పవన్ కళ్యాణ్, సాయితేజ్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన బ్రో జనం ముందుకొచ్చింది. ఈ సినిమాలో ఏముంది? ప్రేక్షకుల మనసు దోచుకుందా లేదా? అనే విషయాలను చూద్దాం.
కథ ఏమిటి?
ప్రతిదానికీ టైమ్ లేదంటూ ఉండే మార్కండేయులు (సాయితేజ్) మరణించడం, అతన్ని తీసుకెళ్లడానికి వచ్చిన టైమ్ దేవుడు (పవన్ కళ్యాణ్) తిరిగి బతికించడం ప్రధాన అంశం. మార్కండేయులుకు 90 రోజుల జీవితాన్ని మాత్రమే ప్రసాదిస్తాడు టైమ్. మార్కండేయులు అనే మార్క్ కు తల్లి, ఇద్దరు చెల్లెళ్లు, ఓ తమ్ముడు.. వాళ్ల బాధ్యతలను కూడా అతనే మోస్తాడు. వాళ్లు జీవితంలో స్థిరపడేలా చేయాలన్నదే మార్క్ ఉద్ధేశం. పైగా మార్క్ కు ఓ లవర్ రమ్య కూడా ఉందండోయ్. ఆ అమ్మడుతో గడిపే టైమ్ కూడా అతనికి ఉండదు మరి. దేవుడు తిరిగి ప్రసాదించిన 90 రోజుల సమయంలో అతను ఏం చేశాడు? ఒక వేళ అతను చనిపోయి ఉంటే ఏంజరిగి ఉండేది అనే అంశాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.
ఎలా తీశారు? ఎలా చేశారు?
ఈ కథకు ఓ రూపం తెచ్చింది త్రివిక్రమ్ అయితే దీనికి తెరరూపం ఇచ్చింది సముద్రఖని. కమర్షియల్ ఫార్ములాలో వేదాంతం చెప్పాలన్న తపన కనిపించిందిగానీ దాన్ని ఎలా చెప్పాలో తెలియలేదు. ఆ తప్పు త్రివిక్రమ్ దా? దర్శకుడిదా అంటే సమాధానం చెప్పలేం. అసలు ఇలాంటి కథలకు స్టార్ హీరోని తీసుకోవడమే పెద్ద తప్పిదం. అటు స్టార్ కీ న్యాయం చేయాలి, ఇటు కథకూ న్యాయం చేయాలి అంటే సరిగా కుదిరే పనికాదు.
అందుకే సినిమా నడక అంతా ఎగుడుదిగుడుగానే సాగింది. పోనీ త్రివిక్రమ్ మాటల మంత్రాలు పనిచేశాయా అంటే అదీ లేదు. కథలో సోల్ మిస్సయి సొల్లు మిగిలింది. పవన్ కళ్యాణ్ పాత్ర సినిమా చివరి వరకూ ఉన్నా ఆయన హీరోయిజం ఎలివేషన్ మీద ఫోకస్ పెట్టి పవర్ స్టార్ భజంత్రీల బ్యాచ్ లో చేరిపోవాలన్న కోరికతో సముద్రఖని ఈ సినిమా తీసినట్టుంది. ఎక్కడో అక్కడ ఏదో ఒక అద్భుతం జరగకపోతుందా అన్న అశతో ప్రేక్షకుడు సినిమా చివరివరకూ తపించిపోతాడు.
తప్పులు ఎక్కడ జరిగాయి?
* దేవుడి పాత్రకే దర్శకుడు టైమ్ ఎక్కువ కేటాయించి ఇచ్చిన ఎలివేషన్స్ మొహం మొత్తించాయి. ముఖ్యంగా పవర్ స్టార్ పాత పాటలు, మేనరిజమ్స్ డోస్ ఎక్కువైంది.
* కథనం బలహీనంగా ఉంది. కథతో ప్రేక్షకుడిని ట్రావెల్ చేయించలేకపోవడం. వినోదం కోసం చేసే ప్రయత్నాలు కూడా బెడిసి కొట్టాయి.
* పవర్ స్టార్ ని మ్యాగ్జిమమ్ ఉపయోగించుకోవాలన్న దర్శకుడి తపన. డైలాగ్స్ రాయడంలోనూ త్రివిక్రమ్ డెస్క్ సభ్యులు సరిగా పనిచేయలేదేమో.
* బాగున్న డైలాగ్స్ కూడా ప్రేక్షకులకు చేరేలా లేకపోవడం.
* తమిళ మాతృకలో చాలా మార్పులు చేసినప్పుడు క్లైమాక్స్ మార్చాలన్న ఆలోచన ఎందుకు రాలేదో?
* సాయిధరమ్ తేజ్ పాత్ర ఏంసాధించినట్టు. ప్రేమించిన అమ్మాయిని కూడా పొందలేకపోతాడు. ఆ పాత్రకు మరణమే శరణ్యమని, అలా చేస్తే జనం యాక్సెప్ట్ చేస్తారని దర్శకుడు ఎందుకు భావించాడో?
* కొన్ని పాత్రలు ఎందుకు ఉన్నాయో కూడా అర్థం కాదు. బ్రహ్మానందానికి ఓ అవకాశం ఇవ్వాలి కాబట్టి ఓ సన్నివేశం, రాజా చెంబోలు న్యాయం చేయాలి కాబట్టి ఇంకో సన్నివేశం, వెన్నెల కిషోర్ తో నవ్వించేందుకు విఫలయత్నం.
* పృధ్వీరాజ్ పాత్ర ఓ రాజకీయ నాయకుడిని తలపించినా అది కూడా అసంపూర్ణమే. సముద్రఖని పాత్ర ప్రయోజనం ఏమిటో?
* ఇలాంటి సినిమాకి పాటలు కూడా అనవసరమే.
సినిమాలో ఏం బాగుంది?
* చావు పుట్టుకల మీద చెప్పిన జీవన వేదాంతం సందేశాత్మకంగా ఉంది.
*తమన్ బీజీఎం
* ఏమాత్రం తగ్గని పవర్ స్టార్ గ్లామర్.. టైమింగ్
*సాయితేజ్ కుటుంబలో బంధాలు, అనుబంధాలు
నటీనటులు: పవన్ కళ్యాణ్, సాయితేజ్, కేతిక శర్మ, ప్రియా ప్రకాష్ వారియర్, రోహిణి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, సుబ్బరాజు, వెన్నెల కిషోర్ తదితరులు.
సంగీతం: తమన్
కెమెరా: సుజిత్ వాసుదేవన్
ఎడిటర్: నవీన్ నూలి
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల
స్క్రీన్ ప్లే – మాటలు : త్రివిక్రమ్
దర్శకత్వం: సముద్రఖని
విడుదల తేదీ: 28-7- 2023
ఒక్క మాటలో: బ్రోచేవారెవరో
రేటింగ్ : 2.5/5