అచ్చెన్నాయుడు స్వగ్రామం నిమ్మాడకు చాలాకాలం గ్యాప్ తర్వాత వెళ్లనున్నారు. ఈఎస్ఐ కేసులో అరెస్టు అయి.. ఇన్నాళ్లూ రిమాండ్ లో ఉన్న అచ్చెన్నాయుడుకు ఇటీవలే బెయిల్ లభించింది. కరోనా వల్ల ఎన్నారై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆసుపత్రి నుంచి ఇవాళ డిశ్చార్జి అయ్యారు. తాజాగా ఆయనకు వైద్య పరీక్షల్లో నెగటివ్ రావడంతో.. డిశ్చార్జి అయ్యారు. స్వగ్రామం నిమ్మాడకు వెళ్లనున్నారు.
మూడ్రోజుల క్రితం ఈఎస్ఐ వ్యవహారంలో బెయిల్ మంజూరు అయింది. ఈఎస్ఐ కొనుగోళ్లలో కుంభకోణం జరిగిందంటూ అచ్చెన్నను ఏసీబీ కొన్నినెలల కిందట అరెస్ట్ చేసింది. అప్పట్లో వందల సంఖ్యలో పోలీసులు నిమ్మాడ గ్రామానికి తెల్లవారు జామునే వెళ్లి అరెస్టు చేసి తీసుకువచ్చారు. అరెస్టుకు రెండు రోజుల ముందు ఆపరేషన్ చేయించుకుని, బెడ్ రెస్ట్ లో ఉన్న అచ్చెన్న పట్ల అమానుషంగా వ్యవహరించి పోలీసులు కారులో కూర్చోబెట్టి వందల కిలోమీటర్లు ప్రయాణించి.. విజయవాడకు తీసుకువచ్చారని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి.
అయితే ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నందున గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలోనూ, ఆపై రమేశ్ ఆసుపత్రిలోనూ చికిత్స అందించారు. కరోనా సోకడంతో కోర్టు ఆదేశాల మేరకు ఎన్నారై ఆసుపత్రికి తరలించారు. మధ్యలో బెయిల్ కూడా లభించింది. కరోనా నయం కావడంతో ఆయన తన స్వగ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు











