తెరమీద కొన్ని పాత్రలు విడ్డూరంగా అనిపిస్తాయి. చెలిగా నటించిన హీరోయిన్నే చెల్లిగా మారుతుంది. జంటగా నటించాల్సిన కథానాయికే అక్కవుతుంది. అత్త గా నటించిన వారే అమ్మగా అభినయిస్తారు. అమ్మగా ఆప్యాయత కురిపించిన పాత్రే.. మరో సినిమాలో అహంకారాన్ని ప్రదర్శించే అత్త అవుతుంది. అంతేకాదు.. ఒకోసారి అల్లుడుగా నటించిన వారికే భర్తగా నటించాల్సి వస్తుంది. ఇప్పుడు బాలయ్య, బోయపాటి సినిమా విషయంలో ఇలాంటి అరుదైన అంశమే చోటుచేసుకుంటోంది. ఇందులో బాలయ్య చేయబోతున్న రెండు పాత్రల్లో ఒక పాత్ర సరసన అలనాటి అందాల తార జయప్రద జోడీగా నటించనుండడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
ఒకప్పుడు టాలీవుడ్ లో ఎన్టీఆర్, ఎఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణం రాజు లాంటి అగ్ర హీరోల సరసన రొమాన్స్ పండించిన అందాల కథానాయిక జయప్రద.. ఆ తర్వాత తరం హీరో అయిన చిరంజీవి సరసన కూడా కథానాయికగా నటించింది. కానీ బాలయ్య పక్కన మాత్రం హీరోయిన్ గా నటించలేదు. కానీ పదమూడేళ్ళ క్రితం విడుదలైన బాలకృష్ణ నటించిన ‘మహారథి’లో ఆయనకి అత్తగారిగా నటించి మెప్పించింది. అందులో ఆవిడ పాత్ర చాముండేశ్వరీ దేవి. అహాంకారం నిండిన ధనికురాలి పాత్ర అది. ఇప్పుడు అదే జయప్రద.. ఈ వయసులో బాలయ్య సరసన కథానాయికగా నటించనుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
లాక్ డౌన్ కు ముందు ఒక షెడ్యూల్ జరుపుకున్న బీబీ3 సినిమా .. కరోనా కారణంగా షూటింగ్ కు 6 నెలలు బ్రేకిచ్చింది. ఈ గ్యాప్ లో ఆ సినిమా స్ర్కిప్ట్ లో పలు మార్పులు చేర్పులు చేశాడట బోయపాటి. ఆ క్రమంలోనే ఇందులో ఒక పవర్ ఫుల్ పాత్ర కోసం జయప్రదను సంప్రదించారట. అఘోరా పాత్ర పోషిస్తోన్న బాలయ్య సరసనే కథానాయికగా నటిస్తూండడం ఆమెకు కూడా ఆసక్తిగా అనిపించిందట. వెంటనే ఆ పాత్రకు జయప్రద గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఒకటి రెండు నెలల్లో సినిమా షూటింగ్ ను పున: ప్రారంభించి..ఏప్రిల్ నెలలో సినిమాను విడుదల చేయనున్నారని టాక్ . మరి బాలయ్య, జయప్రద జోడీ ఈ సినిమాకి ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చూడాలి.











