ఏపీతో పాటు మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇప్పుడు ఎక్కడ చూసినా వికృత చేష్టలకు పాల్పడుతున్న పోషల్ మీడియా పోస్టులు, ఆ పోస్టులను పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు, వారిపై ఇప్పుడు పోలీసులు తీసకుంటున్న చర్యలపనే చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా లెక్కలేనన్ని కేసులు నమోదు కాగా… ఆయా కేసుల్లో పోస్టుల తీవ్రతను బట్టి వాటిని పోస్ట్ చేసిన యాక్టివిస్టులను అరెస్ట్ చేయడం, వారిలో కొందరికి నోటీసులు ఇచ్చి పంపడం, మరికొందరిని ఏకంగా కోర్టులో హాజరుపరచి జైలుకు తరలిస్తున్న వైనం ఓ ఉద్యమంలా సాగుతోంది. ఇందులో భాగంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డికి పీఏగా వ్యవహరిస్తున్న వర్రా రవీంద్రా రెడ్డి అరెస్ట్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పోలీసులకు పలుమార్లు మస్కా కొట్టిన వర్రా ఎట్టకేలకు అరెస్ట్ కాగా,… ఆయన అరెస్ట్ కు దారి తీసిన పరిణామాలు… అసలు సోషల్ మీడియా వెర్రి తలలు వేయడానికి గల కారణాలను కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ సమగ్రంగా వివరించారు.
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేశ్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లతో పాటు వారి కుటుంబ సభ్యులపై అసభ్యకర పోస్టులు పెట్టాడంటూ వర్రాపై రాష్ట్రంలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ ఫిర్యాదులను పరిశీలించిన ఆయా పోలీస్ స్టేషన్ల అధికారులు వర్రాపై కేసులు నమోదు చేశారు. ఎప్పుడైతే పవన్ కల్యాణ్ ఈ పోస్టులప ఆవేదన వ్యక్తం చేస్తూ వ్యాఖ్యలు చేశారో.. అప్పటి నుంచి సోషల్ మీడియా అసభ్య పోస్టులపై చర్యలకు దిగిన పోలీసు యంత్రాంగం వర్రాను అరెస్ట్ చేసేందుకు తీర్మానించింది. భారతి రెడ్డి పీఏగా ఉన్న అతడిని అరెస్ట్ చేస్తే వైసీపీ నుంచి కొంత వ్యతిరేకత ఉండవచ్చని అనుకున్నా… అలాంటిదేమీ లేకపోగా… అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు వర్రా కుటిల యత్నాలకు పాల్పడ్డారు. కడపలోని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకోవడంతో కూటమి సర్కారు కన్నెర్రజేసింది. ఫలితంగా కడప ఎస్పీపై బదిలీ వేటు పడగా… చిన్నచౌక్ పీఎస్ సీఐపై ఏకంగా సస్పెన్షన్ వేటు పడింది.
ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యలతో పోలీసు యంత్రాంగం మరింత అప్రమత్తం అయ్యింది. వర్రాను అరెస్ట్ చేసి సర్కారు ఆగ్రహానికి తెరదించాలని తీర్మానించింది. కర్నూలు రేంజి డీఐజీ కోయ ప్రవీణ్ నేరుగా రంగంలోకి దిగి పోలీసు బృందాలను గాలింపు కోసం పంపారు. ఈ క్రమంలో పులివెందుల నుంచి బెంగళూరు పారిపోయిన వర్రా… అక్కడి నుంచి హైైదరాబాద్ కు వెళుతూ జడ్చర్ల వద్ద పోలీసులకు తారసపడ్డాడు. ఈ సందర్భంగా అతడిని అరెస్ట్ చేసినట్లు వార్తలు వినిపించినా… అతడు తప్పించుకున్నాడని ప్రవీణ్ ప్రకటించారు. తాజాగా సోమవారం కడప జిల్లా చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వర్రాను అరెస్ట్ చేసినట్లు డీఐజీ ప్రకటించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వికృత రూపం దాల్చడానికి కారకులెవరన్న అంశంపై ఆయన పలు సంచలన విషయాలు వెల్లడించారు.
జగన్ జమానాలో ప్రభుత్వ సలహాదారు హోదాలో సకల శాఖల మంత్రిగా డాబూదర్పం ఒలకబోసిన సజ్జల రామకృష్ణారెడ్డి… 2024 సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉందనగా… తన కుమారుడు సజ్జల భార్గవ రెడ్డిని తెర ముందుకు తీసుకువచ్చారు. రామకృష్ణారెడ్డి సలహా మేరకు సజ్జల భార్గవరెడ్డిని వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీగా నియమిస్తూ జగన్ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయమే ఇప్పుడు యావత్తు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కష్టాల ఊడిలోకి నెట్టేసింది. భార్గవ రెడ్డి వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జీగా పదవీ బాధ్యతలు స్వీకరించకముందు… వైసీపీ పోస్టులలో అంతగా అశ్లీలం, అసభ్యత పెద్దగా కనిపించేవి కాదని డీఐజీ కోయ ప్రవీణ్ తెలిపారు. ఎప్పుడైతే భార్గవ రెడ్డి ఆ పదవిలోకి వచ్చి చేరారో… అప్పటి నుంచి వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు వికృత చేష్టలు ప్రారంబించారని ఆయన తెలిపారు. వారి పోస్టుల్లో అప్పటిదాకా కేవలం కామెంట్లను మాత్రమే పోస్టు చేస్తూ వచ్చిన యాక్టివిస్టులు… భార్గవరెడ్డి సూచనలతో ఆయాపార్టీల నేతల ఫేక్ ఫొటోలతో పాటు ఆయా ఫొటోలను డీప్ ఫేక్ చేసి, వారి కుటుంబాల్లోని మహిళల ఫొటోలను కూడా వాడటం మొదలుపెట్టారని డీఐజీ తెలిపారు. మొత్తంగా ఈ వికృత క్రీడకు కేంద్ర బిందువు భార్గవరెడ్డేనని డీఐజీ తెలిపారు.