కొన్ని సినిమాల నుంచి టీజర్ గానీ .. ట్రైలర్ గాని బయటికి రాగానే, ఆ సినిమాలు హిట్ అవుతాయనే విషయం ముందుగానే తెలిసిపోతుంది. అలా మొదటి నుంచి అంచనాలు పెంచుతూ వెళ్లిన సినిమాగా ‘ఉప్పెన’ కనిపిస్తుంది. తొలి రోజునే హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి ప్రేమకథగా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ‘బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్’కు రాజమండ్రి వేదికగా మారింది. ఈ వేడుకకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు.
ఈ వేదికపై చరణ్ మాట్లాడుతూ .. “వైష్ణవ్ తేజ్ నాకంటే .. తేజు కంటే చాలా యాక్టివ్ గా ఉంటాడు. అతను ఈ సినిమాతో విజయాన్ని అందుకుంటాడని మేమంతా ముందుగానే ఊహించాము. వైష్ణవ్ కి నటనపట్ల గల ఆసక్తిని గమనించి మా బాబాయ్ కల్యాణ్ అతన్ని విదేశాలకి పంపించి యాక్టింగ్ నేర్పించారు. ఇక మా నాన్న నా విషయంలో కంటే ఎక్కువగా అతని విషయంలో కేర్ తీసుకున్నారు. ఈ కథను నాన్న నాలుగుసార్లు వినడమే అందుకు నిదర్శనంగా చెప్పుకోవాలి. అలాంటి మావయ్యలు దొరకడం వైష్ణవ్ అదృష్టం.
ఇక కృతి శెట్టి విషయానికొస్తే .. ఈ సినిమాలో తాను చాలా బాగా చేసింది. మొదటి సినిమాతోనే కుర్రాళ్లందరి మనసులను దోచేసింది. ఈ మధ్య కాలంలో మొదటి సినిమాకే ఇంతటి ఫాలోయింగ్ ఉన్న హీరోయిన్ గా కృతి శెట్టి కనిపిస్తోంది. మున్ముందు ఆమె చాలా బిజీ అవుతుందనే నమ్మకం ఉంది. హీరో .. హీరోయిన్ .. దర్శకుడు ముగ్గురూ కొత్తవాళ్లే అయినా, వాళ్లపై గల నమ్మకంతో ఈ సినిమా తీయడానికి సాహసించిన మైత్రీ వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ విజయంలో ప్రధానమైన పాత్రను పోషించిన బుచ్చిబాబుకు .. దేవిశ్రీ ప్రసాద్ కి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను” అంటూ ఆప్యాయంగా వాళ్లను ఆలింగనం చేసుకున్నారు.











