ఆంధ్రప్రదేశ్ లో నెలకొన్న అధ్వాన్న పరిస్థితులను,టెర్రరిజం పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చెప్పుకొంటున్న పరిస్థితుల్లో దావోస్ వెళ్లి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టమని ఏ ముఖం పెట్టుకొని అడుగుతారు. కనీసం పత్రికా స్వేచ్ఛకూడా లేని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టమని ఎలా అడుగుతారు? అందుకే దావోస్ నుంచి ఆహ్వానం వచ్చినా ముఖం చెల్లక వెళ్ళడానికి అంగీకరించలేదు జగన్ ప్రభుత్వం.
రాష్ట్రంలో జగన్ రెడ్డి అరాచక, కక్షసాధింపు, అవినీతి, నీకది – నాకిది పరిపాలన చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి భయానక వాతావరణం నెలకొంది. ప్రతిపనిలో నీకది – నాకిది పార్ములాకు పారిశ్రామిక వేత్తలు ఇప్పటికే పారిపోయారు. రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి అనుకూల వాతావరణం ఉందని పెట్టుబడి దారులు భావించాలి. రాష్ట్రంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు, లా-అండ్ ఆర్డర్ లేవని జాతీయ స్థాయిలో ప్రచారం జరుగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు? వైసీపీ నాయకుల ముడుపులే కాదు, ఆయా పరిశ్రమల్లో వాటాల కోసం బెదిరిస్తున్నారు. పారిశ్రామిక వేత్తలు నాయకుడి చిత్త శుద్ధి, సమర్ధత, క్యారెక్టర్ ను బట్టి పరిశ్రమలు ఏర్పాటుకు సుముఖత చూపిస్తారు. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రంలో పెట్టుబడులు ఎలా పెడతారు ? పెట్టుబడులు పెట్టమని ఎలా అడగుతారు ? అంతే కాదు దేశీయ పెట్టుబడులకే దిక్కులేకపోతే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ)లు ఎలా వస్తాయి? దేశంలో ఎఫ్‌డీఐలు ఆకర్షించిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ పదో స్థానానికి దిగజారింది.
2022లో జాతీయ స్థాయిలో వచ్చిన ఎఫ్‌డీఐలలో ఆంధ్రప్రదేశ్ కి అర శాతం మాత్రమే వచ్చినట్లు సమాచారం. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వమే ఈ గణాంకాలు వివరించింది. ఈ సంవత్సరం భారత దేశానికి 6200 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా, ఎఫ్‌డీఐలు ఆకర్షించిన మొదటి ఐదు రాష్ట్రాల్లో మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, గుజరాత్, హరియాణా ఉండగా, ఆ తర్వాతి స్థానం తమిళనాడు, తెలంగాణ ఏడో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ పదో స్థానానికి పతనమైంది. పొరుగు రాష్ట్రం తెలంగాణ కు 2022 లో 128 కోట్ల డాలర్ల ఎఫ్‌డీఐలు రాగా ఏపీ కి వచ్చింది కేవలం 21కోట్ల డాలర్లు మాత్రమే అంటే మొత్తం ఎఫ్‌డీఐలలో అర శాతం మాత్రమే వచ్చినందుకు జగన్ ప్రభుత్వానికి సిగ్గు అనిపించలేదా ?
పెట్టుబడులకు అవకాశమే లేదు
కంపెనీల ఏర్పాటు కోసం వివిధ రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. తీవ్రంగా ప్రయత్నిస్తే తప్ప పెట్టుబడిదారులను ఆకర్షించే అవకాశం లేదు. వైసీపీ ప్రభుత్వం మాత్రం ఆ దిశగా యలాంటి కనీస ప్రయత్నాలేవీ చేయడంలేదు. పరిశ్రమలు. కర్ణాటకకు టెస్లా కంపెనీ, ఉత్తరప్రదేశ్‌కు సాంసంగ్ మొబైల్ తయారీ కేంద్రం, తమిళనాడు, తెలంగాణలకు అమెజాన్ కేంద్రాలు వచ్చాయి. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాలుగేళ్లు కావస్తున్నాఇది సాధించామని చెప్పుకునే పరిస్థితి జగన్‌కు ఉందా? విదేశీ పెట్టుబడుల కోసం సీఎం జగన్ రెడ్డి చేసిన ప్రయత్నం శూన్యం. దావోస్‌లో ప్రతి ఏటా అంతర్జాతీయ ఆర్థిక పెట్టుబడుల సదస్సులు జరుగుతుంటాయి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ సదస్సులో ప్రతి ఏటా స్వయంగా పాల్గొని ప్రైవేట్ పెట్టుబడిదారులను ఆకర్షించే ప్రయత్నం చేసే వారు. కానీ జగన్ అధికారంలోకి వచ్చీ రాగానే అమరావతిని చంపేశారు. పీపీఏలను రద్దు చేశారు.
రివర్స్ టెండరింగ్ అంటూ కాంట్రాక్టు సంస్థలను వెంటబడి వేధించారు. దీంతో దావోస్ సదస్సులో పాల్గొoటున్నపలువురు పెట్టుబడి దారులు ఆంధ్రప్రదేశ్‌లో అలా ఎందుకు జరుగుతోంది? అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న రాష్ట్రాన్నిఎందుకు దెబ్బతీసు కున్నారు అని పలువురు పెట్టుబడి దారులు అన్నట్లు సమాచారం. దీంతో అంతర్జాతీయ వేదికలపై కూడా ఆంధ్రప్రదేశ్ పరువు పోవడంతో ముఖం చెల్లక దావోస్ వేళ్ళ లేదు ముఖ్యమంత్రి. అంతర్జాతీయ స్థాయిలో ఏ సదస్సు జరిగినా చంద్రబాబే స్వయంగా ఫైళ్లు పట్టుకుని విదేశాల్లో తిరిగేవారు ప్రపంచం ముందు ఏపీని ఆవిష్కరింపచేసి ఏపీని సన్ రైజింగ్ స్టేట్ గా పరిచయం చేశారు. జగన్ రెడ్డి సియం అయిన మూడున్నరేళ్లలో ఒకే ఒక్కసారి దావోస్ కు వెళ్లారు కానీ.అక్కడ కూడా మన దేశంలో, రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహించే కంపెనీలతో దాహోస్ వెళ్ళి మళ్ళీ ఒప్పందాలు కుదర్చుకుని నేను దాహోస్ వెళ్ళి పెట్టుబడులు తెచ్చానని బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేశారు.
తిట్టడం తప్ప పెట్టుబడులు ఎందుకు?
రాష్ట్రంలో ఏం వనరులున్నాయి, ఏమి సౌకర్యాలు కల్పిస్తాం, ఏమి రాయితీలు ఇస్తాం, వీటిని ఎలా ఉపయోగించుకోవాలో ప్రపంచానికి చెప్పి పెట్టుబడులు రాబట్టే సమర్ధుడు ఒక్కడూ లేడు ప్రభుత్వంలో. కానీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు బారులు తీరుతున్నట్లు సొంత మీడియాలో అబద్దాల కధనాలు రాస్తూ ప్రజలను మధ్య పెడుతున్నారు. పొరుగు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి దావోస్ సదస్సుకు వెళ్లి వేల కోట్ల ఒప్పందాలు చేసుకొంటుంటే, ఆంధ్రప్రదేశ్ ఐటీ మంత్రి చంద్రబాబును, పవన్ కళ్యాణ్ ను తిట్టడం కోసం కృషి చేస్తున్నారు. ఆయనకు అంతకుమించి పెట్టుబడులు రాబట్టే సమర్ధత,అవగాహన కూడా లేదని అర్థమవుతోంది. ఏది ఏమైనా, ఎవరేమన్నా గత ఐదేళ్లు పారిశ్రామికాంధ్ర ఆవిష్కారానికి కృషి జరిగింది.
భారత వాణిజ్య యవనిక పై తనదైన ముద్రవేశారు చంద్రబాబు. ఆయన బ్రాoడ్ తోనే పెట్టుబడులు బారులు తీరాయి. ఆటోమొభైయిల్ రంగంలో ఇసుజు, కియా మోటార్, అపోలో టైర్లు, అశోక్ లేలాండ్, భారతపోర్జ్, హీరో గ్రూపు రాగా, ఐటీ సెల్ ఫోన్ తయారీ రంగంలో ఫాక్స్ కాన్, సెల్ కాన్,ప్లెక్స్ ట్రానిక్స్, డిక్స న్, రిలయన్స్, టీసియల్, ఓల్టాస్ వంటి పరిశ్రమలు వచ్చాయి. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే బయటి నుంచి పెట్టుబడులు రావాలి.రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉందని పెట్టుబడిదారులు భావించాలి. కానీ అక్కడ ఎలాంటి మౌలిక సదుపాయాలు, లా అండ్ ఆర్డర్ లేవని జాతీయ స్థాయిలో ప్రచారం సాగుతుంటే రాష్ట్రం ముఖం చూసేదెవరు?సున్నా తో పరిపాలన ప్రారంభించి కూడా భాగస్వామ్య సద్దస్సులు లక్షల కోట్ల విలువైన ఒప్పందాలతో సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ గా వెలుగొందింది గత ఐదేళ్లు.
పెట్టుబడిదారులు పేరంటానికి వచ్చినట్లు రారని, ఒక చోట పెట్టుబడి కి భరోసా ఉందని నమ్మకం కుదిరి నప్పుడే పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామిక వేత్తలు ముందుకు వస్తారని అనిల్ అంబానీ గతంలో నే చెప్పారు. అంతేకాదు ఒప్పందం అన్నది మనకి ఆసక్తి ఉంది అనగానే అవతలి వాళ్ళు ఉత్సాహంగా వచ్చి సంతకాలు పెట్టేదికాదు. రాజును బట్టే రాజ్యం,రౌతుని బట్టే గుర్రం అన్న సామెతగా ప్రభుత్వాన్ని నడిపించే నాయకత్వ సమర్ధత,క్యారెక్టర్ బట్టి, రాష్ట్రం అభివృద్ధి చెందుతున్న తీరును బట్టి ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తారు. కనీసం పత్రికా స్వేచ్ఛ కూడా లేని రాష్ట్రం వైపు ఎవరు చూస్తారు ? రాష్ట్రంలో స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్టు పరి పాలన మూలంగా పెట్టుబదారులు పొరుగు రాష్ట్రాలకు పారిపోతున్నారు. భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం వల్ల స్వల్పకాలంలో కాకపోయినా దీర్ఘ కాలంలో అయినా ప్రయోజనం ఉంటుందని,అదీ స్థిరంగా ఉంటుందని పెట్టుబడి దారులకు విశ్వాసం కలిగించడం ప్రధానం. కానీ తన విధ్వంస పరిపాలన గురించి అంతర్జాతీయ వేదికలపై చర్చజరిగి ఆంధ్రప్రదేశ్ పరువు పోవడంతో ప్రభుత్వ ప్రతినిధులకు ముఖం చెల్లక దావోస్ వెళ్ళ లేదు.