ఏపీలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక వైసీపీ నేతలు మరోసారి తమ రాక్షస ఆనందాన్ని బయటపెట్టుకున్నారు. తిరుపతి జిల్లా పుల్లంపేట మండలంలో ప్రజల కోసం నిర్మించిన కోట్ల రూపాయల రోడ్డును రాత్రికి రాత్రే జేసీబీలు, ట్రాక్టర్లతో తవ్వి ధ్వంసం చేశారు. పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా దాదాపు రూ. 5 కోట్ల వ్యయంతో అనంతసముద్రం నుంచి పాపక్కగారిపల్లె వరకు వేసిన సరికొత్త బీటీ రోడ్డును వైసీపీ నేతలు ఇలా నాశనం చేయడంపై ఇప్పుడు సంచలనంగా మారింది.
ప్రజలకు ఉపయోగపడే పనులను అడ్డుకోవడం, ప్రభుత్వ ఆస్తులను నాశనం చేయడమే ధ్యేయంగా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ అరాచక ఘటనపై ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శాఖాధిపతులు, ఇంజినీరింగ్ అధికారులతో అత్యవసర సమీక్ష నిర్వహించిన ఆయన, ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులను ధ్వంసం చేసేవారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
ఈ దుశ్చర్యకు పాల్పడిన వైసీపీ నేత సుబ్బారెడ్డి, అతని అనుచరులపై కఠినమైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా, రోడ్డు ధ్వంసం కావడం వల్ల జరిగిన సుమారు రూ. 5 కోట్ల నష్టాన్ని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద నిందితుల ఆస్తుల నుంచే వసూలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సంక్షేమాన్ని దెబ్బతీసే చర్యలను ఎంతమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
మరోవైపు ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటనపై ఘాటుగా స్పందించారు. అభివృద్ధిని చూసి ఓర్వలేక రోడ్డును తవ్వేయడం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. ప్రజల కోసం ప్రభుత్వం కోట్లు వెచ్చించి రోడ్డు వేస్తే, దాన్ని కక్షతో ధ్వంసం చేసేందుకు సిగ్గుపడాలి అంటూ ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విధ్వంసానికి పాల్పడిన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఆదేశించారు.
వైసీపీ నేతల ఈ అనాగరిక చర్య వల్ల ఆ ప్రాంత గ్రామాల ప్రజలు, పాఠశాల విద్యార్థులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల ఇబ్బందిని గుర్తించిన కూటమి ప్రభుత్వం, వెంటనే ఆ రోడ్డును పునరుద్ధరించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించింది. స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.











