కరోనా సమయంలో కూడా ప్రభాస్ వార్తల్లో హీరో అయిపోయారు. ఓ పక్క ‘ఆదిపురుష్’లోని రాముడి పాత్ర కోసం ఆర్చరీలో శిక్షణ తీసుకుంటూనే మరో పక్క తన సినిమాల గురంచి ప్రణాళికలు రచించుకుంటున్నారు. మొన్నటికి మొన్న తన ఫిట్ నెస్ మాస్టర్ కు ఓ రేంజ్ రోవర్ కారును బహుమానంగా కొనిచ్చారు. తాజా వార్త ఏమిటంటే ఆయన ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే … రాజ్యసభ సభ్యులు, జోగినిపల్లి సంతోష్ కుమార్ ‘గ్రీన్ ఇండియా ఛాలెంజ్’ మూడో విడత కార్యక్రమాన్ని ప్రభాస్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఎందరో ప్రముఖులు కొనసాగించారు.

సినిమా ప్రముఖులు, రాజకీయనాయకులు మొక్కలు నాటుతూ కార్యక్రమాన్ని ముందుకు వెళుతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఆరోజున ఎంపీ సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటడమే కాకుండా సంగారెడ్డి జిల్లాలోని ఖాజిపల్లె వద్దనున్న వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్‌ను దత్తత తీసుకుంటానని ప్రకటించారు. అలా తన ఛాలెంజ్‌కు రామ్ చరణ్, రానా, శ్రద్ధాకపూర్‌లను కూడా నామినేట్ చేశారు. ఆరోజు ప్రకటించిన వాగ్దానాన్ని ప్రభాస్ ఈరోజు నిలుపుకున్నారు. అయితే వెయ్యి ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్ భూమినే కాకుండా ఓ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. హైదరాబాద్ లోని అవుటర్ రింగ్ రోడ్డుకు దగ్గరలో ఉన్న ఖాజీపల్లె అనే గ్రామంలోని అర్బన్ బ్లాక్‌ని సోమవారం ఆయన దత్తత తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎంపీ సంతోష్ కుమార్ తో పాటు అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా హాజరయ్యారు.
రెండు కోట్ల రూపాయల విరాళం
ఈ అటవీ ప్రాంతం దుండిగల్ సమీపంలో ఉంది. ఖాజిపల్లిలో అర్బన్ ఫారెస్ట్ పార్కుకు ప్రభాస్ శంకుస్థాపన చేశారు. దీన్నితన తండ్రి యు.వి.ఎస్. రాజు పేరు మీద అర్భన్ పార్కుగా, అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని ప్రభాస్ ప్రకటించారు. దీని కోసం రెండు కోట్ల రూపాయలను విరాళంగా అందించారు. అవసరాన్ని బట్టి మరింత ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ శోభ ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.











