గతంలో క్రీడా చిత్రాల్లో పోటీదారులుగా నటించిన మన హీరోలు ఇప్పుడు.. కోచ్ ల అవతార మెత్తుతుండడం విశేషం. ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో నటిస్తున్న ‘సీటీమార్’ లో కబడ్డీ కోచ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే.. ఇటీవల ‘బిగిల్’ మూవీలో దళపతి విజయ్ ఫుట్ బాల్ కోచ్ గా నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు మహేశ్ బాబు వంతు వచ్చింది. అతడు ఏకంగా క్రికెట్ కోచ్ గా దర్శనమివ్వబోతున్నడని టాలీవుడ్ టాక్.
లాస్ట్ ఇయర్ సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వురు’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు మహేశ్ బాబు. అనిల్ రావిపూడి స్టైలాఫ్ కామెడీ ఎంటర్ టైనర్ అభిమానుల్ని ఎంతగానో మెప్పించింది. అందుకే ఇప్పుడు ఈ కాంబో రిపీట్ అవుతుండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ సినిమాలోనే అనిల్ రావిపూడి మహేశ్ ను క్రికెట్ కోచ్ ను చేస్తున్నాడట. క్రికెట్ నేపథ్యంలో సాగే కామెడీ ఎంటర్ టైనర్ గా అనిల్ ఈ కథను తీర్చిదిద్దుతున్నాడట. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన అనౌన్స్ మెంట్ రాబోతోంది. మరి మహేశ్ క్రికెట్ కోచ్ గా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటాడో చూడాలి.