తమిళనాట విజయ్ కి ఒక రేంజ్ లో క్రేజ్ ఉంది. అక్కడ విజయ్ అనే పేరు మాస్ ఆడియన్స్ జపించే మంత్రం. అందువల్లనే ఆయన తన సినిమాల్లో వాళ్లకి నచ్చే అంశాలు పుష్కలంగా ఉండేలా జాగ్రత్తపడతాడు. కథలోను .. పాత్రలోను కొత్తదనం కోసం ప్రయత్నిస్తూనే, మాస్ ఆడియన్స్ కి తనకి మధ్య ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకుంటాడు. అందువల్లనే ఆయన సినిమా విడుదలయ్యే రోజుని ఒక పండుగ రోజులా వాళ్లు భావిస్తుంటారు. థియేటర్లకు కూడా దిష్టి తగులుతుందేమోననే స్థాయిలో తమ అభిమానాన్ని చాటుకుంటూ ఉంటారు.
కోవిడ్ కారణంగా జనాలు వినోదానికి పూర్తిగా దూరమైపోయారు. ఎంటర్టైన్మెంట్ పరంగా వాళ్లంతా చాలా ఆకలితో .. దాహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే విజయ్ హీరోగా చేసిన ‘మాస్టర్’ థియేటర్లకు వచ్చింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, ప్రతినాయకుడిగా విజయ్ సేతుపతి నటించాడు. బాలనేరస్థులను చెడుదారిలో నడిపించే విలన్ పాత్రలో విజయ్ సేతుపతి .. వాళ్లను మంచి మార్గంలో నడిపించే హీరోగా విజయ్ నటించారు. ఇద్దరు విజయ్ లు తమ క్రేజ్ తో .. తమ ఈజ్ తో మెప్పించిన చిత్రంగా ‘మాస్టర్’ నిలిచింది.
తాజాగా ‘మాస్టర్’ సినిమాను గురించి ట్రేడ్ అనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు. ఒక్క తమిళనాడులోనే ఈ సినిమా 3 రోజుల్లో 50 కోట్ల క్లబ్ లోకి చేరిపోయిందని చెప్పాడు. సంక్రాంతి కానుకగా ఈ నెల 13వ తేదీన విడుదలైన ఈ సినిమా, వసూళ్ల పరంగా ఇంకా అదే జోరును కొనసాగిస్తూ ఉండటం విశేషం. కథాకథనాల పరంగా చూసుకుంటే ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో కొత్తదనం లేకపోయినా, వసూళ్ల పరంగా చూసుకుంటే విజయ్ మరో హిట్ కొట్టేసినట్టే అంటున్నారు. అందువల్లనే ఈ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.