్టు నుంచి నేరుగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఇద్దరిమధ్య అరగంటకు పైగానే చర్చలు కొనసాగాయి. అమిత్ షాతో భేటీ ముగించుకుని బయటకు వచ్చిన పవన్ అక్కడి నుంచి నేరుగా తిరుగు ప్రయాణమయ్యారు. మధ్యలో ఏపీ భవన్ లో తన కోసం వేచిచూస్తున్న మీడియా ప్రతినిధులతో పొడిపొడిగా మాట్లాడిన పవన్… అమిత్ షాతో భేటీ కోసం మాత్రంమే తాను ఢిల్లీ వచ్చానని, ఇక మరెవ్వరినీ కలవడం లేదని కూడా తెలిపిన పవన్… తన ఢిల్లీ టూర్ ముగిసిందని కూడా ప్రకటించారు. ఆ వెంటనే ఆయన ఏపీకి తిరుగు ప్రయాణమయ్యారు.
అమిత్ షాతో భేటీలో ఏఏ అంశాలపై చర్చ జరిగిందన్న దానిపై ఇటు పవన్ గానీ, అటు అమిత్ షా కార్యాలయం గానీ ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. తాను డిప్యూటీ సీఎం అయ్యాక తొలిసారి అమిత్ షాను కలిశానని, ఈ లెక్కన ఇది కేవలం మర్యాదపూర్వక భేటీనేనని పవన్ చెప్పుకొచ్చారు. తమ భేటీలో ఎలాంటి రాజకీయ అంశాలు గానీ, పాలనాపరమైన అంశాలు గానీ ప్రస్తావనకు రాలేదని కూడా పవన్ చెప్పుకొచ్చారు. మరి ఆ మాత్రం దానికే కేబినెట్ బేటీ ఉన్న రోజే ఢిల్లీ వచ్చి… హడావిడిగానే మర్యాదపూర్వక భేటీని ముగించాలా? అన్న దిశగా పలు వర్గాల నుంచి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా ఏదో కీలక అంశంపై చర్చ కోసమే పవన్… రాష్ట్రంలో కేబినెట్ ఉన్నా కూడా దానిని ముగించుకుని మరీ ఢిల్లీ వెళ్లారని, అమిత్ షాతో ఆ కీలక విషయాన్ని ప్రస్తావించి…ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
అమిత్ షాతో పవన్ కల్యాణ్ భేటీ గురించి ఒకింత పక్కా అంచనా ఉన్న వర్గాల సమాచారం ప్రకారం ఏపీలో లా అండ్ ఆర్డర్ పైనే ఈ భేటీలో చర్చ జరిగిందని తెలుస్తోంది. రెండు రోజుల క్రితం తన సొంత నియోజకవర్గం పిఠాపురంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు సన్నగిల్లాయని, పోలీసు అధికారులు ఉత్సవ విగ్రహాాల్లా చూస్తూ ఉంటున్నారని మండిపడ్డ పవన్ కల్యాణ్… తమ చేత మళ్లీ మళ్లీ చెప్పించుకోవద్దని పోలీసు అధికారులు, జిల్లా కలెక్టర్లను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై బుధవారం ఉదయం జరిగిన కేబినెట్ భేటీలో ప్రధానంగా చర్చ జరిగింది. పవన్ వ్యాఖ్యలతో సీఎం నారా చంద్రబాబునాయుడు కూడా ఏకీభవించడంతో పాటుగా నెల రోజుల్లోనే రాష్ట్రంలో శాంతి భద్రతలను పట్టాలెక్కిస్తామని కూడా చెప్పారు. దీని కోసం ఏం చేయాలన్న దానిపైనా కేబినెట్ లో కీలక చర్చ జరిగింది. ఈ చర్చ, జరిగిన తర్వాతే పవన్ ఢిల్లీ ఫ్లైట్ ఎక్కారు.
అమిత్ షాతో భేటీలో ఏపీలో సోషల్ మీడియాలో కనిపిస్తున్న వికృత పోస్టులను పవన్ ప్రధానంగా ప్రస్తావించినట్లు సమాాచరం. ప్రధానంగా వైసీపీకి చెందిన సోషల్ మీడియా యాక్టివిస్టులు… సీఎం, డిప్యూటీ సీఎం, హోం మినిష్టర్, ఇతర మంత్రులతో పాటు వారి కుటుంబ సభ్యులపై సభ్యసమాజం తల దించుకునేలా వ్యాఖ్యలు చేస్తున్న విషయాన్ని పవన్ ప్రస్తావించారు. వీటిపై కూటమి నేతల నుంచి ఫిర్యాదులు అందుతున్నా… పోలీసులు చోద్యం చూస్తున్న వైనాన్ని ఆయన లేవనెత్తినట్లు సమాచారం. అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు పోలీసు అధికారులు జిల్లాల ఎస్పీలుగా కొనసాగుతూ… స్వయంగా మంత్రులు ఫోన్లు చేస్తే కూడా పట్టించుకుంటున్న పాపాన పోవడం లేదని కూడా పవన్ ఫిర్యాదు చేసినట్లు సమాచారం. సోసల్ మీడియా వెర్రి తలలపై తాము ఇక ఎంతమాత్రం సాఫ్ట్ గా వెళ్లదలచుకోవడం లేదని, ఇందులో అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి మద్దతుగా కేంద్రం నిలబడాల్సి ఉంటుందని కూడా పవన్ కోరారట. పవన్ చెప్పినదంతా విన్న అమిత్ షా… తమ నుంచిరాష్ట్రానికి ఎల్లప్పుడూ మద్దతు ఉంటుందని భరోసా ఇచ్చినట్లుగా తెలుస్తోంది.