ఒకప్పుడు కృష్ణా జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పి, గన్నవరం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా వెలుగొందిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజా పరిస్థితి పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చనీయాంశమైంది. గన్నవరం ఎయిర్‌పోర్టులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాక సందర్భంగా..వంశీ సాధారణ కార్యకర్తలా బారికేడ్ల వెనుక నిలబడి తోసుకుంటూ కనిపించడం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అధినేత కళ్లలో పడేందుకు, ఆయన ఒక్కసారి తనవైపు చూస్తారనే ఆశతో ఎయిర్‌పోర్టు బారికేడ్ల వద్ద పడిగాపులు కాస్తున్న వంశీని చూసిన ప్రత్యర్థులు కూడా అయ్యో పాపం అంటున్నారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు తనకంటూ ప్రత్యేక గుర్తింపును, గౌరవాన్ని అనుభవించారు వంశీ. చంద్రబాబు సైతం వంశీని ప్రోత్సహించారు. ఐతే, 2019 తర్వాత వ్యక్తిగత ప్రయోజనాల కోసం కన్నతల్లి లాంటి తెలుగుదేశం పార్టీని వీడారు. వైసీపీలో చేరి టీడీపీ అధినేతపై, ఇతర నేతలపై విమర్శలు చేసి వివాదాస్పదమైన వ్యక్తిగా మారిపోయారు.
ఇప్పుడు వైసీపీ అధికారం కోల్పోయాక జైలు శిక్ష సైతం అనుభవించారు. ఇంత చేసినా జగన్ అపాయింట్‌మెంట్ కూడా దక్కని స్థితికి చేరుకోవడం, మరోవైపు గతంలో చేసిన వ్యాఖ్యల కారణంగా ఇతర పార్టీల తలుపులు మూసుకుపోవడంతో వంశీ ఎటూ వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు. ఒకప్పుడు చుట్టూ వందలాది మంది అనుచరులు, సెక్యూరిటీతో తిరిగిన నేత ఇవాళ జగన్ కళ్లల్లో పడేందుకు ఎయిర్‌పోర్టు బారికేడ్ల దగ్గర దీనంగా ఎదురుచూడడం నిజంగా స్వయంకృతాపరాధమే.
ఆత్మాభిమానాన్ని తాకట్టుపెట్టి చేసే రాజకీయం చివరికి ఎలాంటి దుస్థితికి దారితీస్తుందో వంశీ జీవితమే తాజా ఉదాహరణ స్పష్టం చేస్తోంది. తాత్కాలిక ప్రయోజనాల కోసం విలువలు, నైతికతను పక్కనపెట్టిన నాయకులకు.. కాలం ఎలా తగిన సమాధానం చెబుతుందో ఈ పరిణామం కళ్లకు కడుతోంది.











