అక్టోబరు నుంచి వెస్ట్ బెంగాల్ లో థియేటర్స్ తెరవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. మిగిలిన రాష్ట్రాల సినిమా వాళ్ళు కూడా థియేటర్స్ తెరవమని డిమాండ్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాలు కలిపి, దాదాపు 1,700 థియేటర్స్ ఉన్నాయి. దేశవ్యాప్తంగా భారతీయ సినిమా రంగం ఏడాది టర్నోవర్ లో తెలుగు చిత్ర పరిశ్రమ వాటా 19.5 శాతం ఉంది. బాలీవుడ్ తర్వాత దేశీయ వినోద రంగానికి అధిక ఆదాయం తెచ్చి పెట్టేది తెలుగు తమిళ సినీ రంగాలే. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణ భారతీయులు సినిమాలు ఎక్కువ చూస్తారు. ఏడు నెలల తర్వాత థియేటర్స్ తెరుచుకుంటే ప్రధాన సమస్య ప్రేక్షకులు రావడం రాకపోవడం కాదు. థియేటర్స్ లో ప్రదర్శించడానికి ఎన్ని సినిమాలు ఉన్నాయి అనేదే ప్రధాన సమస్య.
తెలుగులో అగ్ర హీరోలు అంటే 50 కోట్ల బడ్జెట్ కి అటూ ఇటూ సినిమా తీసి 100 కోట్ల వరకు కలెక్షన్స్ సంపాదించే అవకాశాలు ఉన్న వారు . ఒక్కొక్కరి విషయానికి వద్దాం. చిరంజీవి – కొరటాల శివ ‘ ఆచార్య ‘ సగ భాగంపైన పూర్తి కావాలి. 60 ఏళ్ళు దాటి ఉండటంతో చిరంజీవి షూటింగ్ లో పాల్గొనడానికి మరికొన్ని నెలలు పట్టొచ్చు. ఈ సినిమా 2021లో విడుదల కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బాలకృష్ణ – బోయపాటి శ్రీను సినిమా కూడా వచ్చే ఏడాది మాత్రమే విడులయ్యే పరిస్థితులు ఉన్నాయి. నాగార్జున – సాల్మోన్ అనే కొత్త దర్శకుడితో చేస్తున్న ‘ వైల్డ్ డాగ్’ చిత్రీకరణ దశలో ఉంది.
నాగార్జున క్రిస్మస్ సీజన్ సెంటిమెంట్ ఈసారి కూడా నమ్మితే 2020 డిసెంబరులో రిలీజ్ కావచ్చు. వెంకటేష్ ‘ నారప్ప ‘ సినిమా అయితే ఈ ఏడాది షూటింగ్ కూడా చేసే అవకాశం లేదు . ఈ విషయాన్ని వెంకటేష్ సోదరుడు, ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఇప్పటికే వెల్లడించి ఉన్నారు. మహేష్ బాబు – పరశురామ్ ‘ సర్కార్ వారి పాట ‘ సినిమా యూనిట్ అమెరికాలో షూటింగ్ జరపడానికి సన్నాహాలు ప్రారంభించింది. చిత్ర దర్శకుడు పరశురామ్ కుటుంబ సమేతంగా ఇప్పటికే అమెరికా వెళ్లిపోయారు. మహేష్ బాబు కూడా త్వరలో ఈ సినిమా షూటింగ్ లో పోల్గొనడానికి రెడీ అవుతున్నారు.
ప్రభాస్ ‘ రాధే శ్యామ్’ ఎక్కువ భాగం ఫారిన్ లోనే షూటింగ్ జరుపుకోవాలి. యూనిట్ ఇటలీ వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటోంది. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ కు విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇంకా సినిమా షూటింగ్స్ కి వచ్చే విషయంలో ఓ నిర్ధారణకు రాలేదని అనిపిస్తోంది. ఆయన చేపట్టిన చాతుర్మాస దీక్ష నవంబరు 25కి కానీ పూర్తి కాదు. ఆలోగా రూపురేఖలు మార్చుకుని షూటింగ్ కి వస్తారో రారో తెలియదు. ఒక వైపు రాజకీయపరంగా జోరు పెంచుతూనే వరసగా సినిమాలు ప్రకటిస్తున్నారు. వీటిలో ‘ వకీల్ సాబ్ ‘ మాత్రమే గట్టిగా ట్రై చేస్తే సంక్రాంతికి రిలీజ్ కావచ్చు.
ఇక ఎన్. టి . ఆర్, రామ్ చరణ్ రాజమౌళి ప్రాజెక్టులో ఉండిపోయారు. ఆ సినిమా వచ్చే ఏడాది జులైలో కానీ, దసరాకి కానీ విడుదల కావచ్చు. అల్లు అర్జున్ – సుకుమార్ ‘ పుష్ప ‘ షూటింగ్ మొదలు పెట్టబోతోంది. ఆ సినిమా కూడా వచ్చే ఏడాదే విడుదల అవుతుంది . ఇక విజయ్ దేవరకొండ – పూరి జగన్నాథ్ ల ‘ ఫైటర్ ‘ షూటింగ్ స్టార్ట్ అయితే పూరి స్పీడ్ కి మార్చ్ – ఏప్రిల్ కి విడుదలకు సిద్ధమైపోతుంది. నాని ‘ టక్ జగదీశ్ ‘ కూడా వచ్చే ఏడాది తప్ప విడుదలయ్యే అవకాశం లేదు. ఈ లోగా రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమాలు కొన్నే. రామ్ పోతినేని ‘ రెడ్’ థియేటర్స్ ఎప్పుడు తెరిస్తే అప్పుడు రిలీజ్ చేయడానికి రెడీగా ఉంది.
శర్వానంద్ ‘ శ్రీకారం ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు జోరులో ఉన్నాయి. సాయిధరమ్ తేజ్ ‘ సోలో బతుకే సో బెటర్ ‘ పే ఫర్ వ్యూ లో రిలీజ్ చేయాలా, ఓ థియేటర్స్ కోసం ఎదురు చూడాలా అనే డైలమాలో ఉంది. నితిన్ ‘ రంగ్ దే ‘ సంక్రాంతి రిలీజ్ విడుదలకు ఖర్చీఫ్ వేసుకుంది . ఇక థియేటర్ రిలీజ్ కోసమే ఆగిన సినిమాలు రానా ‘ అరణ్య పర్వం ‘, ప్రదీప్ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా ? ‘ మాత్రమే కనిపిస్తున్నాయి. చిన్న సినిమాలైతే థియేటర్ రిలీజ్ కన్న ఓటీటీలో విడుదలైతే చేతి చమురు వదలకుండా ఎంతో కొంత డబ్బులు వస్తాయని అనుకుంటున్నారు.











