సన్ రైజెర్స్ హైదరాబాద్ టోర్నీలో తొలి విజయాన్ని నమోదు చేసింది. బ్యాటింగ్ లో రాణించకపోయినా బౌలింగ్ లో సత్తా చాటి పాయింట్స్ టేబుల్ లో 2 పాయింట్లు సొంతం చేసుకుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ మొదటి 10 ఓవర్లు నిదానంగా ఆడింది. దూకుడుగా ఆడే వార్నర్, బెయిర్ స్టోలు కూడా నిదానంగా ఆడారు. పిచ్ బౌలింగ్ కు అనుకూలించడంతో పరుగులు చేసేందుకు హైదరాబాదు ఓపెనర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురుకున్నారు. తొలి వికెట్ కు 77 పరుగులు జోడించిన తరువాత వార్నర్(45) పరుగులు చేశాడు. ఆ వెంటనే మనీష్ పాండే(3) కూడా ఔట్ కావడంతో 92 పరుగులకే 2 వికెట్లు నష్టపోయి కష్టాల్లో పడింది.
ఈ దశలో విలియమ్సన్ క్రీజులోకి వచ్చారు. తన మార్క్ టైమింగ్ తో విలియమ్సన్ చక్కని షాట్లతో అలరించారు. మరో ఎండ్ లో బెయిర్ స్టో కూడా హాఫ్ సెంచరీ చేయడంతో హైదరాబాద్ 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. 163 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ జట్టు కూడా ఆదిలోనే పృథ్వీ షా(2) వికెట్ నష్టపోయింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన శ్రేయాస్ అయ్యర్ తో కలిసి శిఖర్ ధావన్ జట్టు స్కోరును 42 పరుగులకు చేర్చారు.
తిప్పేసిన రషీద్ ఖాన్
‘మిస్టరీ’ స్పిన్నర్ రషీద్ ఖాన్ తన అద్భుత స్పెల్ తో ఢిల్లీని హడలెత్తించాడు. దూకుడుగా ఆడుతున్న శ్రేయాస్ అయ్యర్(17)ని ఔట్ చేసిన రషీద్ ఆ వెంటనే శిఖర్(34)ని పెవిలియన్ చేర్చాడు. మొదటి స్పెల్ లో 3 ఓవర్లు వేసి 10 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన రషీద్ ఖాన్ ఢిల్లీ స్కోరు వేగానికి బ్రేకులు వేశారు. ఢిల్లీ మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లు పంత్-హెత్మయిర్ దూకుడుగా ఆడుతున్న సమయంలో రషీద్ ఖాన్ మరోమారు ఎంట్రీ ఇచ్చారు. తన స్పెల్ చివరి ఓవర్ వేసిన రషీద్ కీలకమైన పంత్(28) వికెట్ తీశాడు. మొత్తం మీద 4 ఓవర్లు వేసిన రషీద్ కేవలం 14 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు తీశారు. దీంతో ఒత్తిడికి లోనైన ఢిల్లీ జట్టు నిర్ణిత 20 ఓవర్లలలో కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. అద్భుత స్పెల్ తో హైదరాబాద్ ను గెలిపించిన రషీద్ ఖాన్ ను మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపిక చేశారు.
ఢిల్లీకి మరో షాక్
జట్టు ఓటమితో షాక్ లో ఉన్న ఢిల్లీ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కు మరో షాక్ తగిలింది. సకాలంలో ఓవర్ల కోటా పూర్తి చేయకపోవడంతో ఐపీఎల్ రూ. 12 లక్షల జరిమానా విధించింది. మొదటి తప్పు కావడంతో జరిమానాతో సరిపెట్టుకుంది. హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో శ్రేయాస్ ఎక్కువసార్లు ఫీల్డింగ్ మార్పులు చేయడంతో పాటు బౌలర్లతో మాట్లాడం కారణంగా స్లో ఓవర్ రేట్ నమోదయింది.











