డ్రగ్స్ కేసు సినీ నటుల గుండెల్లో రైళ్లు పరుగెట్టిస్తోంది. ముఖ్యంగా టాలీవుడ్ ప్రముఖుల గుండెల్లోనూ అలజడి మొదలైంది. మూడేళ్ల క్రితం తెలంగాణ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఈ డ్రగ్స్ కేసు తీగను లాగారు. డొంక కదలబోతున్న తరుణంలో ఒక్కసారిగా అంతా సద్దుమణికి పోయింది. అనేక మంది సినీ ప్రముఖులు విచారణకు హాజరైనా ఆ తర్వాత అందరూ హాయిగా ఊపిరిపీల్చుకున్నారు. ప్రస్తుతం సుశాంత్ సింగ్ మరణం తర్వాత బాలీవుడ్ లో తీగ లాగితే ఎక్కడెక్కడ డొంకలూ కదులుతున్నాయి. ఇప్పటికే కన్నడ చిత్ర పరిశ్రమలో ఈ కేసులో ఇరుక్కున్న నటి రాగిణి, సంజన కూడా బెయిల్ దొరక్కుండా జైలు జీవితం గడుపుతున్నారు. దాంతో ఇలాంటి సంబంధాలు ఉన్నా నటులంతా ముందు జాగ్రత్త పడుతున్నట్లు తెలుస్తోంది. తమ న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా తెలుస్తోంది.
ఆ నాలుగు కేసుల మాటామిటి?
నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ మీద జరుపుతున్న విచారణతో రాష్ట్రాల్లో కూడా కదలిక మొదలైంది. పాత కేసుల ఛార్జి షీటు ఫైల్ చేసే ప్రక్రియ ప్రారంభమైంది. తెలంగాణలో గతంలో జరిపిన విచారణకు సంబంధించి 72 మందితో ఛార్జిషీటు నమోదు చేశారు. ఈ కేసు ఏమైందంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ ఆర్టీఐకి దరఖాస్తు పెట్టుకోగా ఎక్సైజ్ శాఖ స్పందించింది.
గడిచిన రెండేళ్లలో దాఖలైన 12 కేసుల్లో ఎనిమిది కేసుల్లోనే ఛార్జిషీటు దాఖలు చేసినట్లు వెల్లడించింది. ఈ లిస్టులో 72 పేర్లను వెల్లడించింది. అయితే ఇందులో ఓ విశేషముంది. తెలుగు సినిమా రంగానికి సంబంధించిన నాలుగు కేసులపై ఎక్సైజ్ శాఖ ఏమీ స్పందించకపోవడమే ఆ విశేషం. ఈ నాలుగు కేసుల వ్యవహారం ఏమైందనే సస్పెన్స్ కొనసాగుతోంది. జర్మనీ, బ్రిటన్, ఇంగ్లండ్ ల నుంచి డ్రగ్స్ సరఫరా అయినట్లుగా ఎక్సైజ్ శాఖ పేర్కొంది. సినిమా ప్రముఖుల పేర్లను కావాలనే తప్పించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
డ్రగ్స్ ఎలా వస్తున్నాయి?
వివిధ దేశాల నుంచి కొందరు కొరియర్ల ద్వారా ఈ డ్రగ్స్ ప్రముఖుల వద్దకు చేరుతున్నాయి. పాత కేసులో స్టీల్‌బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్‌ఎస్‌డీ వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. www.ipsld.lo వెబ్‌సైట్ ద్వారా స్టూడెంట్స్ డ్రగ్స్ బుకింగ్ చేసినట్టు పేర్కొన్నారు. సికింద్రాబాద్ మోండా మార్కెట్ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్ తయారు చేసినట్టు గుర్తించారు. ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నాయి. టాలీవుడ్ కేసులో విచారణకు హాజరైన 12 మందితో మరో 60 మందితో ఈ జాబితా ఉంది. ఎలాంటి ఒత్తిడి కారణంగా అధికారులు ఈ కేసులో ఉన్నవారి పేర్లను వెల్లడించడం లేదో అర్థంకావడం లేదు. అసలు ఛార్జిషీటు దాఖలు చేయడానికి ఇంతకాలం ఎందుకు పట్టిందన్నది మరో ప్రశ్న.
రాష్ట్రాల్లో ఎక్సైజ్ శాఖే..
జాతీయ స్థాయిలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) ఈ డ్రగ్స్ వ్యవహారంలో పటిష్టంగా పనిచేస్తోంది. ఈసారి ఈ కేసు ఇంత బలంగా కొనసాగడానికి ఇది కూడా ఒక కారణం. ఇక రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్స్ సబ్‌స్టాన్సెస్ యాక్ట్ 1985 ప్రకారం విచారణ జరిపే అధికారం ఎక్సైజ్ శాఖకు ఉంటుంది. అకున్ సబర్వాల్ ఈ కేసులో కీలకంగా వ్యవహరించినపుడు కేవలం సినిమా వాళ్లకే పరిమితం కాలేదు అనేక పాఠశాలలు, కాలేజీలకు కూడా నోటీసులు జారీ చేశారు.
ఈ డ్రగ్స్ వాడకానికి అలవాటు పడినవారిలో మైనర్లు కూడా ఉన్నందున వారి పేర్లను వెల్లడించలేదు. కొంతమంది సినీ ప్రముఖుల్ని విచారణ చేసినపుడు ఆ ప్రక్రియను కెమెరాల్లో రికార్డు చేశారు. గతంలో కొంతమంది డ్రగ్స్ కు బానిసై ఆ తర్వాత మానేసిన వారు కూడా ఉంటారు. అలాంటి వారి పేర్లు ఇప్పుడు వెలుగులోకి వస్తే వారిని నేరస్తులుగానే పరిగణిస్తున్నారనేది ఇంకో ఆరోపణ. ఆ సంబంధాలను తెంచేసుకుని సాధారణ జీవితం గడుపుతున్నవారిని ఇలా బయటకు తీసుకురావడం ఎంతవరకు సమంజసం అనేది మరో ప్రశ్న. ఇలా అనేక అంశాలు ఈ కేసుతో ముడిపడి ఉన్నాయి. కాకపోతే ఇలా మీడియా ద్వారా పేర్లు వెల్లడి కావడంవల్ల తమ ప్రతిష్ఠకు భంగం కలుగుతోందని ప్రముఖులు వాపోతున్నారు.











