హర్యానా రంజీ జట్టుకు ఆడుతున్న రాహుల్ తెవాతియా పేరు క్రికెట్ అభిమానులకు పెద్దగా పరిచయం లేదు. కానీ దులీప్ ట్రోపిలో సత్తా చాటడంతో తెవాతియాని రాజస్తాన్ రాయల్స్ బేస్ ప్రైస్ లో సొంతం చేసుకుంది. ఇప్పటి వరకు బౌలింగ్ లో తప్పా అతనికి బ్యాటింగ్ కూడా వచ్చని చాలా మందికి తెలియదు. షార్జా వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్, కింగ్స్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. టీ20లో మజా ఏంటో ఈ మ్యాచ్ నిరూపించింది. క్రీడా అభిమానులను మునివేళ్లపై నిలబెట్టేలా ఈ మ్యాచ్ సాగింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన పంజాబ్ నిర్ణిత 20 ఓవర్లలలో 223 పరుగుల భారీ స్కోరు సాధించింది.
మయాంక్ మాస్ రాహుల్ క్లాస్
రాజస్తాన్ సారధి స్మిత్ తీసుకున్న నిర్ణయం తప్పని నిరూపిస్తూ పంజాబ్ ఓపెనర్లు మయాంక్, రాహుల్ ఫోర్లు, సిక్సర్లతో హోరెత్తించారు. మయాంక్ దూకుడు పెంచడంతో రాహుల్ స్ట్రైక్ రొటేట్ చేస్తూ సహకరించాడు. 45 బాల్స్ లోనే మయాంక్ అద్భుత సెంచరీ చేశాడు. మరోవైపు రాహుల్ 35 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 183 పరుగులు జోడించారు. ఆ తరువాత వెంట వెంటనే మయాంక్(106), రాహుల్(69) పరుగులు చేసి పెవిలియన్ చేరారు. చివరి ఓవర్ లో పురాన్ సిక్సర్లతో విరుచుకుపడటంతో జట్టు స్కోరు 223 పరుగులకు చేరింది.
సంజూ సత్తా..స్మిత్ రాణింపు
224 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ జట్టు 19 పరుగులకే తొలి వికెట్ నష్టపోయింది. హార్డ్ హిట్టర్ బట్లర్(4) తక్కువ పరుగులకే పెవిలియన్ చేరడంతో పంజాబ్ జట్టు సంబరాలు చేసుకుంది. ఈ దశలో సంజూ శాంసన్-స్టీవ్ స్మిత్ ఎదురుదాడికి దిగారు. మంచి బాల్స్ ను గౌరవిస్తూ లైన్ తప్పిన బాల్స్ ను బౌండరీ లైన్ దాటిస్తూ వీరిద్దరూ రెండో వికెట్ కు 81 పరుగులు జోడించారు. ఈ క్రమంలో స్మిత్ హాఫ్ సెంచరీ చేశారు. ఆ వెంటనే స్మిత్ పెవిలియన్ చేరడంతో రాజస్తాన్ జట్టు హిట్టర్ గా తెవాతియాను పంపింది. ఓ వైపు సాధించవలసిన రన్ రేట్ పెరిగిపోతుండటంతో సంజూ భారీ షాట్లు ఆడుతున్నా తెవాతియా మాత్రం క్రీజులో తడబడుతూనే ఉన్నాడు. అసలు తెవాతియాని ముందుగా ఎందుకు పంపారంటూ అభిమానులు మండిపడ్డారు. ఈ దశలో శాంసన్(85) కూడా ఔట్ కావడంతో రాజస్తాన్ కథ ముగిసిందని అందరూ అనుకున్నారు.
తెవాతియా కొసమెరుపు
23 బాల్స్ లోనే 63 పరుగులు చేయడం కష్టమని భావించిన వేళ తెవాతియా అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు. మొదట తాను ఎదురుకున్న 19 బాల్స్ లో 8 పరుగులే చేసిన తెవాతియా గేర్ మార్చాడు. పంజాబ్ పేసర్ కాట్రేల్ వేసిన 18వ ఓవర్ లో తెవాతియా ఐదు సిక్సర్లు బాదాడు. అద్భుతమైన షాట్లతో తెవాతియా విరుచుకుపడటంతో 17 ఓవర్లలలో 173 పరుగుల వద్ద ఉన్న పంజాబ్ 18 ఓవర్లు ముగిసేసరికి 203 పరుగులకు చేరింది. 12 బాల్స్ లో 21 పరుగులు చేయవలసిన దశలో 19వ ఓవర్ వేసిన షమీ బౌలింగ్ లో జోఫ్రా ఆర్చర్ వరుసగా రెండు సిక్సర్లు కొట్టడంతో సాధించవలసిన రన్ రేట్ తగ్గిపోయింది. ఇదే ఓవర్ లో తెవాతియా మరో సిక్సర్ కొట్టడంతో జట్టు స్కోరు 222 పరుగులకు చేరింది. ఈ క్రమంలో తెవాతియా హాఫ్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. తరువాత టామ్ కరణ్ ఫోరుతో మ్యాచ్ ముగించాడు.
31 బాల్స్ లో 7 సిక్సర్ల సాయంతో 53 పరుగులు చేసిన తెవాతియా ‘గేమ్ చెంజర్’ గా నిలిచాడు. తెవాతియా ఆడిన ఇన్నింగ్స్ పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ. సెక్రటరీ జైషా, మాజీ ఆటగాడు పీటర్సన్ ప్రశంసల జల్లులు కురిపించారు. ఈ మ్యాచ్ చూడని వారు ఓ అద్భుతాన్ని మిస్ అయినట్లే..వీలుంటే హైలట్స్ చూసేయండి!











