తెలంగాణా రాష్ట్ర సమితి చీరల గాలం వేస్తోంది. మహిళల ఓట్లు రాబట్టుకునేందుకు చీరల వల విసురుతున్నారు అధికార పార్టీ నేతలు. ప్రతి ఏటా దసరా ముందు బతుకమ్మ చీరలు మహిళలకు పంచడం అధికార తెలంగాణ రాష్ట్ర సమితికి అనవాయితీ. ఈ సారి మాత్రం గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ఎన్నికలు జరుగుతుండడంతో ఇక్కడి మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు చీరల అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు.
ఇంతకు ముందు జిల్లాలకే ఎక్కువగా పంపిణీ చేసిన బతుకమ్మ చీరలను ఈసారి హైదరాబాద్ లో కూడా భారీగా పంచేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం హైదరాబాద్ లో జరగనున్న జీహెచ్ఎంసీ ఎన్నికలే అంటున్నారు. బంగారు, వెండి అంచుతో నేసిన రెండు 287 డిజైన్ల చీరలను తయారుచేసారు. వీటి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 318 కోట్లు వెచ్చించింది. ఈ చీరలలో సింహభాగం జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలోనే హైదరాబాద్ లోనే పంచుతారని అంటున్నారు.
చీరల పంపిణీని మంత్రులు, ఎమ్మెల్యేలు దగ్గరుండి పర్యవేక్షించాలని తెలంగాణ రాష్ట్ర సమితీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు చీరల పంపిణీని భారీగా చేపట్టేందుకు పార్టీ యంత్రాంగం సన్నద్ధవమవుతోంది.
పాతబస్తీ పై కన్ను
జీహెచ్ఎంసీ ఎన్నికలలో ఈ సారి పాత బస్తీలో కూడా పాగా వేయాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి లక్ష్యంగా చెబతున్నారు. ఇప్పటి వరకూ పాతబస్తీలో మజ్లీస్ పార్టీదే హవా. గతంలో మజ్లీస్ కు, తెలంగాణ రాష్ట్ర సమితికి మధ్య మంచి సంబంధాలే ఉండేవి. ఈ మధ్య కాలంలో మజ్లీస్ పార్టీ నాయకులలో అసదుద్దీన్ ఓవైసీ టీఆర్ఎస్ పట్ల అనుకూలంగా ఉన్నా ఆయన సోదరుడు అక్బరుద్దీన్ మాత్రం టీఆర్ఎస్ పట్ల కారాలు, మిరియాలు నూరుతున్నారు.
దీంతో అక్బరుద్దీన్ నుంచి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవనే టీఆర్ఎస్ నాయకత్వం భావిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని పాతబస్తీలో పార్టీని పటిష్టం చేసేందుకు ఇప్పటి నుంచే చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి సుప్రీం కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆదేశించారని అంటున్నారు. ఆయన ఆదేశాల మేరకు జీహెచ్ఎంసీ ఎన్నికలలో పాతబస్తీలో వీలైనన్ని ఎక్కువ వార్డులు గెలుచుకోవాలన్నది టీఆర్ఎస్ లక్ష్యంగా చెబుతున్నారు.
బాధ్యులుగా తలసాని, దానం
పాతబస్తీలో గెలుపు సాధన కోసం మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. వారిద్దరి పర్యవేక్షణలోనే పాతబస్తీ ఎన్నికలకు సమయత్తం కావాలన్నది కేటీఆర్ వ్యూహంగా చెబుతున్నారు. దానం నాగేందర్ పాత బస్తీకి చెందిన నాయకుడు. పాతబస్తీలో దానం నాగేందర్ కు మంచి పరిచయాలు ఉన్నాయి. దీనిని తమకు అనుకూలంగా మార్చుకుని ఈ ఎన్నికల నుంచి పాతబస్తీలో పాగా వేసేందుకు ప్రయత్నించాలన్నది తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం వ్యూహంగా చెబుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలను బట్టి మంత్రి వర్గ విస్తరణలో నగర ఎమ్మెల్యేలకు అవకాశం ఉంటుందనే తాయిలాలను కూడా ఆశ చూపినట్టు సమాచారం. ఈ ఆశలతోనైనా నగరంలో తిరిగి కార్పొరేషన్ తెలంగాణా రాష్ట్ర సమతి వశం అవుతుందని అధిష్టానం విశ్వసిస్తొంది.











