సంక్రాంతి తెలుగునాట అత్యంత ప్రాధాన్యత వున్న అతిపెద్ద పండుగ. సంక్రాంతి అంటే రైతుల పండగ.సంక్రాంతి వచ్చిందంటే దాదాపు పంటలన్నీ ఇంటికి వచ్చి రైతుల లోగిళ్లు ధాన్య,ధన రాసులతో కళ,కళ లాడేవి.నేడు అటువంటి వ్యవసాయం సంక్షోభంలోకి నెట్టబడి పల్లెలు కళ తప్పాయి. ఆశల దారుల్లో దౌడు తీయాల్సిన రైతు బతుకు కకావికలం అయింది.అమ్ముడు పోనీ ఆశల ధాన్యం కల్లం లో దుక్కిస్తుంది. అమ్మిన ధాన్యానికి డబ్బులు రాక రైతులు కన్నీరు పెడుతున్నారు. విత్తు నుండి విపణి దాకా ఎన్నో సమస్యల గరళాన్ని గొంతులో దాచుకొని జాతికి అన్నం పెడుతున్న బొళాశంకరుడు రైతు. అటువంటి రైతు బతుకు జగన్మోహన్ రెడ్డి పాలనలో గాలిలో దీపమైంది.విత్తనం వేసిన దగ్గర నుండి ఉత్పత్తులు మార్కెట్ లో అమ్ముకోనే దాకా ప్రతి దశలోనూ రైతులను చెయ్యి పట్టినడిపిస్తానని బులిపించి అధికారంలోకి వచ్చిన జగన్ జమానా లో రైతులకు చేసిన సాయం కంటే చేసిన వంచనలే ఎక్కువని చెప్పాలి. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లో అన్నదాత అప్పులు ఊబిలో కూరుకుపోయి దిక్కులు చూస్తున్నాడు. జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పధకాలు రైతులను మభ్యపెట్టడానికే తప్ప వారిని ఆదుకొనేవి కావు. అరకొరగా రైతు భరోసా ఇచ్చి సమస్త రైతు సమస్యలు పరిష్కరించినట్లు పత్రికల్లో ప్రకటనలు గుప్పిస్తూ, అంకెలగారడీలతో, అబద్దాలతో రైతులను తప్పుదారి పట్టిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 79,50,844 మంది రైతు ఖాతాలుండగా, 49 లక్షల మందినే రైతు బరోసాకు అర్హులుగా చూపించారు. రైతు భరోసా కింద మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నిధులు నుంచే రూ.12,500 ఒకే సారి మే నెలలో ఇస్తామని ఎన్నికల ముందు ప్రకటించారు. రూ.12,500 రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాల్సి వుండగా దానికి కేంద్రం ఇస్తానన్నరూ.6000 కలిపి రూ 18,500 రైతుకి ఇవాల్సి వుంది. కానీ కేంద్రం ఇచ్చే రూ.6000లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 7,500 కలిపి రూ.13,500 ఇస్తున్నారు.రైతుల పండగ సంక్రాంతికి ప్రభుత్వం అందించే రైతు భరోసా సహాయం అందలేదు. కేంద్రం ఇటు రాష్ట్రం రెండు ప్రభుత్వాలూ సంక్రాంతికి అన్నదాతలకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయంపై నోరు మెదపడడం లేదు. ఇచ్చే అరకొర సాయం కూడా మూడు సార్లు విదిలిస్తున్నాసమయానికి ఇవ్వడంలేదు.
రైతులను జగన్ ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తున్నదో రైతులు అర్ధం చేసుకోవాలి. పంట వేసిన రైతుల గిట్టుబాటు ధర ఇవ్వడం కోసం ధరల స్థిరీకరణ నిధి పేరుతో బడ్జెట్ లో రూ.3000 కోట్లు, ప్రకృతి, విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవడానికి రూ.4000 కోట్లు కేటాయిస్తానని మోసం చేశారు. సువాబులు, జామాయిల్, సర్వే రైతులను ఆదుకొంటామని, టన్నుకు రూ.5,000 వేలు ధర పెంచుతామని హామీ ఇచ్చి ధర పెంచక పోగా అంతకు ముందున్న టన్ను ధర రూ.3,500 కూడా లేకుండా నేడు రూ.1200 లకు దిగజారినా పట్టించుకోవడంలేదు.అదనపు అప్పుల కోసం వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించి రైతుల మెడకు వురి బిగిస్తున్నారు. ఆక్వా రైతులకు విద్యుత్తు సబ్సిడీ ఇస్తామని ఇవ్వక పోగా పెంచి ఆక్వారంగాన్ని సంక్షోభంలోకి నేట్టారు. పాడి రైతులకు లీటరు పాలకు 4 రూపాయలు బోనస్ ఇస్తామని ఎగనామం పెట్టారు. రైతులకు వడ్డీలేని రుణాలు ఇస్తామని బులిపించి వట్టి చేతులు చూపించారు.వైఎస్సార్ జలకళ పేరుతో ఉచిత బోర్లు వేయిస్తామని,ఆర్భాటంగా ప్రారంభించిన వైఎస్సార్ జలకళను అటకెక్కించారు.వ్యవసాయ యాంత్రీకరణకు మంగళం పాడారు. గత ప్రభుత్వం డ్రిఫ్ ఇరిగేషన్ పధకం కింద చిన్న, సన్న కారు రైతులకు 90 శాతం రాయితీ, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం రాయితీ అందించిన పధకాన్నిజగన్ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పధకాన్ని పూర్తిగా రద్దు చేశారు. ఉచితంగా అందించే సూక్ష్మ పోషకాలు, మైక్రో న్యూట్రియంట్స్ ఎరువులు పంపిణీని సైతం నిలిపేశారు.గత ప్రభుత్వం రైతు ఋణమాఫీ కింద 58.29 లక్షల మంది రైతులకు రూ.15,279 కోట్లు రుణమాఫీ చేసి ఆదుకుంది. జగన్ అధికారంలోకి వచ్చి గత ప్రభుత్వం చెల్లించాల్సిన, 4-5 విడతల రైతు ఋణ మాఫీ పధకాన్నిరద్దు చేసి రైతుల ప్రయోజనాలకు గండి కొట్టారు.ఎవరు చేసినా రైతుకు మేలు జరగడం ముఖ్యం. కానీ రైతు రుణమాఫీ పట్ల ప్రతికూల వైఖరి తీసుకోవడం దారుణం. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ లో 93.2 శాతం రైతు కుటుంభాలు అప్పుల్లో కూరుకు పోయాయని, ఒక్కో కుటుంబంపై సగటున రూ.2,45,554లు అప్పున్నట్లు ఇటీవల ఓ నివేదిక వెలువడింది. కానీ జగన్ ప్రభుత్వం మాత్రం రాష్ట్రంలో వ్యవసాయం బ్రహ్మాండమంటూ పత్రికల్లో ప్రకటనలిస్తూ రైతుల్ని మభ్య పెడుతున్నారు. జగన్ రెడ్డి జమానాలో3000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. రైతు ఆత్మ హత్యల్లో ఆంధ్రప్రదేశ్ 3వ స్థానంలో నిలిచింది. కౌలు రైతుల ఆత్మ హత్యల్లో దేశంలో 2వ స్థానంలో నిలిచింది. వై స్సార్ రైతు బీమా కింద తక్షణం రూ.7లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించినా ఆ దిశగాఅడుగులు పడటం లేదు. అన్నదాతల మృత్యుఘోష కొనసాగుతూనేవుంది. సాగు కోసం చేసిన అప్పులు నిలువునా వారి ఉసురు తీస్తున్నాయి. రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నా,పెట్టుబడి సాయం చేస్తున్నాం. ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నాం అంటూ ప్రగల్భాలు పలకడం తప్ప,నిండు ప్రాణాలు తీసుకుంటున్న రైతుల దుస్థితిని, రోడ్డున పడుతున్న వారి కుటుంబాల జీవన స్థితిగతుల గురించి ప్రభుత్వం మచ్చుకైనా స్పందించడం లేదు. పల్నాడు, రాయలసీమ వంటి ప్రాంతాల్లో ఒకేరోజు నలుగురు అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవడం ప్రభుత్వ వైఫల్యానికి దర్పణం పడుతోంది.
ఖరీఫ్ లో పెద్ద ఎత్తున పలు జిల్లాల్లో పత్తి, మిర్చి, వరి, వేరుశనగ నకిలీ, కల్తీ, నాసిరకం విత్తనాలతో,తెగుళ్లతో రైతులు భారీగా నష్టపోయారు. విత్తనాలమ్మిన కంపెనీల నుండి నష్ట పరిహారం ఇప్పించాలని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పంటలకు మద్దతు ధర ఇస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా జాతీయ నమూనా సర్వేలో మాత్రం ఎక్కువ మంది తమకు మద్దతు ధర దక్కడం లేదనిచెప్పారు. సాగువ్యయం 30 శాతం పెరిగింది. గిట్టుబాటు ధర ఐదొంతులు తగ్గింది. గిట్టు బాటు ధర కాదు కదా కనీస మద్దతు ధర కూడా దిక్కు లేదు. మిల్లర్లు, వ్యాపారులు, దళారులదే జగన్ పాలనలో రాజ్యమైంది. అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లో రైతులు క్రాఫ్ హాలిడే ప్రకటించడం రాష్ట్రం లో సాగు సంక్షోభానికి నిదర్శనం. వర్షాలు సమృద్దిగా పడినా, వ్యవసాయానికి అనుకూల వాతావరణం వున్నా వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నేట్టింది జగన్ ప్రభుత్వం. గత టీడీపీ ప్రభుత్వం రైతాంగానికి భూసార పరీక్షలు, పట్టాదారు ఫాస్ పుస్తకాలు, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాలు, కల్తీలేని, కొరత లేకుండా ఎరువులు, 7 గంటలు నాణ్యమైన ఉచిత విద్యుత్తు, నీరు-మీరు కింద వాటర్ షెడ్ పధకాలు, సాగునీటి సంఘాలు ద్వారా వాటర్ మేనేజ్ మెంట్, పంట కుంటలు, వ్యవసాయ యాంత్రీకరణ యంత్రాలు, రైతు మిత్ర గ్రూపులు ఏర్పాటు, పంటల బీమా, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, తోటల పెంపకం, మైక్రో ఇరిగేషన్ అమలు వంటి పథకాలు అమలు చేసింది. వ్యవసాయ ఉత్పత్తి ఖర్చులు తగ్గించి దిగుబడులు పెంచేందుకు అత్యాధునిక వ్యవసాయం ఆవిష్కరణకు చంద్రబాబు ప్రభుత్వం కృషి చేసింది. సాగు బాగే లక్ష్యంగా సాగునీటి రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి అయిదేళ్లలో సాగు నీటి రంగానికి రూ.70 వేలకోట్లు ఖర్చు చేసింది. వ్యవసాయాణానికి, రైతులకు వెన్నుదన్నుగా నిలవడం కోసం చంద్రబాబు ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డింది. కానీ రెండున్నరేళ్లుగా జగన్ ప్రభుత్వం వ్యవసాయానికి పై,పై మెరుగులు దిద్ది రైతులను ఉద్దరించినట్లు దగా చేస్తున్నారు. కావున ప్రభుత్వం చేస్తున్న మోసపూరిత ప్రకటనలను రైతులు గుర్తించాలి. జగన్ రెడ్డి అసమర్ధ పాలనలో రైతు లోగిళ్ళలో చీకట్లు అలుము కొన్నాయి.రైతుల గురించి జగన్ రెడ్డి చెప్పింది కొండంత,చేసింది గోరంత అని చెప్పాలి.