ఏపీలో సినిమా టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలో తెలుగు చలన చిత్ర ప్రముఖులు రేపు సీఎం జగన్ ను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. టిక్కెట్ల రేట్లు పెంపు విషయంలో ప్రభుత్వం రేపే ఓ నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లోగానే ఓసారి ముఖ్యమంత్రిని కలవడం మంచిదన్న అభిప్రాయంతో చిత్ర ప్రముఖులు ఉన్నారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నేతృత్వంలో కొందరు స్టార్ హీరోలు సైతం వెళ్లి ముఖ్యమంత్రిని రేపు కలవబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ ధరల విషయంలో గత కొంతకాలంగా వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే పెద్ద సినిమాలు విడుదల కానుండటంతో ఈలోగా సీఎంను కలవడమే సముచితమన్న అభిప్రాయానికి చిత్ర ప్రముఖులు వచ్చారు. దీనికి ప్రభుత్వ పరంగా కూడా గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. ఇప్పటికే సీఎం జగన్ తో గత నెల 14న మెగాస్టార్ భేటీ అయ్యారు. ఈ ధరల విషయంలో న్యాయం చేస్తానని సీఎం ఆయనకు మాట ఇచ్చినట్టు కూడా తెలిసింది. రేపు కలవబోయే బృందంలో చిరంజీవితో పాటు ప్రభాస్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, నాగార్జున తదితరులు కూడా ఉంటారని తెలుస్తోంది.
తగ్గిన రేట్ల వల్ల నిర్మాతలు నష్టపోకూడదన్న అభిప్రాయంతో అందరూ ఉన్నారు. కరోనా థర్డ్ వేవ్ పరిస్థితులు కూడా సర్థుమణిగాయి. రేపు కలవబోయే బృందంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం ఉండరని సమాచారం. గతంలో పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో ఈ భేటీకి తాను దూరంగా ఉండటమే మంచిదన్న భావనకు పవన్ వచ్చారు. మెగా కుటుంబం తరఫున చిరంజీవి ఉండటంతో రామ్ చరణ్ కూడా వెళ్లడం లేదని తెలుస్తోంది.
ఒక్క సినిమా టిక్కెట్ల రేట్ల అంశమే కాకుండా సినిమా రంగానికి సంబంధించిన ఇతర సమస్యలను కూడా చర్చించనున్నారు. రాధేశ్యామ్ చిత్ర నిర్మాతలతో పాటు కొందరు దర్శకులు కూడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. రేపే నిర్ణయం వెలువడితే రవితేజ సినిమాకు మేలు జరుగుతుంది. లేకుండా కాస్త ఆలస్యమవుతుంది. ప్రభుత్వం తీసుకునే కొత్త నిర్ణయం వల్ల కలెక్షన్లు రికార్డు స్థాయిలో పెరగడానికి ఆస్కారం ఉంటుంది.











