కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన కీలక భేటీతో సంచలన పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ భేటీ జరిగిన మరుసటి రోజే వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి లక్ష్యంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆకస్మిక దాడులకు దిగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అమిత్ షా, చంద్రబాబుల భేటీకి.. ఏపీలో జరుగుతున్న ఈ తాజా దాడులకు మధ్య ఉన్న టైమింగ్ ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హ*త్య కేసు దర్యాప్తులో భాగంగా శుక్రవారం తెల్లవారుజాము నుంచే ఈడీ అధికారులు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఇప్పటివరకు సీబీఐ విచారణకే పరిమితమైన ఈ కేసులో, తెరవెనుక జరిగిన ఆర్థిక లావాదేవీల కోణాన్ని వెలికితీసేందుకు ఈడీ ఎంటర్ కావడం ఈ వ్యవహారాన్ని మరో మలుపు తిప్పింది. మనీలాండరింగ్, అనుమానాస్పద నగదు బదిలీలే లక్ష్యంగా హైదరాబాద్, పులివెందుల సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు 10 చోట్ల అధికారులు ఏకకాలంలో దాడులు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఎంపీ అవినాశ్ రెడ్డి ఇళ్లు, ఆయన కార్యాలయాల్లో జల్లెడ పడుతున్న ఈడీ.. ఆయన ఆస్తుల వివరాలను, బ్యాంకు లావాదేవీలను నిశితంగా పరిశీలిస్తోంది. ఇందుకు సంబంధించిన కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకునే పనిలో పడింది.
మరోవైపు, కేవలం అవినాశ్ రెడ్డిని మాత్రమే కాకుండా.. వివేకా హ*త్య కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక వ్యక్తులందరి ఇళ్లపైనా ఈడీ అధికారులు గురిపెట్టారు. పులివెందులలోని దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, వైఎస్ జగన్ సమీప బంధువు సునీల్ రెడ్డి ఇళ్లతో పాటు.. తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలోని ఎర్ర గంగిరెడ్డి నివాసంలో వేర్వేరు బృందాలుగా విడిపోయి సోదాలు కొనసాగిస్తున్నారు. వివేకా హ*త్య వెనుక ఆర్థిక కోణాలు, హవాలా నిధుల మళ్లింపు ఏమైనా జరిగిందా అనే దానిపై ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
ఏకకాలంలో ఇంత భారీ స్థాయిలో వివేకా కేసు నిందితులపై ఈడీ దాడులు జరగడం చూస్తూంటే కేంద్రం వివేకా కేసులో సిరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. అమిత్ షా కనుసన్నల్లోనే దర్యాప్తు సంస్థలు వేగం పెంచాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి నిన్న అమిత్ షాతో చంద్రబాబు భేటీ.. ఇవాళ ప్రతిపక్ష వైసీపీకి ఈడీ రూపంలో తగిలిన ఈ భారీ షాక్.. ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించడం ఖాయం.











