విశాఖపట్నం పెందుర్తి శిరోముండనం ఘటనపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా స్పందించింది. అసలే దళిత వ్యతిరేక పార్టీగా వైకాపాపై ప్రచారం జరుగుతున్న వేళ, వారు ఇంత చురుగ్గా స్పందించడం చాలా మంచి పరిణామం. కానీ.. ఇదే విధమైన స్పందన సీతానగరం శిరోముండనం భాధితలపై వైసీపీ నాయకులు ఎందుకు చూపించలేక పోయారో, అలాగే ఆ కేసులోని నిందితుల అరెస్టు విషయంలో ఎందుకు ఇంత శ్రద్ద చూపింలేదో అర్థం కాని సంగతి.
రాష్ట్రంలో దళితుల మీద అరాచకాలు వరుసగా వెలుగుచూస్తున్నాయి. గత 15 మాసాలుగా దళితులపై గొలుసుకట్టు దాడులు జరుగుతున్నాయి. వీటిపై అన్ని రాజకీయ పార్టీలు దళితులపై పేటెంట్ హక్కు తమకే ఉన్నట్లు ఎక్కడలేని ప్రేమను ఒలకపోస్తున్నారు. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలన్నీ తమ ప్రభుత్వ హయాంలోనే దళితులకు న్యాయం జరిగినట్టు చెప్పుకుంటున్నారు.
తాజాగా జరిగిన శిరోముండన సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. తూర్పు గోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో దళిత యువకుడు వరప్రసాద్ శిరోముండన సంఘటన పై సాక్షాతూ దేశ ప్రధమపౌరుడు రాష్ట్రపతి స్పందించారు. అయినప్పటికీ నేటివరకు ఆ కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ కాలేదు అంటే మన పోలీసుల పనితీరు ఏవిధంగా ఉందో స్పష్టంగా కనిపిస్తోంది. కాగా ఈ కేసులో నిందితుల గురించి కానీ బాధితుడైన వ్యక్తికి ఏవిధమైన ఆర్థిక సహాయం కానీ అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీ వారు ప్రకటించకుండా నిమ్మకునీరెత్తినట్లు వ్యహరిస్తున్నారు.
అయితే విశాఖపట్నం పెందుర్తిలో జరిగిన శిరోముండన ఘటనపై మాత్రం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎం.ఎల్.ఏ.లు.తీవ్రంగా స్పందిస్తున్నారు. విశాఖపట్నం వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు దీనిపై స్పందిస్తూ సభ్య సమాజం తలదించుకోవలసిన చర్య ఒక దళిత యుకుడికి శిరోముండనం చేయడం, ఇది అత్యంత హేయమని ఈ ఘటనకు సంబంధించి 7గురి పై ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వారిని రిమాండ్ కి పంపారని పేర్కొన్నారు. వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మరొక శాసనసభ్యుడు విశాఖపట్నం పెందుర్తి ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు దీనిపై మాట్లడుతూ పెందుర్తి లో దళిత యువకుడు శ్రీకాంత్ పై జరిగిన శిరోముండన సంఘటన బాధాకరం అని, ఈ ఘటనను చూస్తే సమాజం ఎటువైపు పోతుందోనని అనిపిస్తుందన్నారు. తమ ప్రభుత్వం ఈ సంఘటన కు పాల్పడిన వారిని 24 గంటల్లోగా కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించటం జరిగిందని, అయితే జనసేన,టిడిపి నేతలు ఇప్పటి వరకు భాధితుడ్ని ఎందుకు పరామర్శించలేదు? అంటూ ప్రశించారు. ఈ కేసు లోని నిందితులకు చెందిన నూతన్ నాయుడు జనసేన పార్టీ తో సన్నిహితంగా ఉన్నారని, పరాన్నజీవి సినిమాకు నూతన నాయుడే నిర్మాత అని, అయితే ఆయనను వైస్సార్ కాంగ్రెస్ మనిషి గా ప్రతి పక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నారని అన్నారు.
వైసీపీకి నూతన నాయుడికి సంబందం లేదని, బాధితుడు శ్రీకాంత్ ను అన్ని విధాలుగా ప్రభుత్వం ఆదుకుంతున్నదని, అతనికి ఇళ్ల పట్టాను, ఉద్యోగం తో పాటు ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం అందిస్తామని చెప్పారు. కాగా ఈ సంఘటన కన్నా ముందుగా తూర్పుగోదావరి జిల్లా లో జరిగిన వరప్రసాద్ శిరోముండన సంఘటన పై మాత్రం ఏ ఒక్క వైస్సార్ కాంగ్రెస్ నేత స్పందించక పోవటం శోచనీయం. పెందుర్తి లో శ్రీకాంత్ కు ఒకరకమైన న్యాయం, సీతానగరం వరప్రసాద్ విషయంలో మరొక న్యాయమా? ఇది వైస్సార్ కాంగ్రెసు అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని బహిర్గతం చేస్తోంది.
దళితులు పట్ల ఆ పార్టీకి నిజమైన ప్రేమఉంటే వరుసగా దళితులపై జరుగుతున్న దాడులు, హత్యలు దమనకాండలు, శిరోముండనాలు పై సమగ్ర విచారణ జరిపించి బాధితులు అందరినీ ప్రభుత్వం ఆదుకోవాలి. అంతేకాని ఒకరికి ఒక న్యాయం మరొకరికి మరొకన్యాయం చేయటం సమంజసం కాదు.











