2023 రాబోవు ఎన్నికలే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తన యాక్షన్ ప్లాన్‌ను ఇప్పటి నుంచే అమలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో గడ్డు పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నెక్ట్స్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని కాంగ్రెస్ పార్టీ చూస్తోంది. దీనికోసం ఇప్పటి నుంచే యాక్షన్ ప్లాన్లను రచిస్తోంది. దీనికోసం తెలంగాణ ఏఐసీసీ ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ రంగంలోకి దిగారు. తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఆయన సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా సరికొత్త యాక్షన్ ప్లాన్ ను మాణికం రెడీ చేశారు.
ప్లాన్ 2023..
రాష్ట్రంలోని దాదాపు 700 మండలాల్లో ప్రతి నాయకుడు 10 మండలాల చొప్పున బాధ్యతలను అప్పగించేలా 2023 ఎన్నికల యాక్షన్ ప్లాన్ చేసినట్లు తెలిసింది. 2023లో అసెంబ్లీ ఎన్నికల వరకు ఆ 10 మండలాల బాధ్యతలను ఆ నాయకులే చూసుకోవాలి. మండలాల బాధ్యతలను ఆయా నియోజకవర్గ నాయకులకు, జిల్లా నాయకులకు అప్పగించనున్నారు. మండలాల బాధ్యతలను ఎవరు తీసుకోవాలని అనే దానికి సంబంధించిన ఓ నివేదికను సిద్ధం చేయాలని పిసిసి నేతలకు ఠాకూర్ సూచించారని తెలిసింది. దీనికి సంబంధించిన 70 మంది సీనియర్ నాయకుల జాబితాను త్వరలోనే రెడీ చేసి తనకు పంపించాలని ఉత్తమ్‌కు ఆయన దిశానిర్ధేశం చేసినట్లు సమాచారం. ఆ లిస్టును పీసీసీ రెడీ చేయబోతున్నది.
సమస్యలపై సబ్ కమిటీ..
నేతల జాబితా సిద్దమైన తరువాత రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి పెట్టి, ఒక్కో సమస్యకు ఒక్కో సబ్ కమిటీని ఏర్పాటు చేసుకునేలా సరికొత్త స్కెచ్ లకు తెరలేపుతున్నారు. ఆ కమిటీలో సమస్యలపై చర్చించి, ఆ సమస్యల పరిష్కారానికి పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఇక్కడి నేతలకు సూచించారని తెలిసింది.
ఎన్నికలపై చర్చ..
గాంధీ భవన్ లో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, ఎమ్మెల్సీ ఎన్నికల అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో ఏఐసీసీ ఇంఛార్జ్ మాణికం ఠాకూర్ హాజరయ్యారు. అలాగే టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, శ్రీనివాస్ కృష్ణన్, వర్కింగ్ ప్రెసిడెంట్స్ పొన్నం ప్రభాకర్, కుసుమ కుమార్, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజా నర్సింహా, నేతలు షబ్బీర్ అలీ, వి.హన్మంతరావు, డీసీసీ అధ్యక్షులు, తదితరులు కూడా ఈ సమావేశంలో పాల్గిన్నారు. రాష్ట్రంలో జరగనున్న ఎన్నికలపై రచించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా సమావేశం కొనసాగింది. రేపు కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా గాంధీభవన్ నుంచి రాజ్ భవన్ వరకు తలపెట్టిన నిరసన ర్యాలీలో మాణికం ఠాకూర్ పాల్గొననున్నారు.











