టిఆర్ఎస్ ప్రభుత్వంపై బిజెపి నేత, ఎమ్మెల్సీ రాంచందర్ రావు విరుచుకుపడ్డారు. హైదరాబాద్ నగరాభివృద్ధి పేరుతో టిఆర్ఎస్ ప్రభుత్వం రూ.60 వేల కోట్లు స్వాహా చేసిందని తాజాగా ఆరోపించారు. హైదరాబాద్ అభివృద్ధి కోసం తెరాస చేసిందేమిటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. చిన్న వర్షానికే హైదరాబాద్ అతలాకుతలం అవుతోందని మండిపడ్డారు. గ్రేటర్ ఎన్నికలపై ఆయన మీడియాతో ఇలా స్పందించారు. ఈ సారి మేయర్ పీఠం బిజెపి కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే గ్రేటర్ ఎన్నికల్లో బిజెపి 80 డివిజన్లను గెలుస్తోందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
గ్రేటర్ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అధికార, విపక్ష పార్టీ నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మరోసారి గ్రేటర్‌లో అధికారం తమదేనని, 100 సీట్లు గెలవబోతున్నట్లు అధికార పార్టీ నేతలు చెబుతుంటే, మరోవైపు ఈ సారీ సర్వేలన్నీ తమకే అనుకూలంగా ఉన్నాయని, 80 డివిజన్లను బిజెపి గెలవబోతున్నట్లు బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎవరికి వారు తమ తమ అంచనాలను, అభిప్రాయాలను వ్యక్తం చేస్తుందడటం ఎన్నికల వేడి రాష్ట్రానికి తాకిందనే సంకేతాలను ఇస్తున్నారు.
గ్రేటర్‌లో ముందస్తు ఎన్నికలు తప్పవనే సంకేతాలను పార్టీ నేతలకు కెటిఆర్ ఇస్తున్నారు. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు సొంత సర్వేలు చేసుకుంటున్నాయి. ప్రజల్లో తమకు ఏ మాత్రం బలం ఉందనే అంచనాలను తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. వందకు పైగా సీట్లు గెలవబోతున్నట్లు తమకే అనుకూలంగా సర్వేలు వచ్చినట్లు సిఎం కెసిఆర్ ఇప్పటికే పార్టీ సమావేశంలో చెప్పిన విషయం తెలిసిందే. అలాగే మంత్రి కేటిఆర్ కూడా పలు సందర్భాల్లో ఇదే విషయాన్ని చెప్పారు. అలాగే మేయర్ పీఠం బిజెపిదేనని సర్వేలు చెబుతున్నాయని, గతంలో గెలిచిన ఏ ఒక్క కార్పొరేటర్ పైన ప్రజలకు సదాభిప్రాయం లేదని తాజాగా బిజెపి నేత రాంచందర్‌రావు తెలుపడం గమనార్హం. గెలుపు ఓటములపై సర్వేలు చేయించడం, ఆ సర్వేలపై ప్రధాన పార్టీలు మాట్లాడటం, విమర్శలు గుప్పించుకోవడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ఇలా ఎవరికి వారు మేయర్ పీఠం తమదంటే తమదని విమర్శనాస్త్రాలు సంధించుకుని ఓటర్లను ప్రభావితం చేసే పనిలో రాజకీయ నేతలు పడ్డారు. ఈనేపథ్యంలో రాంచందర్ రావు చేసిన వ్యాఖ్యలను ఎన్నికల ప్రచార సరళిలో భాగంగానే చూడాలని అంటున్నారు.











