ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఆసక్తికర మ్యాచ్‌కు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌గా గుర్తింపు సంపాదించుకున్న విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ సోమవారం జరిగే మ్యాచ్‌లో ముఖాముఖి తలపడబోతున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు, వైస్-కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో తొలిసారి పోటీపడబోతున్నాయి. సోమవారం సాయంత్రం 7:30 గంటలకు దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగబోతోంది.
ఈ సీజన్‌లో రెండేసి మ్యాచ్‌లు ఆడిన ఇరు జట్లూ ఒక్కో మ్యాచ్ గెలిచి సమాన స్థితిలోనే ఉన్నాయి. ఈ సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓడిపోయిన రోహిత్ టీమ్.. రెండో మ్యాచ్‌లో కోల్‌కతాను ఓడించింది. ఇక, ఆడిన తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ను ఓడించిన కోహ్లీ సేన.. రెండో మ్యాచ్‌లో పంజాబ్ చేతిలో ఓటమి చవిచూసింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో సమాన స్థితిలో ఉన్న ఈ రెండు జట్లూ సోమవారం జరిగే మ్యాచ్‌లో గెలిచి పైకి ఎగబాకాలని చూస్తున్నాయి. మరి, విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి.
బెంగళూరు బలాలు
స్టార్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ బెంగళూరు టీమ్‌కు అతి ముఖ్యమైన బలం. వీరి రాణిస్తే ఆ జట్టుకు తిరుగుండదు. లేదంటే ఓటమి తప్పడం లేదు. తొలి మ్యాచ్‌లో డివిల్లియర్స్ రాణించడంతో బెంగళూరు గెలుపొందింది. రెండో మ్యాచ్‌లో కోహ్లీ, డివిల్లియర్స్ విఫలమవడంతో బెంగళూరు ఏకంగా 97 పరుగుల తేడాతో ఓడిపోయింది. వీరిద్దరితో పాటు అరోన్ ఫించ్, వాషింగ్టన్ సుందర్ రాణిస్తే బెంగళూరు పుంజుకుంటుంది. ఈ సీజన్‌లోనే అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కళ్ తొలి మ్యాచ్‌లో ఆకట్టుకున్నాడు. అతడు తన ఫామ్‌ను కొనసాగించాలి. శివమ్ దూబే ఆల్‌రౌండ్ ప్రతిభతో ఆకట్టుకుంటున్నాడు. బౌలింగ్ విభాగంలో ఉమేశ్ యాదవ్, డేల్ స్టెయిన్, చాహల్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లు ఉన్నారు.
బలహీనతలు
టీమ్ పూర్తిగా కోహ్లీ, డివిల్లియర్స్ మీదనే ఆధారపడుతుండడాన్ని మైనస్‌గా చెప్పాలి. మిగిలిన బ్యాట్స్‌మెన్ బాధ్యత తీసుకోవడంలో విఫలమవుతున్నారు. స్టార్ ఆటగాడు అరోన్ ఫించ్ ఫామ్‌లో లేకపోవడం బెంగళూరుకు అతిపెద్ద లోటు. అలాగే తొలి మ్యాచ్‌లో రాణించిన బౌలింగ్ విభాగం రెండో మ్యాచ్‌లో చేతులెత్తేసింది. ఉమేశ్, స్టెయిన్ లాంటి బౌలర్లు 11 పైనే ఎకానమీతో పరుగులు ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. మరి, సోమవారం మ్యాచ్‌లో అయినా వీరు గాడిన పడతారేమో చూడాలి.
బెంగళూరు జట్టు (అంచనా)
కోహ్లీ, దేవదత్ పడిక్కళ్, ఫించ్, ఏబీ డివిల్లియర్స్, పార్థివ్ పటేల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, నవ్‌దీప్ షైనీ, చాహల్, డేల్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్.
ముంబై ఇండియన్స్ బలాలు
ఎప్పటిలాగానే ఈ సీజన్‌లోనూ ముంబై టీమ్ టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగింది. అయితే తొలి మ్యాచ్‌లో చెన్నై చేతిలో ఓటమి పాలైంది. వెంటనే తేరుకుని రెండో మ్యాచ్‌లో కోల్‌కతాను చిత్తు చేసింది. ముంబై టీమ్‌లో రోహిత్ శర్మ, డికాక్, సూర్యకుమార్, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, బుమ్రా, బౌల్ట్, ప్యాటిన్సన్ వంటి అంతర్జాతీయ స్థాయి మ్యాచ్ విన్నర్లు ఉన్నారు. బౌలింగ్, ఫీల్డింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అత్యంత బలంగా ఉంది. రెండో మ్యాచ్‌తో కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం శుభపరిణామం. అతడు ఫామ్‌ను కొనసాగిస్తే ప్రత్యర్థి జట్టుకు తిప్పలు తప్పవు.
బలహీనతలు
వ్యక్తిగత ప్రదర్శనలు తప్ప సమష్టిగా రాణించలేకపోవడం ముంబై జట్టు ముఖ్య సమస్య. అలాగే మిడిలార్డర్ వైఫల్యం కూడా ఎక్కువగా ఉంది. హార్దిక్, పోలార్డ్ వంటి హార్డ్ హిట్టర్లు ఇంకా తమ మార్క్ చూపించలేదు. స్టార్ బౌలర్ బుమ్రా వికెట్లు తీస్తున్నప్పటికీ పరుగులు భారీగా సమర్పించుకుంటున్నాడు. లోకల్ ప్లేయర్లు ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నారు.
ముంబై జట్టు (అంచనా)
రోహిత్ శర్మ, డికాక్, సూర్య కుమార్, సౌరబ్ తివారి, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, ప్యాటిన్సన్, బుమ్రా
మ్యాచ్ ఫేవరెట్
ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌లను పరిశీలిస్తే బెంగళూరుపై ముంబైదే పైచేయి. ఈ రెండు టీమ్‌లు ఇప్పటివరకు 27సార్లు తలపడితే 18 మ్యాచ్‌ల్లో ముంబైదే విజయం. కేవలం 9సార్లు మాత్రమే బెంగళూరు గెలుపొందింది. సోమవారం మ్యాచ్‌లో కూడా ముంబై టీమ్‌కే విజయావకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కోహ్లీ, డివిల్లియర్స్ వంటి ఆటగాళ్లు చెలరేగితే బెంగళూరుకు విజయావకాశాలు పుష్కలంగా ఉంటాయి.











