శనివారం జరిగే తొలి మ్యాచ్‌లో గత ఏడాది ఫైనలిస్ట్‌లు ముంబై ఇండియన్స్ (ఎమ్ఐ), చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) జట్లు తలపడబోతున్నాయి. ధోనీ నేతృత్వంలోని అనుభవానికి, రోహిత్ సారథ్యంలోని దూకుడుకి మధ్య జరిగే పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలంటే మరికొద్ది గంటలు ఆగాల్సిందే. అబుదాబిలోని షేక్ జాయేద్ క్రికెట్ స్టేడియంలో భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కాబోతోంది.
గతేడాది జరిగిన ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్‌పై ముంబై ఇండియన్స్ జట్టు కేవలం ఒక్క పరుగు తేడాతో విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. ఈ సారి లెక్క సరిచేయాలని ధోనీ జట్టు కృత నిశ్ఛయంతో ఉంది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన ధోనీ ఈ సీజన్లో `సీఎస్కే`ని విజేతగా నిలిపి ఐపీఎల్‌కు కూడా గుడ్‌బై చెప్పాలనుకుంటున్నాడు. మరోవైపు ఇప్పటికే నాలుగు సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై జట్టు పటిష్టమైన లైనప్‌తో అగ్రజట్టుగా బరిలోకి దిగుతోంది.
ముంబై ఇండియన్స్ జట్టు బలాలు
ఐపీఎల్లో ముంబై జట్టు 2013, 15, 17, 19 సంవత్సరాల్లో టైటిల్స్ సాధించింది. నాలుగు సార్లు టైటిల్స్ సాధించినప్పటికీ ఒక్కసారి కూడా వరుసగా టైటిల్ గెలిచిన రికార్డు ముంబై టీమ్‌కు లేదు. గతేడాది విజేతగా నిలిచిన రోహిత్ సేన ఈ ఏడాది కూడా టైటిల్ సాధించాలంటే మరింత కష్టపడాల్సిందే. మిగిలిన జట్లతో పోలిస్తే ముంబై బ్యాటింగ్ లైనప్‌లో హార్డ్ హిట్టర్లు ఎక్కువగా ఉన్నారు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, డికాక్, క్రిష్ లియాన్ తమదైన రోజున ఎలాంటి బౌలింగ్‌నైనా తుత్తునియలు చేయగలరు. ఇక, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా కూడా స్టేడియం అవతలకు బంతిని పంపగల సమర్థులే. ఇక, ఫాస్ట్ బౌలింగ్ విభాగం చూస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ టీ-20 బౌలర్ జస్ప్రీత్ బుమ్రా, ఫాస్టెస్ట్ బౌలర్లు ట్రెంట్ బౌల్ట్, మిచెల్ మెక్లాగన్తో పటిష్టంగా ఉంది. ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేయగలడు. జట్టులో ఎక్కువ శాతం మంది యువకులే ఉండడంతో ఫీల్డింగ్ విభాగంలో ముంబై అత్యుత్తమ జట్టని చెప్పవచ్చు.
బలహీనతలు: ముంబై జట్టు బ్యాటింగ్ లైనప్‌లో స్థిరత్వం కాస్త తక్కువ. మంచి ఆరంభం లభిస్తే తర్వాత వచ్చే బ్యాట్స్‌మెన్ దానిని కొనసాగించగలరు. అదే పిచ్ ఏమాత్రం బౌలింగ్‌కు అనుకూలించినా అనుభవ లేమి కారణంగా తడబడుతుంటారు. ఇక, స్పిన్ విభాగంలో ముంబై జట్టు చాలా బలహీనంగా ఉంది. రాహుల్ చాహర్, కృనాల్ పాండ్యా మాత్రమే ముంబై జట్టులోని స్పిన్నర్లు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బందిపెట్టగల స్థాయిలో వీరి బౌలింగ్ ఉండకపోవడం పెద్ద లోటు.
ముంబై జట్టు (అంచనా): రోహిత్ శర్మ, డికాక్, క్రిష్ లియాన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, కీరన్ పోలార్డ్, కృనాల్ పాండ్యా, ధవల్ కలకర్ణి, జస్ప్రీత్ బుమ్రా, రాహుల్ చాహర్, ట్రెంట్ బౌల్ట్/ మిచెల్ మెక్‌లాగన్
చెన్నై సూపర్ కింగ్స్ బలాలు
చెన్నై జట్టుకు అతిపెద్ద బలం ఆ టీమ్ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. వికెట్ కీపర్‌గా, బ్యాట్స్‌మెన్‌గా, నాయకుడిగా ధోనీ సేవలు అపారం. దాదాపు సంవత్సరం తర్వాత ధోనీ మైదానంలోకి అడుగుపెడుతుండడం అభిమానుల్లో మరింత జోష్‌ను పెంచుతోంది. అతని హెలికాఫ్టర్ షాట్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనుభవజ్ఞులైన షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ, జడేజా, విజయ్‌తో కూడా బ్యాటింగ్ విభాగం బలంగానే ఉంది.
బలహీనతలు: ఎక్కువ శాతం సీనియర్ ఆటగాళ్లు ఉండడం చెన్నైకి శాపంగా మారనుంది. ఫీల్డింగ్ విభాగంలో ఈ జట్టు బలహీనంగా ఉంది. సురేశ్ రైనా, హర్బజన్ లేని లోటు చెన్నై జట్టులో స్పష్టంగా కనబడుతోంది. బౌలింగ్ విభాగంలో హాజల్‌వుడ్, డ్వేన్ బ్రేవో, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ సాంట్నర్లు ఉన్నారు. వీరిలో మ్యాచ్ విన్నర్లు ఎవరు అంటే చెప్పడం కష్టమే.
చెన్నై జట్టు (అంచనా): షేన్ వాట్సన్, డుప్లెసిస్, అంబటి రాయుడు, ధోనీ, కేదార్ జాదవ్, జడేజా, డ్వేన్ బ్రావో, శార్దూల్ ఠాకూర్, పియూష్ చావ్లా, హాజెల్‌వుడ్, దీపక్ చాహర్/ ఇమ్రాన్ తాహిర్.
మ్యాచ్ ఫేవరెట్: ప్రస్తుత పరిస్థితులు, ఆటగాళ్లు, బలాలను బట్టి చూస్తే అన్ని విభాగాల్లోనూ చెన్నై కంటే ముంబై టీమ్ బలంగా కనబడుతోంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లలో కుర్రాళ్లతో కూడిన ముంబై జట్టు మెరుగ్గా కనిపిస్తోంది. అనుభవజ్ఞులతో కూడిన చెన్నై టీమ్ ఇప్పటికే `డాడీస్ ఆర్మీ` అని ముద్ర వేయించుకుంది. చాలా మంది అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయిన ఆటగాళ్లే ఉన్నారు. ఈ నేపథ్యంలో కుర్రాళ్లతో కూడిన ముంబైని నిలువరించడం చెన్నైకి సవాలే అని చెప్పాలి.











