తెలుగుదేశం పాలిట్ బ్యూరో పదవికి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేసినట్లు చెప్పుకుంటున్నారు.
రెండు సార్లు మంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వాల్లో పనిచేసిన గల్లా అరుణ 2014లో తెలుగుదేశంలో చేరారు. ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. అదే ఎన్నికల్లో ఆమె కుమారుడు జయదేవ్ గుంటూరునుంచి బరిలోకి దిగి ఎంపీగా గెలిచారు. 2019లో కూడా గెలిచారు. 2018లో చంద్రబాబు ఆమెను పాలిట్ బ్యూరో సభ్యురాలుగా చేశారు. 2019 ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. తాజాగా ఇప్పుడామె పాలిట్ బ్యూరో సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.
తెరవెనుక కారణం ఇదే..
గల్లా అరుణ తండ్రి పి.రాజగోపాల్ నాయుడు.. చంద్రబాబుకు రాజకీయ గురువు. విద్యార్థి నాయకుడుగా ఉన్నప్పటినుంచి చంద్రబాబు ఆయనకు అనుచరుడు! అరుణకు అప్పటినుంచే పరిచయం. కానీ.. ఇటీవలి పార్లమెంటు సారథుల నియామకం విషయంలో తనను సంప్రదించకుండానే జిల్లాలో నియామకాలు జరిగిపోవడం పట్ల అరుణ కినుక వహించారని సమాచారం. ఆమె సొంత నియోజకవర్గం చంద్రగిరి చిత్తూరు పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఆ పార్లమెంటు ఇన్చార్జిగా పులివర్తి నానిని నియమించారు. అది అరుణకు ఇష్టం లేని నిర్ణయం. ఆ కోపంతోనే ఆమె రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
పూర్వరంగంలో అసలు ఏం జరిగిందంటే..
2014లో తెలుగుదేశంలోకి వచ్చిన అరుణ ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిపోయారు. కొడుకు ఎంపీగా గుంటూరునుంచి గెలిచాడు. 2019లో తిరిగి తననే పిలిచి టికెట్ ఇస్తారని ఆమె ఆశించారు. చంద్రబాబునాయుడు పిలిపించినప్పుడు.. టికెట్ గురించి అడిగితే.. తాను పోటీచేయనని ఆమె అన్నారు. అయితే.. చంద్రబాబు తనను బతిమాలుతాడని, నియోజకవర్గంలో తనను మించి పార్టీకి మరో దిక్కులేదని ఆమె అనుకున్నారు.
కానీ అప్పటికే జిల్లాలో మంత్రిగా చక్రం తిప్పుతున్న అమరనాధ రెడ్డికి సన్నిహితుడైన పులివర్తి నాని టికెట్ కోసం ప్రయత్నాల్లో ఉన్నారు. అమరనాధ రెడ్డి సమక్షంలోనే చంద్రబాబు అరుణను కూర్చోబెట్టి టికెట్ గురించి వాకబు చేసినప్పుడు ఆమె పోటీచేయనని చెప్పడం జరిగింది. ‘అయితే పోన్లే ఇంకెవరినైనా చూద్దాం’ అని చంద్రబాబు అప్పటికప్పుడు తేల్చేశారు. ఇది ఆమెకు పెద్ద షాక్.
ఈ వ్యవహారం ఇంత సులువుగా ముగిసిపోతుందని అరుణ ఊహించలేదు. తనను బతిమాలుతారని, మీరే పోటీచేయాలని పార్టీ అభ్యర్థిస్తుందని ఆశించారు. కానీ అప్పటికే పులివర్తి నానికి టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్న చంద్రబాబు.. అది మనసులో ఉంచుకుని ఈమె నో చెప్పగానే.. ఓకే అనేశారు. ఆ తర్వాత అరుణ అమెరికా వెళ్లారు. అమెరికా బయల్దేరడానికి ముందే పులివర్తి నాని పేరు బయటకు వచ్చేసింది. ఇది ఆమెకు ఇంకా పెద్ద షాక్. తాను అమెరికా నుంచి తిరిగి వచ్చాక మళ్లీ చంద్రబాబు బుజ్జగించి టికెట్ ఇస్తారని ఆమె ఆశించారు. అలా జరక్కపోగా.. మరో పేరు తెరపైకి వచ్చేసింది. దాంతో ఆమె అలక వహించి.. చంద్రగిరి ఎన్నికల్లో క్రియాశీలంగా పాల్గొనకుండా.. పులివర్తి నాని పట్ల అసంతృప్తితోనే పనిచేశారు. కేవలం ఆమె వల్లనే అనలేం గానీ.. పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కర రెడ్డి చేతిలో 40 వేల ఓట్ల తేడాతో ఓడిపోాయారు.
తాజాగా పార్లమెంటు నియోజకవర్గాలకు సారథుల ఎంపిక నేపథ్యంలో.. చిత్తూరు పార్లమెంటుకు పులివర్తి నాని పేరును ప్రకటించారు. దీంతో అరుణకు రాబోయే ఎన్నికల్లో కూడా మళ్లీ ఎమ్మెల్యేగా బరిలోకి దిగే అవకాశాలు పూర్తిగా మూసుకుపోయినట్లే. పులివర్తి నాని అంటేనే మండిపడుతున్న అరుణ.. తనను సంప్రదించకుండానే.. ఆయనకు సారథ్యం కట్టబెట్టడానికి నిరసనగానే పాలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేసేసినట్లు సమాచారం.
ఆమె కొడుకు జయదేవ్ తెదేపా రాజకీయాల్లో ఎంపీగా చక్రం తిప్పుతూనే ఉన్నారు. మరి వారి కుటుంబ రాజకీయాలు ముందు ముందు ఎలా మలుపులు తిరుగుతాయో చూడాలి.











