ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగి అదరగొడుతున్నాయి. ఇప్పటివరకు ఇరు జట్లూ నాలుగేసి మ్యాచ్‌లు ఆడి మూడేసి విజయాలు సాధించాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. సమాన విజయాలు సాధించినప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా ఢిల్లీ క్యాపిటల్స్ నెంబర్ పొజిషన్ దక్కించుకుంది. తర్వాత రెండో స్థానంలో బెంగళూరు టీమ్ ఉంది.
ఈ రెండు టీమ్‌ల మధ్య తొలి మ్యాచ్ సోమవారం సాయంత్రం 7:30 గంటలకు జరుగనుంది. అటు బౌలింగ్‌లోనూ, ఇటు బ్యాటింగ్‌లోనూ సమతూకంతో ఉన్న ఈ రెండు టీమ్‌ల మధ్య మ్యాచ్ ఆసక్తికరం అనడంలో సందేహం లేదు. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. మరి, ఏ టీమ్ తన విజయ పరంపరను కొనసాగిస్తుందో చూడాలి.
బెంగళూరు టీమ్ బలాలు
గతేడాది ఐపీఎల్‌లో పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న బెంగళూరు టీమ్ ఏడాది సీజన్‌లో మంచి ఫామ్‌లో ఉంది. ఏకంగా రెండో స్థానానికి దూసుకొచ్చింది. బెంగళూరు టీమ్ ఆటగాళ్లందరూ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ముఖ్యంగా ఆరోన్ ఫించ్, దేవదత్ పడిక్కళ్ అదిరిపోయే ఆరంభాన్ని ఇస్తున్నారు. యువ ఆటగాడు దేవదత్ ఆద్భుత ఫామ్‌లో ఉన్నాడు. బెంగళూరు టీమ్‌కే కాదు.. టీమిండియాకు కూడా ఆశాకిరణంగా కనబడుతున్నాడు. ఇక, `కింగ్` కోహ్లీ శనివారం జరిగిన మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు. రాజస్థాన్‌ను ఓడించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక, బౌలింగ్ విభాగంలో చాహల్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంటున్నాడు. తన స్పిన్ మాయజాలంతో మాయ చేస్తున్నాడు.
బలహీనతలు
డేల్ స్టెయిన్, ఉమేష్ యాదవ్ వంటి అంతర్జాతీయ స్థాయి బౌలర్లు పూర్తి స్థాయిలో సత్తా చాటలేకపోతున్నారు. దీంతో వారిని జట్టు నుంచి తప్పించాల్సిన పరిస్థితి తలెత్తింది. అలాగే లోయర్ మిడిలార్డర్‌లో డివిలియర్స్‌కు తోడుగా ఎవరూ నిలవడం లేదు. ఆల్‌రౌండర్లు పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నారు. ఢిల్లీ వంటి బలమైన ప్రత్యర్థి ఎదురైనపుడే కోహ్లీ సేనలోని బలహీనతలు బయటపడతాయి. స్థానిక ఆటగాళ్లు ఇంకా సత్తా చాటలేకపోతున్నారు.
బెంగళూరు జట్టు (అంచనా)
దేవదత్ పడిక్కళ్, అరోన్ ఫించ్, కోహ్లీ, డివిల్లియర్స్, శివమ్ దూబే, గుర్కీరత్ సింగ్, వాషింగ్టన్ సుందర్, ఉదాన, నవదీప్ షైనీ, చాహల్, ఆడమ్ జంపా.
ఢిల్లీ టీమ్ బలాలు
ఎలాంటి అంచనాలూ లేకుండా బరిలోకి దిగిన ఢిల్లీ టీమ్ వరుస విజయాలతో అదరగొడుతోంది. శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలో మునుపెన్నడూ లేని రీతిలో రాణిస్తోంది. సన్‌రైజర్స్ మ్యాచ్‌లో తప్ప మిగిలిన అన్ని మ్యాచ్‌ల్లోనూ అద్భుతంగా రాణించింది. ఇక, పాయింట్ల పట్టికల్లో అగ్రస్థానంలో ఉండడం ఢిల్లీ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతోంది. పృథ్వీ షా సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇక, శిఖర్ ధవన్, శ్రేయాస్ అయ్యార్, పంత్ కూడా బ్యాట్‌తో సమయోచితంగా రాణిస్తున్నారు. బౌలింగ్ విభాగంలో అమిత్ మిశ్రా, నోర్ట్జే, రాబాడా రాణిస్తున్నారు. ఆల్ రౌండర్లతో ఢిల్లీ టీమ్ పటిష్టంగా కనబడుతోంది.
బలహీనతలు
మూడో మ్యాచ్‌లో హైదరాబాద్ చేతిలో ఓడిపోవడం మినహా ఢిల్లీ టీమ్‌కు పెద్దగా ఇబ్బందులు ఎదురు కాలేదు. ఢిల్లీ బౌలర్లు అన్ని మ్యాచ్‌ల్లోనూ మెరుగైన ప్రదర్శనే చేస్తున్నప్పటికీ బ్యాట్స్‌మెన్ అప్పుడప్పుడు నిరాశపరుస్తున్నారు. గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన అశ్విన్ మునుపటి ఫామ్‌లోకి ఇంకా రాలేదు. ఇక, స్పిన్ ఆడడంలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ తడబడుతున్నారు. మరి, బలమైన బెంగళూరు టీమ్‌తో ఎలా ఆడతారో చూడాలి.
ఢిల్లీ టీమ్ (అంచనా)
పృథ్వీ షా, శిఖర్ ధవన్, శ్రేయస్ అయ్యర్, పంత్, స్టోయినిస్, హెట్‌మేయర్, రబాడా, అశ్విన్, నోర్ట్జే, అమిత్ మిశ్రా, హర్షత్ పటేల్.
మ్యాచ్ ఫేవరెట్
ఈ మ్యాచ్‌లో రెండు బలమైన టీమ్‌లు పోటీ పడుతున్నాయి. రెండు టీమ్‌లలోని ఆటగాళ్లూ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. ఏ టీమ్‌ను తక్కువ అంచనా వేయడానికి లేదు. ఇరు జట్లకు విజయావకాశాలు సమానంగా ఉన్నాయి. విజయం ఎవరిని వరించినా మ్యాచ్ చూసే ప్రేక్షకులకు మాత్రం మంచి వినోదం అందడం ఖాయంగా కనిపిస్తోంది.











