‘సింహా’, ‘లెజెండ్’ కాంబినేషన్ కు ఉన్న ప్రత్యేకత ఏమిటో అందరికీ తెలుసు. బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వంలో సినిమా అంటేనే అదో పవర్. ఈ కాంబినేషన్ లో సినిమా ప్రారంభమై కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. ఆ మధ్య బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టీజర్, అందులో పంచ్ డైలాగ్స్ బాలయ్య బాబు అభిమానుల్ని ఉర్రూతలూగించాయి. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ నెల 29 నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం.
ఇంతకుముందు ఒక షెడ్యూల్ మాత్రమే జరిగింది. 29న ప్రారంభమయ్యే మరో షెడ్యూల్ తో నిరవధికంగా షూటింగ్ కొనసాగిస్తారు. బాలయ్యబాబు అభిమానులు కోరుకునే మాస్ మసాలా అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయట. మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ ను బాలయ్య సరనన నటించేందుకు తీసుకున్నట్లు సమాచారం. ఇందులో మరో హీరోయిన్ కూడా ఉండే అవకాశం ఉంది. సింహా, లెజెండ్ సినిమాలు సృష్టించిన రికార్డ్స్ తెలుగు సినిమా బాక్స్ ఆఫీస్ ఇంకా మర్చిపోలేదు. మళ్లీ ఈ సినిమా మీద అలాంటి అంచనాలే నెలకొన్నాయి. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి మాటలు ఎం. రత్నం, సంగీతం : ఎస్ . ఎస్ . థమన్, కథ – స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను.