జగన్ సర్కార్ కు న్యాయస్థానాలలో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రభుత్వం తమ విధులలో జోక్యం చేసుకోవడమే గాక తమ ఉద్యోగులు విధులను నిర్వర్తించకుండా సీఐడీ కేసులు నమోదు చేసిందని పీటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఎన్నికల కమీషనర్ సహాయ కార్యదర్శి సాంబమూర్తి కూడా హైకోర్టులో పీటీషన్ దాఖలు చేశారు. ఈ పీటీషన్ పై విచారణ జరిపిన హైకోర్ట్ రెండు పీటీషన్లను కలిపి విచారిస్తామని తెలిపింది. విచారణ నిలిపివేయాలంటూ సీఐడీని కోర్ట్ ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వస్తువులను ఎలక్షన్ కమిషన్ కు అందచేయాలని సీఐడీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయడంతో ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆయనను తొలగిస్తూ ఓ స్పెషల్ జీఓ తీసుకువచ్చిన ప్రభుత్వం కొత్త వ్యక్తికి పదవిని కట్టబెట్టారు. దీంతో నిమ్మగడ్డ హైకోర్టును ఆశ్రయించారు. రాజ్యాంగ వ్యవస్థలలో ప్రభుత్వం జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసిన హైకోర్టు ప్రభుత్వ నిర్ణయాన్ని నిలుపుదలచేసింది. కానీ అందుకు ఒప్పుకోని జగన్ సర్కార్ సుప్రీం గడప తొక్కింది. సుప్రీం కూడా కింది కోర్టు నిర్ణయానికే మద్దతు పలకడంతో గత్యంతరం లేని ఏపీ సర్కార్ అర్ధరాత్రి రమేష్ కుమార్ కు బాధ్యతలు అప్పగిస్తూ జీఓని విడుదల చేసింది. బాధ్యతలు చేపట్టిన నిమ్మగడ్డ తమ విధులకు సీఐడీ అధికారులు అడ్డుపడుతున్నారని ఫిర్యాదు చేశారు.