ఓటీటీ ‘ఆహా’ కోసం భలే బంధాన్ని ‘అల్లు’కుంటున్నారు అరవింద్. నిన్న బాలయ్యతో ప్రారంభించారు. ఇప్పుడు మోహన్ బాబుతో మంచు కురిపించబోతున్నారు ఈ మెగా ప్రొడ్యూసర్. తెలుగు వారి ఓటీటీ అంటూ ఆహాను ఆరంభించడం.. అనతి కాలంలోనే సక్సెస్ సాధించడం తెలిసిందే. విభిన్న కథా చిత్రాలను, వెరైటీ టాక్ షోలను అందిస్తూ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మెగా ప్రొడ్యూసర్ అయిన అల్లు అరవింద్.. ఆహా కోసం నందమూరి బాలయ్యను రంగంలోకి దింపారు. బాలయ్యతో టాక్ షో ప్లాన్ చేశారు.
అన్ స్టాపబుల్ అంటూ వెరైటీ టాక్ షో చేస్తున్నారు. త్వరలో ఈ టాక్ షో ప్రసారం ప్రారంభం కానుంది. ఇటీవల ఈ టాక్ షో గురించి ఓ ఈవెంట్ ప్లాన్ చేయడం జరిగింది. దీంతో ఈ టాక్ షో ఎప్పుడెప్పుడు స్టార్ట్ కానుందా అనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది. ఇదిలా ఉంటే.. ఇప్పుడు అల్లు అరవింద్.. కలెక్షన్ కింగ్ మోహన్ బాబును కూడా రంగంలోకి దింపుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇంతకీ విషయం ఏంటంటే… ఓ తమిళ నిర్మాత రాసిన వెబ్ సిరీస్ ను ఆహాలో ప్రసారం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ సిరీస్ ను గ్రాండ్ గా లాంచ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారని.. దీనికి మోహన్ బాబుని గెస్ట్ గా పిలిచి ఈ సిరీస్ ని లాంచ్ చేయించాలి అనుకుంటున్నారట. ఇప్పటికే మంచు లక్ష్మీ ఆహాలో ఓ కార్యక్రమం చేస్తున్నారు. ఈ క్రమంలో మంచు మోహన్ బాబు ఆహాలో ఎంట్రీ ఇవ్వనున్నారు అంటున్నారు. ఈ ఈవెంట్ కి గెస్ట్ గా రావడమే కాకుండా మోహన్ బాబుతో కూడా స్పెషల్ పొగ్రామ్ ప్లాన్ చేయాలి అనుకుంటున్నారని టాక్ వినిపిస్తోంది. మరి.. కలెక్షన్ కింగ్ డిజిటల్ ఎంట్రీ ఎలా ఉంటుందో చూడాలి.











