శ్రీకాకుళం పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన ప్రభుత్వ మాజీ విప్, ఆముదాలవలస మాజీ ఎమ్మెల్యే కూన రవికుమార్‌పై స్వపక్ష, విపక్షాల నుండి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధ్యక్షునిగా ‘కూన’ నియామకంలో చంద్రబాబు మార్కు రాజకీయం మరోసారి బయటపడిందని, ‘నోరు ఉన్నోడిదే ఊరన్నట్టు’ ఎవరైతే అవినీతి, అక్రమాలు, ఇతరత్రా వ్యవహారాల్లో దూకుడుగా వ్యవహరిస్తూ , కేసులు ఎదుర్కొంటారో వారికే పార్టీలో పెద్దపీట వేస్తారని ఆ పార్టీ వర్గాలే చర్చించుకుంటున్నాయి. ఇదంతా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులుకానున్న అచ్చెన్న కనుసన్నల్లోనే జరిగిందని , జిల్లాలో ఆయన ప్రాబల్యం పెంచుకునే వ్యూహంలో భాగమే ‘కూన’ నియామకమని సొంత పార్టీలోనే రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు ఎక్కుపెడుతున్నాయి.
కినుక వహించిన శిరీష
శ్రీకాకుళం పార్లమెంటరీ అధ్యక్షునిగా కూన రవికుమార్ నియామకం పట్ల ప్రస్తుత జిల్లా అధ్యక్షురాలు గౌతు శిరీష కినుక వహించినట్లు తెలిసింది. అధ్యక్ష బాధ్యతల నుండి తనను తప్పించాలి అనుకునేటప్పుడు ఒక మాట చెపితే బాగుండేదని, అటువంటిదేమీ లేకుండా ఉన్నపళంగా మార్చేయడమేంటని తన సన్నిహితుల వద్ద వాపోయినట్లు తెలిసింది. పార్టీ పై విశ్వాసం , అధిష్టానంపై నమ్మకంతో కొన్నేళ్లుగా చేసిన సేవలకు కనీస విలువలేకపోయిందని ఆమె అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
‘గౌతు’ కుటుంబంపై ఉన్న విశ్వాసం ఇదేనా?
జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి అండగా ఉన్నగౌతు శ్యామ సుందర శివాజీ కుటుంబం పార్టీకి జిల్లాలో పెద్ద అండాదండా అంటూ పలు వేదికలపై ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చిన చంద్రబాబు, అచ్చెన్నాయుడు అండ్ కో మాట మాత్రం చెప్పకుండా గౌతు శిరీషను అధ్యక్ష పదవి నుంచి తొలగించడంలో ఆంతర్యమేంటని ఆ పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. దీన్ని బట్టి గౌతు కుటుంబంపై చంద్రబాబుకు ఎంత అభిమానం ఉందో తేటతెల్లమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
శివాజీ కాళ్లకు అచ్చెన్న మొక్కిన కొద్దిరోజులకే…
జిల్లా టీడీపీలో సీనియర్, మాజీ ఎమ్మెల్యే శ్యామసుందర్ శివాజీకి కొద్దిరోజుల క్రితం కలిసిన అచ్చెన్న ఆయన కాళ్లకు మొక్కి ఆశీస్సులు తీసుకున్నారు. అంతలోనే ఆయన తనయ శిరీష పదవి పోయింది. ఇది యాదృచ్చికంగా జరిగినప్పటికీ , ఇదంతా అచ్చెన్న సూచనలతోనే జరిగివుంటుందని విమర్శలు జోరుగా వినిపిస్తున్నాయి.
జిల్లా టీడీపీలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని నివారించి , పార్టీ శ్రేణులను ఒకతాటిపైకి తీసుకొచ్చి ‘ఇంట గెలిచి రచ్చ గెలవాలనే’ సూక్తిని అచ్చెన్న ఎలా సాధిస్తారో వేచి చూడాలి.











