అమరావతి : 250 రోజులుగా అన్నదాతల పోరాటం ఉధృతంగా సాగుతోంటే.. కనీసం వారి గోడును చెవిన వేసుకోవడానికి కూడా ఇష్టపడని ప్రభుత్వాలు దేశంలో చాలా అరుదుగా ఉంటాయని చంద్రబాబునాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో మాత్రమే ఉండాలని, పొలాలు ఇచ్చిన తమ త్యాగాలకు అర్థం ఉండాలనే డిమాండ్ తో అమరావతి ప్రాంతంలో రైతులు చేస్తున్న దీక్షలు ఆదివారం 250 రోజులకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరాల్లోని రైతులకు మద్దతుగా చంద్రబాబు మాట్లాడారు. దేశచరిత్రలోనే ఇంత సుదీర్ఘంగా సాగుతున్న ప్రజా పోరాటాలు చాలా అరుదుగా ఉంటాయని అన్నారు.
రైతుల వేదనను ప్రభుత్వం వినిపించుకోకపోగా, వేలాది మంది ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టి జైళ్ళకు పంపిందని చంద్రబాబు అన్నారు. ఉద్యమంలో 85 మంది రైతులు, రైతు కూలీలు, మహిళలు అమరులైనా ప్రభుత్వం తమాషా చూస్తోందని ఆరోపించారు. రాజధాని అంశంపై అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లాలన్న మా డిమాండ్‌కు వైసీపీ ముందుకు రాలేదంటే, 3 ముక్కల నిర్ణయానికి 13 జిల్లాల ప్రజల మద్దతు లేనట్టేనని చంద్రబాబు అభివర్ణించారు. తమ ఇష్టానుసారంగా మొండిగా ముందుకు పోవడం నిరంకుశత్వమని ఆయన పేర్కొన్నారు.
అమరావతి శంకుస్థాపనకు రాష్ట్రంలోని 13 వేల గ్రామాలు, 3 వేల వార్డుల్లో పవిత్ర మట్టి, పుణ్య జలాలు ప్రజలు ఊరేగింపుగా తెచ్చారంటేనే అమరావతిని రాజధానిగా అందరూ ఆమోదించారని, అప్పట్లో జగన్మోహన రెడ్డి కూడా ఇక్కడ రాజధానికి ఆమోదం తెలిపి అధికారంలోకి రాగానే మాట మార్చారని అన్నారు. రాష్ట్రం కోసం భూములు త్యాగం చేసిన రైతులకు అండగా ఉండాల్సిన బాధ్యత 13 జిల్లాల ప్రజలపై ఉందని ఆయన పేర్కొన్నారు.
జగన్ పచ్చి మోసకారి : యం.పి.కేశినేని నాని
ఈ ఉద్యమం250 రోజులుగా కొనసాగే ఘనతమహిళలకు, రైతులకు దక్కుతుందని ఎంపీ కేశినేని నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రప్రజలను మోసం చేసారని.. ఆయన పచ్చి మోసకారి అని నాని అభివర్ణించారు. ప్రత్యేకహోదా విషయంలో మీ యం.పిలు మీరు పలాయనం చిత్తగించారు.. కేసుల కోసం తప్పరాష్ట్రఅభివృద్ధి విషయంలో చొరవ తీసుకోవడంలో విపలమయ్యారు అని ఆరోపించారు. మీ అధికారం శాశ్వతం కాదు అనే విషయం గుర్తుంచుకోవాలని.. చాలా గొప్పవారు కూడా మట్టిలో కలిసిపోయారు అనే విషయం గుర్తుంచుకోవాలని.. నాని హెచ్చరించారు.
అయోధ్య మాదిరిగా అమరావతి విషయం కూడా పాతిక ముప్పయి సంవత్సరాలు న్యాయపోరాటం తర్వాతనైనా విజయం సాధించి తీరుతుందని కేశినేని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి తరలించడం జగన్మోహన్ రెడ్డి గారి వలన కాదు అనే విషయం కూడా ఆయనకు తెలుసు కానీ రాజకీయలబ్ది పొందడానికి డ్రామాలు ఆడుతున్నారన్నారు. ప్రాంతాల మధ్యవిభేదాలు సృష్టించి చంద్రబాబు నాయుడు మీద నెపం నెట్టి రాజకీయలబ్ది పొందాలని చూస్తున్నారని నాని అన్నారు..
మూర్ఖంగా రైతుల్ని బలితీసుకుంటున్నారు : లోకేష్
పాలకుడు మారిన ప్రతిసారి రాజధాని మార్చుకుంటూ పోతే జరిగేది అభివృద్ధి కాదు విచ్చిన్నం అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ అన్నారు. జగన్ రెడ్డి మూడు ముక్కలాట ఒక వికృత క్రీడగా ఆయన అభివర్ణించారు. మూర్ఖపు ఆలోచనతో 85 మంది రైతుల్ని బలితీసుకున్నారని, రాష్ట్రం కోసం త్యాగం చేసిన రైతులకు న్యాయం చెయ్యమంటూ రణభేరి మొదలుపెట్టి నేటికి 250రోజులు అయ్యిందని లోకేష్ అన్నారు. ఇప్పటికైనా చేసిన తప్పు సరిదిద్దుకొని అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేసే విధానాన్ని పక్కన పెట్టి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ ప్రణాళికతో ముందుకు రావాలని లోకేష్ కోరారు.