గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల భర్తీ విషయంలో సిఎం కెసిఆర్ ఈసారీ ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. అందరినీ రాజకీయ నాయకులతో నింపేయకుండా బయటి వ్యక్తులతో ఒకరిద్దరినీ ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వివిధ రంగాల్లో నిష్ణాతులైన వారికి అవకాశం కల్పించాలని గులాబీ బాస్ భావిస్తున్నారని తెలిసింది. దీనికోసం కవులు, కళాకారుల పేర్లను ఆయన పరిశీలిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈదఫా ఈ కేటగిరిలో ఛాన్స్ దక్కుతుందని కళాకారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా గోరటి వెంకన్న పేరు వినబడుతోంబది. అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వచ్చేలా పార్టీలకు అతీతంగా తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వ్యకుతలను ఎంపిక చేయాలని సీఎం కేసీఆర్ పార్టీ నాయకులతో చర్చిస్తున్నట్లు సమాచారం.
అనూహ్యంగా గోరటి వెంకన్న పేరు…
పల్లె కన్నీరు పెడుతుందో అని తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రపంచానికి చాటిన జానపద కవి, గాయకుడు గోరటి వెంకన్న. తెలంగాణ ఉద్యమం సమయంలో ఎన్నో రాజకీయ, సామాజిక, ఉద్యోగ సంఘాల వేదికలపై పాటలు పాడి జనాన్ని ఆయన చైతన్యం చేశారు. ఇప్పుడు ఎమ్మెల్సీ విషయంలో గోరటి వెంకన్న పేరు చర్చలోకి రావడం ఆయన వర్గానికి, అభిమానులకు సంతోషం కలిగించే అంశం. తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ప్రజల తరఫున పోరాడిన కవిగా, గాయకుడిగా ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత చాలా మంది కళాకారులు తమకు నచ్చిన పార్టీల్లోకి వెళ్లిపోయారు. కానీ గోరటి వెంకన్న మాత్రం ఏ రాజకీయ పార్టీలోకి వెళ్లకుండా తన అస్తిత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ప్రజలకు మేలు చేసే పనులను ప్రశంసిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయకుండా సంయమనం పాటిస్తూ రావడం గోరటి వెంకన్నకు కలిసొచ్చిన అంశంగా ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అందుకే వెంకన్న పేరును సీఎం కేసీఆర్ సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక పేర్లను ఒకేసారి ప్రకటించే వీలుందని పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. ఈ ముగ్గురిలో గోరటి వెంకన్న పేరు ఉంటుందని పొలిటికల్ సర్కల్లో చర్చ జరుగుతోంది. పార్టీ నాయకులతో కాకుండా బయటి వ్యక్తులకు అవకాశం ఇస్తే రాజకీయ పార్టీలకు సమాధానం ఇచ్చినట్లవుతోదని టిఆర్ఎస్ పార్టీ భావిస్తున్నదని సమాచారం.
అందరికీ అవకాశం కల్పించేలా…
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల కోసం ఎవరికి వారు ఇప్పటి నుంచే లెక్కలు వేసుకుంటున్నారు. మూడు ఖాళీలుండటంతో అన్ని సామాజిక వర్గాలకు సమాన అవకాశం కల్పించేలా గులాబీ బాస్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని తెలిసింది. ఒకటి బీసీకి, మరొకటి ఓసికి, ఇంకొకటి ఎస్టీ లేదా ఎస్సీకి అవకాశం ఇవ్వాలని కేసిఆర్ సమాలోచనలు చేస్తున్నారని తెలిసింది. ఇదే సమయంలో పదవీకాలం ముగిసిన కర్నె ప్రభాకర్, నాయిని నర్సింహారెడ్డిలు తమకు మరొకసారి అవకాశం కల్సిస్తారని భావిస్తున్నారు. ఎప్పటిలాగా రాజకీయాలతో సంబంధాలున్న వారితో ఎమ్మెల్సీ స్థానాలు భర్తీ చేస్తారా? లేదా ఒక్క సీటు అయినా బయటి వ్యక్తులతో నింపుతారా? అనేది చూడాలి.











