డిమాండ్ ను బట్టి సప్లై.. ట్రెండ్ ను బట్టి వ్యాపారం. ఈ సూత్రాన్ని ఎప్పటికప్పుడు అప్లై చేసే వాడే మహిలో మహా వ్యాపారి అని చెప్పుకోవాలి. ఈ విషయం గురించి ఇప్పుడు ప్రత్యేకమైన చర్చ ఎందుకుంటే.. గత 6 నెలలుగా థియేటర్స్ మూలనపడ్డాయి. సినిమా షూటింగ్ లు జరగడం లేదు. దాని కారణంగా ఎక్కువ నష్టపోతున్నవారు నిర్మాతలే. లాక్ డౌన్ కు ముందు ఫైనాన్సియర్స్ నుంచి భారీ మొత్తం అప్పుచేసి మరీ సినిమాలు నిర్మించిన నిర్మాతలకు.. ఆ సినిమాలు సగం చిత్రీకరణ మాత్రమే జరుపుకోవడంతో.. తెచ్చిన అప్పుకు వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. అలాంటి వారంతా ఎప్పుడు షూటింగ్స్ యాధావిధిగా జరుగుతాయో, తమ సినిమాల్ని ఎప్పుడు విడుదల చేసుకోవాలో అనే సందిగ్ధంలో ఉన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఒక చక్కటి ఉపాయాన్ని ఆలోచించి.. దాన్నే ప్రస్తుత వ్యాపార సూత్రంగా చేసుకున్న నిర్మాత మాత్రం ఒక్క అల్లు అరవింద్ మాత్రమే. ఎప్పటికప్పుడు ట్రెండ్ ను ఫాలో అయ్యే అరవింద్ .. ఆహా అనే ఓటీటీ ప్లాట్ ఫామ్ ను నెలకొల్పి.. అందులో ఓల్డ్ అండ్ న్యూ మూవీస్ ను స్ట్రీమింగ్ చేస్తూ .. మిగతా నిర్మాతలకు ఒక ఇన్స్పిరేషన్ గా మారారు. ఈ లాక్ డౌన్ కాలంలో వచ్చిన నష్టాన్ని .. ఓటీటీ సినిమాలతో భర్తీ చేసుకొని.. వాటితో లాభాలు ఆర్జిస్తున్నారు. ఆహా ప్రారంభించిన కొత్తల్లో దానికి అంతగా స్పందన రాలేదు. రాను రాను ఇందులోని వెబ్ సిరీస్ కు, స్ట్రైట్ మూవీస్ కు, డబ్బింగ్ సినిమాలకు జనం బాగా కనెక్ట్ అవుతున్నారు.
కేవలం తెలుగు సినిమాల్ని మాత్రమే ఇందులో స్ట్రీమింగ్ చేస్తూండడం, అందులో సినిమాలు కూడా బాగా ఎంటర్ టైన్ చేస్తుండడం దీనికి బాగా కలిసొస్తోంది. ఇప్పుడు ఇదే సూత్రాన్ని మీడియా దిగ్గజం రామోజీరావు కూడా ఫాలో అవుతుండడం విశేషంగా మారింది. ఆయన కూడా త్వరలో ఈనాడు ఓటీటీని ప్రారంభించనున్నట్టు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ జరుగుతోందట. ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై నిర్మించిన సినిమాలతో పాటు.. ఈటీవీ ప్రారంభించిన కొత్తల్లో .. ఒకేసారి 99 ఏళ్ళకు సరిపడా లీజుకు తీసుకుంటూ .. ఏకమొత్తంలో కొనుగోలు చేసిన వేలాది సినిమాలు ఈ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయట.
ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే సినిమాల హక్కులు.. ఇతరుల దగ్గర లేవు. అలాగే.. వారి సొంత సినిమాల్ని కూడా ఎవరికీ అమ్మలేదు. అయితే ఈ సినిమాల్నే ఈటీవీ విన్ అనే యాప్ లో అందుబాటులో ఉంచారు. ఇప్పుడు ఆ సినిమాలు, ఓటీటీల కోసం కొత్త గా కొనబోయే ఇతర సినిమాలు, అలాగే.. థియేటర్స్ లో రిలీజ్ చేసుకోలేక… ఓటీటీలకు అమ్మాలనుకొనే వారి సినిమాలు .. ఈ మొత్తం తో ఈనాడు ఓటీటీ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఇటు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ .. అటు ఈటీవీలో కూడా ప్రసారం అయ్యే ఒప్పందంతో సినిమాల్నీ కొనుగోలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట రామోజీరావు. సో.. ఈటీవీ కూడా ఓటీటీ లోకి దిగితే.. ఈ రంగంలో కూడా గట్టి పోటీ ఏర్పడుతుందని వేరే చెప్పాలా?











