ఏపీలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాష్ట్రంలో డ్రగ్స్ దందాను అడ్డుకోవాలంటూ మాట్లాడిన టీడీపీ నేతలకు పోలీసుల నోటీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ చేసిన వ్యాఖ్యలు అనుచితంగా ఉన్నాయంటూ వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయాలపై దాడులకు దిగాయి. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటుగా పలు జిల్లాల కార్యాలయాలు, పట్టాభి, నందమూరి బాలకృష్ణ ఇళ్లపైనా వైసీపీ శ్రేణులు దాడులకు తెగబడిన తీరు తెలిసిందే. ఈ దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాతో పాటుగా మెయిన్ మీడియాలోనూ పదే పదే కనిపిస్తున్నాయి. ఓ రాజకీయ పార్టీకి చెందిన కార్యాలయాలపై ఈ తరహాలో దాడులు చేస్తారా? అంటూ ప్రజాస్వామ్యవాదులు నోరెళ్లబెడుతున్నారు. అసభ్య పదజాలం వినియోగించిన నేతపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన జగన్ పార్టీ.. ఇలా భౌతిక దాడులకు దిగడమేమిటన్న కోణంలో రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ఘాటు వ్యాఖ్యలే వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో వివాదాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచే ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ కూడా తనదైన శైలిలో స్పందించారు.
వర్మ ఏమంటారంటే..?
ఏపీలో మంగళవారం నాడు చోటుచేసుకున్న పరిణామాలు, బుధవారం జరిగిన తదనంతర పరిణామాలను పరిశీలించిన రాంగోపాల్ వర్మ.. గురువారం ఉదయం తన ట్విట్టర్ వేదికగా తనదైన శైలి పంచ్ డైలాగ్‌ను సంధించారు. ఈ ట్వీట్‌లో వర్మ ఏమన్నారంటే.. ‘‘ ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే.. త్వరలోనే ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే, కర్రసాము తదితర విద్యలను నేర్చుకోవాల్సిన అవసరం ఉంది’’ అని వర్మ తనదైన శైలి సెటైర్ వేశారు. వర్మ అన్నట్లుగానే.. మంగళవారం నాడు టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు చేసిన దాడులను పరిశీలిస్తే.. ఏపీ రాజకీయాల్లో రాణించాలంటే.. ఇకపై యుద్ధ విద్యలను కూడా నేర్చుకోవాల్సిన అసవరం ఉందన్న కోణంలో సరికొత్త విశ్లేషణలు వినిపిస్తున్నాయి.