పల్లెటూళ్ళు దేశానికి పట్టుగొమ్మలే కాదు.. అందాలకి అసలైన చిరునామా కూడా. ప్రకృతి పచ్చని పట్టుచీర కట్టుకుని .. సూర్యుణ్ణి సిందూరంగా దిద్దుకొని .. పక్షుల కిలకిల రావాన్ని తన మువ్వలు గా చేసుకొని సవ్వడి చేసేది ఇక్కడే. మరి అలాంటి అందమైన ఫోటో ఫ్రేమ్ లో టాలీవుడ్ ముద్దుగుమ్మలు సందడి చేస్తే ఎలా ఉంటుంది? అచ్చని తెలుగు దనమంతా ఇక్కడే కొలువుతీరినట్టు అనిపిస్తుంది కదూ . టాలీవుడ్ లో ప్రస్తుతం తెరకెక్కుతోన్న కొన్ని సినిమాల్లోని కథానాయికలు పల్లె పడుచులుగా అదరగొట్టబోతున్నారు. గోదారి గట్టుంది గట్టు మీద చెట్టుంది అంటూ.. గంతులాడబోతున్నారు.
కొండపొలం గట్టుపై రకుల్ ప్రీత్ సింగ్
దర్శకుడు క్రిష్ ప్రస్తుతం మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ హీరోగా ఒక సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. సినిమా పేరు ‘కొండపొలం’. అదే పేరుతో ఉన్న ఒక ఫేమస్ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. అడవుల్ని ఆధారంగా చేసుకొని ఆ చుట్టు పక్కల నివసించే కొందరు గొర్రెల కాపరుల జీవన విధానాన్ని ఈ సినిమాతో ఆవిష్కరించబోతున్నాడు క్రిష్. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో ఆమె పల్లెటూరి పడుచుగానూ, అడవి చుక్కగానూ మెరవబోతోంది. రారండోయ్ వేడుక చూద్దాం సినిమాలో లంగా వోణీలో మెరిసిన రకుల్ ఇప్పుడు మళ్ళీ అదే గెటప్ తో రానుండడం అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది. ఈ షెడ్యూల్ లో రకుల్ మీద కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నాడు క్రిష్.
‘ఓదెల రైల్వేస్టేషన్’ లో అందాల కుమారి
‘కుమారి 21 ఎఫ్’ తో టాలీవుడ్ కుర్రకారును నిద్రపట్టనీయకుండా చేసింది హెబ్బా పటేల్. ఆ ఒక్క సినిమాతోనూ అమ్మడి రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే .. ఆ సినిమా తర్వాత ఆమెకు దాదాపు అన్నీ అలాంటి బోల్డ్ పాత్రలే రావడంతో.. వాటిని కాదనకుండా.. చేసుకుంటూ వెళుతోంది. వాటిటో పాటు చాలా సినిమాల్లో ఐటెమ్ గాళ్ గానూ మెరిసింది. ఇప్పుడు అమ్మడు ఓ వెరైటీ రోల్ చేస్తూండడం విశేషంగా మారింది. కె.కె.రాధామోహన్ నిర్మాణంలో కొత్త దర్శకుడు అశోక్ తేజ తెరకెక్కిస్తోన్న ‘ఓదెల రైల్వే స్టేషన్’ మూవీ లో హెబ్బా పటేల్ పల్లెటూరి యువతిగా నటిస్తోంది. చీరకట్టుతో ఒక పల్లెటూళ్ళో రివీలైన హెబ్బా పటేల్ పిక్స్ కు అందరూ ఆశ్చర్యపోతున్నారు.
‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ అంటోన్న అమృతా అయ్యర్
ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా మంచి పేరు తెచ్చుకున్న ప్రదీప్ మాచిరాజు .. త్వరలో హీరోగా రాబోతున్నాడు. సినిమా పేరు ‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా ?’. గ్రామీణ వాతావరణంలో తెరకెక్కిన వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రం ఇది. మున్నా దర్శకత్వంలో త్వరలో విడుదలకు సిద్ధమయిన ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. పల్లెటూరి పడుచు గెటప్ లో చాలా అందంగా మెరుస్తోన్న ఆమె .. ఈ సినిమాతో కథానాయికగా మంచి క్రేజ్ తెచ్చుకుంటుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా నీలి నీలి ఆకాశం పాటలో ఆమె పల్లెటూరి గెటప్ ముగ్ధమనోహరంగా కనిపిస్తోంది.
‘గుడ్ లక్ సఖి’ అనిపించుకుంటోన్న మహానటి
‘మహానటి’తో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకొన్న కీర్తి సురేశ్ ప్రస్తుతం పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ ను లైన్ లో పెట్టుకుంది. అందులో ‘గుడ్ లక్ సఖి’ ఒకటి. ప్రముఖ దర్శకుడు నాగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి .. ఒక పల్లెటూరి అమ్మాయిగా అల్లరి చేసి, ఆపై షూటర్ గా మారే పాత్ర చేస్తోంది. జగపతి బాబు ఆమెకి కోచ్ గా నటిస్తున్నాడు. ఆది పినిశెట్టి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా కూడా త్వరలో ఓటీటీలో విడుదల కానుందని తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ఈసినిమా ట్రైలర్ ప్రేక్షకుల్ని భలేగా ఆకట్టుకుంది.











