అధికార పార్టీ నెలకొల్పాలని అనుకుంటున్న.. పార్లమెంటు నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం అధ్యక్షులను, సమన్వయకర్తలను నియమించింది. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న 25 పార్లమెంట్ (లోక్‌సభ) నియోజకవర్గాలకు 25 మంది కొత్త అధ్యక్షులను, అలాగే జిల్లా సమన్వయకర్తలను టీడీపీ ప్రకటించింది. అంతేకాకుండా.. 13 జిల్లాలకు సమన్వయకర్తలను నియమించింది. రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు కలిపి కొత్త ఇన్చార్జి కి బాధ్యతలు అప్పగించింది. ఇప్పటివరకు పార్టీకి జిల్లా, మండల, గ్రామ కమిటీలు ఉన్న విషయం విదితమే.
ఇప్పుడు పార్లమెంట్ నియోజకవర్గ కమిటీలను ఏర్పాటు చేశారు. ఇలా ఒక పార్లమెంట్ నియోజకవర్గం యూనిట్‌గా పార్టీ కమిటీ ఉంటే, దాని పరిధిలో రాజకీయ కార్యకలాపాల నిర్వహణ, పార్టీ వ్యూహ రచనకు ఎక్కువ స్కోప్ ఉంటుందని ఈ నిర్ణయం తీసుకుంది. జిల్లా స్థాయిలో సీనియర్లతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. విశాఖపట్నం బాధ్యతలు గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు కు అప్పగించింది.
అందరినీ కలుపుకొని పోగలరా?
యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస రావు కు జిల్లాలో మంచి గుర్తింపు ఉంది. ఆయన సామాజిక వర్గం ఓటర్లు కూడా నగరంలో భారీ సంఖ్యలో ఉండడంతో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎంపీగా గట్టి పోటీని ఇచ్చారు.
ముక్కుసూటిగా పోయే వ్యక్తి..
2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గాజువాక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. విద్యావంతుడు, యువకుడు కావడం నియోజకవర్గ అభివృద్ధి కోసం పూర్తిస్థాయిలో శ్రమించారు. కానీ రాజకీయ నాయకుల మాదిరిగా కుటిల తంత్రాలు చేత కాకపోవడంతో… నియోజకవర్గంలో అనేక మందితో విభేదాలు తలెత్తాయి. అవి కాస్త 2019 ఎన్నికల్లో ఆయన ఓటమికి కారణమయ్యాయి.
కలుపుకుపోయే తత్వం లేదు..
వ్యతిరేకించే వర్గాలను కలుపుకుపోయే తత్వం శ్రీనివాస్‌కు లేదు. ఇష్టం లేని వ్యక్తులను, తనను వ్యతిరేకించే వర్గాలను దరిదాపుల్లోకి కూడా రానివ్వరు. ఎన్నికల్లో వ్యక్తిగత, పార్టీ లబ్ధి కోసం కూడా ఆయన రాజీపడరు. ఇదే గత ఎన్నికల్లో ఓటమికి కారణమైంది. నియోజకవర్గంలో వ్యతిరేకించిన అనేక వర్గాలను కలుపుకోవడంలో విఫలం కావడంతో ఎన్నికల ఫలితాల్లో మూడవ స్థానానికి పరిమితమయ్యారు.
ఇప్పుడు అదే తీరున వ్యవహరిస్తే?
విశాఖ పార్లమెంట్ బాధ్యతలు ఆయనకు అప్పగించిన తరుణంలో ఆయన వ్యవహార శైలిని మార్చుకుని ప్రవర్తిస్తారా? లేక గతంలో మాదిరిగానే వ్యవహరిస్తారా? అన్నది గమనించి చూడాల్సిందే. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న తెలుగుదేశం పార్టీని ఎన్నికలు నాటికి సంసిద్ధం చేయాలంటే గ్రూపుల గోల లేకుండా, భేషజాలకు పోకుండా అందరినీ ఏకతాటిపైకి తీసుకు వచ్చినప్పుడే అది సాధ్యం. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు అధికార పార్టీవైపు చూస్తున్న తరుణంలో కీలకమైన బాధ్యతలను ఏమేరకు విజయవంతంగా నడిపిస్తారో వేచి చూడాలి.











